breaking news
Aspiring Minds Study
-
భవిష్యత్తులో రాష్ట్రంలో 37.5 శాతం తగ్గనున్న ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సమీప భవిష్యత్తులో దేశంలో గణనీయమైన స్థాయిలో ఉద్యోగాలకు ఎసరు పెడుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇప్పటికే వివిధ రంగాల్లో కీలకపాత్ర పోషిస్తున్న ఆటోమేషన్ (యాంత్రీకరణ) వంటి సాంకేతిక ప్రక్రియల ప్రభావంతో భవిష్యత్తులో మానవవనరుల ఆధారిత ఉద్యోగాలు తగ్గిపోతాయని యాస్పైరింగ్ మైండ్స్ అనే సంస్థ ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్–2018 పేరిట రూపొందించిన నివేదికలో అంచనా వేసింది. భవిష్యత్తు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ అండ్ రోబోటిక్స్‌దేనని తెలిపింది. ఆటోమేషన్ కారణంగా ఢిల్లీలో అత్యధికంగా 45.1% ఉద్యోగాలు తగ్గిపోనున్నాయని, తెలంగాణలో 37.5% ఉద్యోగాలు తగ్గిపోతాయని నివేదిక పేర్కొంది. అదే సమయంలో సాఫ్ట్ స్కిల్స్, అంచనా సామర్థ్యాలు ఆ స్థానాన్ని భర్తీ చేస్తాయని వివరించింది. డేటా అనాలిసిస్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, ప్రాజెక్టు మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, జనరల్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో ఆటోమేషన్ ప్రభావం తక్కువగా ఉంటుందని, అక్కడ మానవ వనరులే కీలకమని నివేదిక వివరించింది. ఏఐ, రోబోటిక్స్‌తో నూతన శకం... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్ అండ్ రోబోటిక్స్, ఆటోమేషన్ వల్ల దేశంలో నూతన శకం రాబోతోందని నివేదిక పేర్కొంది. ఆటోమేషన్ కారణంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయన్న ఆందోళన నెలకొన్నా ఆయా రంగాల్లోనూ మానవ అవసరాల పాత్ర ప్రముఖంగానే ఉంటుందని వెల్లడించింది. భవిష్యత్తులో మన దేశంలో ఆటోమేషన్ ప్రభావం ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల్లో 42 శాతం మేర ఉండనున్నప్పటికీ, ఆ రంగంలో 31 శాతం మేర ఉద్యోగాలు ఉంటాయని పేర్కొంది. సాఫ్ట్వేర్ డెవలపర్, సపోర్ట్ టెక్నీషియన్, నెట్వర్కింగ్ ఇంజనీర్, సిస్టమ్ అనలిస్ట్, అనుబంధ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయని తెలిపింది. సివిల్, మెకానికల్ వంటి సబ్జెక్టులుగల కోర్ ఇంజనీరింగ్ చదివిన వారికి 7 శాతమే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని పేర్కొంది. అయితే ఆంగ్ల భాషా నైపుణ్యం అవసరమైన రంగాల్లో ఉద్యోగాలకు 100 శాతం డిమాండ్ ఉంటుందని, సేల్స్, మార్కెటింగ్ రంగాల్లోనూ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉండనున్నాయని నివేదిక వెల్లడించింది. లేబర్ మార్కెట్లోని 30 రకాల ఉద్యోగాల్లో మానవ నైపుణ్యాలకు అధిక డిమాండ్ ఉంటుందని వివరించింది. బిజినెస్ అభివృద్ధి, ఆదాయ వృద్ధిలో కీలకమైన సేల్స్ రంగంలో 12 శాతం ఉద్యోగాలు లభిస్తాయని నివేదిక అంచనా వేసింది. లాజికల్ ఎబిలిటీ, భాషా నైపుణ్యాలు కలిగిన ఇందులో ప్రధానంగా అవసరమని పేర్కొంది. సంప్రదింపుల్లో వాక్చాతుర్యంతో ఇతరులను ప్రభావితం చేయగలగాలని పేర్కొంది. కస్టమర్ సర్వీసు విభాగంలో భారీగా ఆటోమేషన్... కస్టమర్ సర్వీస్‌లో ఆటోమేషన్ పాత్ర మరింత పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది. 2020 నాటికి 85 శాతం మేర ఆటోమేషన్ ప్రక్రియ ద్వారానే కస్టమర్ ఇంటరాక్షన్ జరుగుతుందని పేర్కొంది. అలాగే అకౌంటింగ్, బ్యాంకింగ్ రంగాల్లో ఆటోమేషన్ వినియోగం మరింత పెరుగుతందని వివరించింది. భవిష్యత్తులో ఆటోమేషన్తో వివిధ రాష్ట్రాల్లో తగ్గనున్న ఉద్యోగాలు... రాష్ట్రం తగ్గనున్న ఉద్యోగాల శాతం ఢిల్లీ 45.1 పశ్చిమ బెంగాల్ 42.2 హరియాణా 39.3 ఉత్తరప్రదేశ్ 39 రాజస్తాన్ 37.8 మధ్యప్రదేశ్ 37.8 కర్ణాటక 37.8 తమిళనాడు 37.6 తెలంగాణ 37.5 ఆంధ్రప్రదేశ్ 37.2 -
అదొక చెత్త స్టడీ: మండిపడ్డ ఐటీ నిపుణుడు
భారత టెక్కీల సత్తాను తక్కువ చేస్తూ వచ్చిన అధ్యయనంపై ఐటీ ఇండస్ట్రి ప్రముఖుడు, మాజీ ఇన్ఫోసిస్ టాప్ బాస్ టీవీ మోహన్ దాస్ పాయ్ మండిపడ్డారు. 95 శాతం మంది భారత ఇంజనీర్లు సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ ఉద్యోగాలకు పనికిరారంటూ వెల్లడించిన యాస్పైరింగ్ మైండ్స్ అధ్యయనాన్ని ఆయన ఖండించారు. అదొక్క చెత్త అధ్యయనమని అభివర్ణించారు.భారత టెక్కీల సామర్థ్యాలకు పాయ్ తన మద్దతు పలికారు. యాస్పైరింగ్ మైండ్స్ విడుదల చేసిన సర్వేలో 95 శాతం మంది ఇంజనీర్లు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉద్యోగాలకు పనికిరారని, కేవలం 4.77 శాతం మంది మాత్రమే ఒక ప్రోగ్రామ్‌కు సరైన కోడ్ రాయగలుగుతున్నారని పేర్కొంది. ఈ అధ్యయనంపై పాయ్ ట్విట్టర్ ద్వారా తన అభ్యంతరాన్ని తెలిపారు. టీవీ మోహన్ దాస్ పాయ్ అభిప్రాయానికి తాను కూడా మద్దతు పలుకుతున్నానని మరో బిజినెస్ లీడర్ కిరణ్ మజుందర్ షా కూడా తెలిపారు.వారు ఎక్కడి నుంచి ఇంజనీర్ల సామర్థ్యాలపై అనుమానాలు రేకెత్తిస్తున్నారో తెలియదన్నారు. బ్లూ కాలర్ వర్కర్లు కూడా భవిష్యత్తు కోడర్స్ అని ఆమె పేర్కొన్నారు. గత ఫిబ్రవరిలో కూడా చాలా మంది ఇంజనీర్లకు ట్రైనింగ్ లేదనే విషయాన్ని కూడా పాయ్ ఖండించారు. దేశీయ ఐటీ నిపుణుల సామర్థ్యాలపై ఆయన విశ్వాసాన్ని వ్యక్తంచేశారు. 60-65 శాతం మందికి ట్రైనింగ్ లేదనేది చాలా తప్పు అని చెప్పారు. అది చాలా తప్పుడు ప్రకటనన్నారు.