breaking news
Ashwini Ponappa
-
రూ. 1.5 కోట్లా?.. భారత బ్యాడ్మింటన్ స్టార్ ఫైర్
నిరాధార వార్తలు రాస్తే సహించే ప్రసక్తే లేదని భారత బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్యారిస్ ఒలింపిక్స్-2024కు సన్నద్దమయ్యే క్రమంలో ప్రభుత్వం తనకు రూ. 1.5 కోట్లు కేటాయించినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. విశ్వ క్రీడలకు సిద్దమయ్యేందుకు కేంద్ర క్రీడా శాఖ టార్గెట్ ఒలింపిక్ పోడియం ఫినిష్ స్కీమ్(TOPS) పేరిట టాప్ అథ్లెట్ల శిక్షణకై నిధులు కేటాయించింది.అయితే, అంచనాలకు అనుగుణంగా భారత క్రీడాకారులు రాణించలేకపోయారు. ప్యారిస్‌లో కేవలం ఆరు పతకాలు మాత్రమే గెలిచి స్వదేశానికి తిరిగి వచ్చారు. భారత్‌కు ఈ సారి షూటింగ్లో మూడు, హాకీ పురుషుల జట్టు, రెజ్లింగ్‌లో ఒక్కో కాంస్యం, జావెలిన్ త్రోలో రజతం మాత్రమే వచ్చాయి. ముఖ్యంగా భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ స్టార్లు పూర్తిగా నిరాశపరిచారు.పీవీ సింధు, లక్ష్య సేన్, హెచ్ ఎస్ ప్రణయ్ తదితరులు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఈ క్రమంలో భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె సైతం భారత షట్లర్ల తీరును విమర్శస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగానూ ఓటములకు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని చురకలు అంటించారు.కోట్ల రూపాయల నిధులుఈ నేపథ్యంలో వార్తా సంస్థ పీటీఐ.. భారత షట్లర్లకు TOPS కేటగిరీలో కేంద్రం కేటాయించిన నిధులకు సంబంధించి ఓ కథనం వెలువరించింది. ఆ వివరాల ప్రకారం.. ‘‘2023 వరల్డ్ చాంపియన్‌షిప్స్, ఆసియా క్రీడల కాంస్య పతక విజేత హెచ్ఎస్ ప్రణయ్ ఒలింపిక్స్‌కు సిద్దమయ్యేందుకు.. క్రీడా శాఖ 1.8 కోట్ల రూపాయలు కేటాయించింది.అయితే, చికున్‌గున్యా బారిన పడ్డ ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత్‌కే చెందిన లక్ష్యసేన్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టాడు. ఇక పీవీ సింధు జర్మనీ ట్రెయినింగ్ కోసం రూ. 26.60 లక్షలు, లక్ష్యసేన్‌కు ఫ్రాన్స్‌లో శిక్షణ కోసం రూ. 9.33 లక్షల నిధులు విడుదల చేసింది. ఇక ఇప్పటికే రెండుసార్లు ఒలింపిక్ పతకాలు సాధించిన సింధు ప్రిపరేషన్ కోసం ఓవరాల్‌గా 3.13 కోట్ల ఆర్థిక సహాయం అందించింది. అయితే, ఆమె కూడా ప్రిక్వార్టర్స్‌లో వెనుదిరిగింది.ఇక మహిళల డబుల్స్ జోడీ అశ్విని పొన్నప్ప, తానిషాలకు ఒక్కొక్కరికి 1.5 కోట్ల రూపాయల మేర నిధులు విడుదల చేసింది. అయితే, వారు గ్రూప్ స్టేజిలోనే ఎలిమినేట్ అయిపోయారు. మరోవైపు.. పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి కోసం ఏకంగా భారీ మొత్తంలో రూ. 5.62 కోట్ల నిధులు కేటాయించింది. ఈ జోడీ క్వార్టర్ ఫైనల్ కూడా దాటలేకపోయింది. ఓవరాల్‌గా బ్యాడ్మింటన్ బృందానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAI) రూ. 72.03 కోట్లు ఖర్చుపెట్టింది’’.ఒక్కొక్కరికి రూ. 1.5 కోట్లా? ఈ మేర వివరాలను ఉటంకిస్తూ పీటీఐ ఇచ్చిన ఆర్టికల్‌పై అశ్విని పొన్నప్ప ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి ఆర్టికల్స్ ఎలా రాస్తారు? ఈ అబద్దాన్ని ఎందుకు రాశారు? ఒక్కొక్కరికి రూ. 1.5 కోట్లా? ఎవరి నుంచి? ఎవరికి? ఎందుకు? నేను ఎవరి నుంచి ఎలాంటి డబ్బు తీసుకోలేదే! అసలు TOPS ఫండింగ్‌లో నా పేరు కూడా లేదు’’ అని ఎక్స్ వేదికగా అశ్విని పొన్నప్ప తనపై జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేసింది.చదవండి: నీరజ్ చోప్రాతో మనూ పెళ్లి?.. స్పందించిన షూటర్ తండ్రి -
అలుపెరుగని షటిల్... అశ్విని!
హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ.. భవిష్యత్తులో అత్యుత్తమ ఆటగాళ్లుగా ఎదిగే లక్ష్యంతో ఎంతోమంది వర్ధమాన షట్లర్లు అక్కడ సాధన చేస్తున్నారు.. అదే అకాడమీలోని ఒక కోర్టులో 35 ఏళ్ల యంగ్ అమ్మాయి కూడా ప్రాక్టీస్‌ను కొనసాగిస్తోంది.ఏదో ఫిట్నెస్ కోసం ఆడుకోవడమో లేక చిన్న చిన్న చాలెంజర్ టోర్నీల కోసమో ఆమె శ్రమించడం లేదు. మరికొద్ది రోజుల్లో జరగబోయే ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్ కోసం ఆమె సన్నద్ధమవుతోంది. డబుల్స్ విభాగంలో ఆమె వరుసగా మూడో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించబోతోంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆమె పతకం గెలుచుకొని కూడా పుష్కరకాలం దాటింది. అటువైపు భాగస్వాములూ మారారు. కానీ తాను మాత్రం ఇంకా బ్యాడ్మింటన్ కోర్టుపై తన సత్తాను ప్రదర్శిస్తూనే ఉంది.ఇన్నేళ్ల తర్వాత కూడా ఆ ప్లేయర్లో అదే పట్టుదల, అదే పోరాటతత్వం కనిపిస్తోంది. వరల్డ్, ఆసియా, కామన్వెల్త్ క్రీడల పతకాలు ఇప్పటికే తన ఖాతాలో ఉన్నా, మిగిలిన ఆ ఒక్క ఒలింపిక్ పతకాన్ని కూడా ఒడిసిపట్టుకోవాలనే లక్ష్యంతో సుదీర్ఘ సమయం పాటు సాధన కొనసాగిస్తోంది. ఆ ప్లేయర్ పేరే అశ్విని పొన్నప్ప.భారత బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్‌లో ఆమెకంటూ ఒక ప్రత్యేక అధ్యాయం ఉంది. పెద్ద సంఖ్యలో పతకాలు, ట్రోఫీలు ఆమె ఖాతాలో ఉన్నాయి. గత రికార్డులు, ఘనతలే కాదు.. ఈ వయసులోనూ ఇంకా ఏదైనా సాధించాలనే తపన, కసి అశ్వినిని ఇంకా ఆడేలా ప్రోత్సహిస్తున్నాయి.అశ్విని పొన్నప్ప స్వస్థలం బెంగళూరే అయినా ఆమె కెరీర్ ఆసాంతం హైదరాబాద్‌తోనే ముడిపడి ఉంది. జూనియర్ స్థాయిలో విజయాల తర్వాత హైదరాబాద్ కేంద్రంగానే శిక్షణ కొనసాగించిన ఆమె ఆపై అగ్రశ్రేణి షట్లర్‌గా ఎదిగింది. ఆమె తండ్రి ఎంఏ పొన్నప్ప హాకీలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు యూరోపియన్ లీగ్‌లలో కూడా ఆడాడు. అయితే అశ్వినికి బ్యాడ్మింటన్‌పై ఆసక్తి ఏర్పడటానికి మాత్రం తల్లే కారణం.2010, కామన్వెల్త్ గేమ్స్ విమెన్ డబుల్స్ స్వర్ణంతో.., 2018, కామన్వెల్త్ గేమ్స్ విమెన్ డబుల్స్ కాంస్య పతకంతో..అసలు ఆటలంటే ఏమీ తెలియని రెండున్నరేళ్ల వయసులోనే తల్లి తనకు బ్యాడ్మింటన్‌ను పరిచయం చేసిందని అశ్విని చెప్పుకుంది. ఆ తర్వాత ఎనిమిదేళ్ల వయసులో పూర్తిస్థాయిలో ప్రొఫెషనల్ ప్లేయర్‌గా మార్చాలనే లక్ష్యంతో ఆమెను వారు కోచింగ్‌లో నేర్పించారు. బేసిక్స్ తర్వాత వివిధ వయో విభాగాల్లో విజయాలు సాధిస్తూ అశ్విని ఒక్కో మెట్టే ఎక్కుతూ వచ్చింది. 2001లో తొలిసారి జాతీయ సబ్ జూనియర్ టైటిల్ గెలుచుకున్న ఆమె, మూడేళ్ల తర్వాత సబ్ జూనియర్లో సింగిల్స్, డబుల్స్ రెండింటిలోనూ విజేతగా నిలిచింది. ఆపై వరుసగా రెండేళ్ల జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌ను కూడా గెలుచుకుంది.అందరిలాగే అశ్విని కూడా ముందుగా సింగిల్స్‌పైనే దృష్టి పెట్టింది. జాతీయ స్థాయిలో ఫలితాలు సాధించిన తర్వాత 2008లో బహ్రెయిన్ ఇంటర్నేషనల్ టోర్నీలో ఆమె రన్నరప్‌గా నిలిచింది. అయితే దురదృష్టవశాత్తు గాయాలు, ఫిట్నెస్ సమస్యలు అశ్విని ఆటను కట్టిపడేశాయి. దాంతో తన ఆటపై ఒత్తిడిని తగ్గించుకోవాల్సి వచ్చింది. ఎంతో ఇష్టపడే బ్యాడ్మింటన్ నుంచి తప్పుకునే పరిస్థితి లేదు. దాంతో సన్నిహితులు, కోచ్‌ల సూచనల ప్రకారం డబుల్స్ వైపు మళ్లింది.అది ఆమె జీవితంలో తీసుకున్న అతి కీలకమైన, సరైన నిర్ణయం. ఇది అశ్విని కెరీర్‌ను సుదీర్ఘ కాలం కొనసాగేలా చేసింది. 2010లో పీసీ తులసితో కలసి ఆమె దక్షిణాసియా (శాఫ్) క్రీడల్లో రజత పతకాన్ని గెలుచుకుంది. అయితే ఏదో తెలియని లోటు తన ఆటకు తగిన ఫలితం ఇవ్వలేదన్నట్లుగా, తనను కట్టి పడేసినట్లుగా అనిపించింది. ఆ తర్వాత జరిగిన పరిణామం భారత డబుల్స్ బ్యాడ్మింటన్‌లో అత్యంత విజయవంతమైన జోడీకి అంకురార్పణ జరిగింది.2014, కామన్వెల్త్ గేమ్స్ విమెన్ డబుల్స్ సిల్వర్ మెడల్‌తో.., 2011 వరల్డ్ చాంపియన్‌షిప్ కాంస్యంతో అశ్విని– జ్వాల ద్వయం..జ్వాలతో జత కట్టి..2010లో న్యూఢిల్లీ నగరం కామన్వెల్త్ క్రీడలకు ముస్తాబైంది. సొంతగడ్డపై ఇంత పెద్ద ఈవెంట్లో పతకాలు గెలవడం అశ్విని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో కోచ్‌ల మార్గనిర్దేశనంలో ఆమె ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గుత్తా జ్వాలను కొత్త డబుల్స్ పార్ట్నర్గా ఎంచుకుంది. అశ్విని కంటే ఐదేళ్లు పెద్దదయిన జ్వాల అప్పటికే డబుల్స్‌లో ఎన్నో విజయాలు అందుకుంది. అప్పటి వరకు సక్సెస్ఫుల్ జంటగా ఉన్న జ్వాల – శ్రుతి కురియన్ విడిపోయారు.దాంతో జ్వాలకు కూడా సరైన పార్ట్నర్ అవసరమైంది. అప్పుడు జ్వాల – అశ్విని ద్వయం సమయం మొదలైంది. చక్కటి సమన్వయంతో ఆడిన వీరిద్దరూ కామన్వెల్త్ గేమ్స్‌లో తొలి ప్రయత్నంలోనే స్వర్ణపతకాన్ని గెలుచుకున్నారు. ఆ తర్వాత మూడేళ్ల పాటు ఈ జోడీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో హవా చూపించింది.వీటిలో 2011 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సాధించిన కాంస్య పతకం అన్నింటికంటే బెస్ట్. లండన్‌లో జరిగిన ఈ పోటీల్లో మూడో స్థానంలో నిలిచిన జ్వాల–అశ్విని జంట వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన తొలి భారత జంటగా ఘనతకెక్కింది. అయితే 2013లో భాగస్వామిని మార్చి కొత్తగా ప్రయత్నిద్దామని చేసిన ప్రయోగం కొద్ది రోజులకే విఫలమైంది.జ్వాల వ్యక్తిగత కారణాలతో ఆటకు కొంతకాలం దూరంగా ఉండటంతో అశ్విని మరో భాగస్వామితో బరిలోకి దిగింది. అయితే సరైన ఫలితాలు రాకపోవడంతో కొన్ని నెలలకే వీరిద్దరు మళ్లీ జత కట్టారు. ఆ తర్వాత మరో మూడేళ్ల పాటు సర్క్యూట్లో మంచి విజయాలు సాధించిన అనంతరం 2016లో జ్వాల–అశ్విని పూర్తిగా విడిపోయారు.భర్త కరణ్ మేడప్పతో..భాగస్వాములు మారినా..‘క్రీడా భాగస్వామ్యాల్లో వేర్వేరు దశలు ఉంటాయి. కొన్నిసార్లు అద్భుత విజయాలు లభిస్తాయి. కొన్నిసార్లు పరాజయాలు పలకరిస్తాయి. డబుల్స్‌లో నేను ఫలానావారితో ఆడతాను అంటే కుదరదు. మార్పు సహజం. తప్పేమీ లేదు. దానిని అంగీకరించాలి. కొత్త భాగస్వామితో ఆరంభంలో సమన్వయం చేసుకునేందుకు కొంత ఇబ్బంది ఎదురు కావచ్చు. కానీ తర్వాతి రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయి. అందుకే నేను ఒక్క చోట ఆగిపోకుండా ఇంకా కొనసాగిపోతున్నాను’ అని తన గురించి తాను అశ్విని చెప్పుకుంది.2016లో జ్వాలతో విడిపోయిన తర్వాత హైదరాబాద్‌కే చెందిన సిక్కి రెడ్డితో ఆమె జత కట్టింది. అశ్విని–సిక్కి ద్వయం కూడా పలు టోర్నీల్లో చెప్పుకోదగ్గ విజయాలు సాధించింది. వీటిలో 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో సాధించిన కాంస్య పతకం కూడా ఉంది. అయితే ఆ తర్వాత సిక్కి రెడ్డితో కూడా అశ్విని విడిపోయింది.రెండేళ్ల క్రితం భారత జట్టుకు స్పెషలిస్ట్ డబుల్స్ కోచ్‌లు రావడంతో కొత్త జోడీ సాధ్యమైంది. ఒకవైపు తన అనుభవం, మరోవైపు యువ రక్తం కలగలసి మంచి ఫలితాలు వస్తాయని కోచ్‌లు అంచనా వేశారు. ఇప్పుడు సీనియర్‌గా ఉన్న తాను మరో యువ ప్లేయర్‌తో జత కట్టడం సరైందిగా అందరికీ అనిపించింది. దాంతో తనీషా క్రాస్టోను కొత్తగా అశ్వినికి భాగస్వామిగా ఎంపిక చేశారు. అశ్వినికి, తనీషాకు మధ్య వయసులో 14 ఏళ్ల తేడా ఉంది. కానీ కోర్టులోకి వచ్చేసరికి సరైన జుగల్బందీ కొనసాగింది.దాంతో ఏడాది వ్యవధిలోనే అద్భుత ఫలితాలు వచ్చాయి. ఈ జంట 3 టోర్నమెంట్లలో విజేతగా నిలిచి మరో రెండు టోర్నీల్లో రన్నరప్ స్థానాన్ని అందుకుంది. ఇదే క్రమంలో వరుస విజయాల కారణంగా పాయింట్లు సంపాదించి పారిస్ ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించింది.ఒకే ఒక లక్ష్యంతో..అశ్విని సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్లో ఎన్నో విజయాలు ఉన్నాయి. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సాధించిన కాంస్యం వీటిలో అగ్రభాగాన నిలుస్తుంది. ఇది కాకుండా టీమ్, వ్యక్తిగత విభాగాలు అన్నీ కలసి ఆసియా క్రీడల్లో కాంస్యం.. కామన్వెల్త్ క్రీడల్లో 2 స్వర్ణాలు, 3 రజతాలు, ఒక కాంస్యం.. ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, కాంస్యం ఆమె గెలుచుకుంది.ఇక శాఫ్ క్రీడల్లో 4 స్వర్ణాలు, 2 రజతాలు గెలిచిన ఆమె ఉబెర్ కప్‌లో రెండు కాంస్యాలు సాధించిన భారత జట్టులో సభ్యురాలిగా కూడా ఉంది. వీటికి తోడు పెద్ద సంఖ్యలో బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ టోర్నీల్లో కూడా ఆమె విజేతగా నిలిచింది. అయితే ఇప్పుడు అన్నింటినీ మించి ఒలింపిక్స్ పతకం కోసమే ఆమె శ్రమిస్తోంది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో జ్వాల–అశ్విని మంచి ఫామ్‌లో ఉంది.గ్రూప్ దశలో రెండు మ్యాచ్‌లు గెలిచినా దురదృష్టవశాత్తు ఒక పాయింట్ తేడాతో వీరు ముందంజ వేసే అవకాశం కోల్పోయారు. 2016 రియో ఒలింపిక్స్‌కు కొద్ది రోజుల ముందే డెంగీ బారిన పడిన తర్వాత అతి కష్టమ్మీద కోలుకొని బరిలోకి దిగినా గ్రూప్ రౌండ్లోనే ఓటమి తప్పలేదు. 2019లో మరోసారి అనారోగ్యానికి గురి కావడంతో టోర్నీల్లో పాల్గొనలేక 2021 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయింది.మరెవరైనా అయితే ఈ స్థితిలో ఆటకు గుడ్‌బై చెప్పేవారేమో! కానీ అశ్విని కొత్త స్ఫూర్తితో, పట్టుదలతో మళ్లీ పైకెగసింది. నాలుగేళ్లుగా సాధన కొనసాగిస్తూ ఇప్పుడు మూడో ఒలింపిక్స్‌లో పాల్గొనబోతోంది. ఈసారైనా ఆమె ఒలింపిక్స్ నెరవేరుతుందేమో చూడాలి. భారత ప్రభుత్వ క్రీడా పురస్కారం ‘అర్జున’ కూడా దక్కించుకున్న అశ్విని 2017లో తన చిరకాల మిత్రుడు, వ్యాపారవేత్త కరణ్ మేడప్పను పెళ్లి చేసుకుంది. - మొహమ్మద్ అబ్దుల్ హాది -
లక్ష్య సేన్ ఓటమి.. అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో కూడా ఇంటికే
ఇండోనేసియా మాస్టర్స్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. జకార్తాలో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్... మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో ఓడిపోయారు. ప్రపంచ 12వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–15, 10–21, 13–21తో మూడో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలయ్యాడు. 62 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో లక్ష్య సేన్ తొలి గేమ్‌లో స్కోరు 15–15తో సమంగా ఉన్నపుడు వరుసగా ఆరు పాయింట్లు గెలిచి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే క్రిస్టీ పుంజుకొని వరుసగా రెండు గేముల్లో గెలిచి విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో అశ్విని–తనీషా 13–21, 18–21తో యూకీ ఫకుషిమా–సయాక హిరోటా (జపాన్) చేతిలో ఓడిపోయారు. చదవండి: MS Dhoni: ఏ మాత్రం తగ్గని ధోని మేనియా T20 WC Ind Vs Eng: ఆసీస్‌పై ఇంగ్లండ్ విజయం.. ఫైనల్లో టీమిండియాతో పోరు! చరిత్రకు అడుగు దూరంలో భారత్. End of 🇮🇳's campaign. 📸: @badmintonphoto#IndonesiaMasters2023#Badminton pic.twitter.com/etm7svf1rQ — BAI Media (@BAI_Media) January 27, 2023 -
సరిపోని పోరాటం
బ్యాంకాక్: సరైన సన్నాహాలు లేకుండానే థాయ్‌లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ బరిలోకి దిగిన సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి... సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప జోడీల పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. శనివారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాత్విక్, కర్ణాటక క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప ద్వయం 20–22, 21–18, 12–21తో ప్రపంచ మూడో ర్యాంక్ జంట, టాప్ సీడ్ దెచాపోల్ పువరన్‌క్రో–సప్సిరి తెరాతనచయ్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. 59 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి రెండు గేమ్‌లు హోరాహోరీగా సాగాయి. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో థాయ్‌లాండ్ జంట పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్–చిరాగ్ శెట్టి జోడీ 18–21, 18–21తో ప్రపంచ తొమ్మిదో ర్యాంక్ జంట ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా) జంట చేతిలో పరాజయం చవిచూసింది. ‘మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో తొలి రెండు గేమ్‌ల్లో అద్భుతంగా ఆడాం. మా కెరీర్లో ఆడిన గొప్ప మ్యాచ్‌ల్లో ఇదొకటి. పూర్తిస్థాయిలో సన్నాహాలు లేకున్నా ఎలాగైనా ఆడాలనే లక్ష్యంతో ఇక్కడికి వచ్చాం. మా వంతుగా అత్యుత్తమ ఆటతీరు కనబరిచాం. కీలకదశలో చేసిన తప్పిదాలు ఫలితాన్ని శాసించాయి’ అని సాత్విక్–అశ్విని జంట తెలిపింది. గతేడాది కరోనా కారణంగా సాత్విక్, అశ్విని వేర్వేరు చోట ఉన్నారు. కలిసి ప్రాక్టీస్ చేసే వీలు లేకుండా పోయింది. సెమీఫైనల్లో ఓడిన సాత్విక్–చిరాగ్, సాత్విక్–అశ్విని జోడీలకు 14 వేల డాలర్ల (రూ. 10 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది.