breaking news
amcs
-
ఏఎంసీ షేర్ల హవా
దేశీ స్టాక్ మార్కెట్లను మించుతూ గత ఆరు నెలలుగా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ)లు లాభాల దౌడు తీస్తున్నాయి. ఈ కాలంలో మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ బీఎస్ఈ సెన్సెక్స్ 10 శాతం పుంజుకోగా.. లిస్టెడ్ కంపెనీల షేర్లు 50–30 శాతం మధ్య పురోగమించాయి. ప్రధానంగా దేశీ పెట్టుబడులు జోరందుకోవడం ఇందుకు సహకరిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. వివరాలు చూద్దాం.. కుటుంబ ఆదాయాలు బలపడటం, పెట్టుబడి అవకాశాలపట్ల పెరుగుతున్న అవగాహన, డిజిటలైజేషన్‌తోపాటు.. మార్కెట్లో సరళతర లావాదేవీలకు వీలు ఏర్పడటం వంటి అంశాలు కొద్ది నెలలుగా రిటైల్ ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నాయి. ఇటీవల కొంతకాలంగా పొదుపునకు వెచ్చించగల ఆదాయాలు పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు వివిధ పెట్టుబడి విభాగాలపై దృష్టిపెడుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఫలితంగా బంగారం, రియల్టీ తదితర ఫిజికల్ ఆస్తుల నుంచి పొదుపు ఆలోచన ఆర్థిక మార్గాలవైపు మళ్లుతున్నట్లు తెలియజేశారు. దీనికితోడు దేశీయంగా రిటైలర్లు ఈక్విటీ పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నట్లు వెల్త్‌మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీ డైరెక్టర్ క్రాంతి బత్తిని పేర్కొన్నారు. ఫలితంగా విభిన్న ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌కు ప్రాధాన్యత ఏర్పడినట్లు తెలియజేశారు. వెరసి మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్)కు చెందిన క్రమానుగత పెట్టుబడి(సిప్) పథకాలు, ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్‌లు), రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్(రీట్లు) తదితరాలకు పెట్టుబడులు తరలివస్తున్నట్లు వివరించారు. సిప్ల దన్నుబీఎస్ఈ గణాంకాల ప్రకారం ఆస్తుల నిర్వహణా పరిశ్రమలోని లిస్టెడ్ దిగ్గజాలలో అత్యధికంగా నిప్పన్ లైఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ స్టాక్స్ గత ఆరు నెలల్లో 53 శాతానికిపైగా దూసుకెళ్లాయి. ఈ బాటలో యూటీఐ ఏఎంసీ 48 శాతం, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ 40 శాతం జంప్‌చేయగా.. శ్రీరామ్ ఏఎంసీ 23 శాతం, కేఫిన్ టెక్నాలజీస్ 22 శాతం చొప్పున ఎగశాయి. ప్రధానంగా పసిడి, వెండిపై ఇన్వెస్ట్ చేసే కుటుంబ ఆదాయాలు విభిన్న పెట్టుబడి పథకాలవైపు ప్రయాణిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎంఎఫ్లకు తరలి వస్తున్న పెట్టుబడులు, నిర్వహణలోని ఆస్తుల(ఏయూఎం) విలువ భారీగా మెరుగుపడటం, సిప్ల ద్వారా రిటైలర్ల నిరవధిక పెట్టుబడులు ఏఎంసీ కంపెనీల షేర్లకు జోష్‌నిస్తున్నట్లు తెలియజేశారు.పెట్టుబడుల తీరిలా నువామా ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వివరాల ప్రకారం గత నెల(ఆగస్ట్)లో ఈక్విటీలలోకి నికర పెట్టుబడులు నెలవారీగా చూస్తే 25 శాతం క్షీణించి రూ. 42,360 కోట్లకు పరిమితమయ్యాయి. ఇందుకు ప్రపంచస్థాయిలో భౌగోళిక, రాజకీయ అస్థిరతలు కొంతమేర ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే సిప్ పథకాలకు నిలకడగా రూ. 28,270 కోట్లు ప్రవహించడం రిటైల్ ఇన్వెస్టర్ల కట్టుబాటును సూచిస్తున్నట్లు ప్రస్తావించారు! ఇక ఈ ఏడాది తొలి అర్ధభాగం(జనవరి–జూన్)లో ఎంఎఫ్‌ల ఏయూఎం 11 శాతం బలపడి రూ. 74.41 లక్షల కోట్లను తాకాయి. ఇందుకు ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ ఫండ్స్ దన్నునిచ్చాయి. ఫండ్స్ అసోసియేషన్ యాంఫీ వివరాల ప్రకారం ఈ కాలంలో ఏయూఎం రూ. 7 లక్షల కోట్లమేర పుంజుకుంది. నికరంగా రూ. 4.18 లక్షల కోట్ల పెట్టుబడులు జమయ్యాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
లింకు పోయింది
ఆకివీడు : వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే లింకు రోడ్లకు గ్రహణం పట్టింది. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న లింకు రోడ్ల నిర్మాణానికి ఎట్టకేలకు అనుమతించిన సర్కారు ఆ చేత్తో ఇచ్చి.. ఈ చేత్తో తీసేసుకున్నట్టుగా గడువు మీరిపోయిం దంటూ నిధుల్ని వెనక్కి మళ్లిపోయేలా చేసింది. ఏలూరు మినహా జిల్లాలోని 17 మార్కెట్ కమిటీల పరిధిలో 334 లింకు రోడ్ల నిర్మాణానికి సర్కారు ఆమోదించింది. వాటి నిర్మాణానికి మార్కెట్ కమిటీల నిధులు రూ.11.18 కోట్లు, జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు రూ.11.18 కోట్లు కలిపి మొత్తం రూ.22.36 కోట్లను కేటాయించారు. మార్కెట్ కమిటీల వాటా నిధులు రూ.11.18 కోట్లను పంచాయతీరాజ్ శాఖకు బదలాయించారు. ఒక్కొక్క రహదారి నిర్మాణానికి రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ కేటాయించారు. అయితే, ఉన్నతాధికారుల నుంచి సకాలంలో అనుమతులు మంజూరు కాకపోవడం, ఆ తరువాత వర్షాల వల్ల పనులు ప్రారంభంలో జాప్యం చోటుచేసుకుంది. జూన్ 30వ తేదీలోపు పనులు పూర్తి చేయకపోతే నిధులను నిలుపుదల చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 30లోగా పనులు ప్రారంభించకపోవడంతో నిధులు వెనక్కి మళ్లాయి. తుస్సుమన్న రూ.కోటి పనులు ఒక్కొక్క మార్కెట్ కమిటీ పరిధిలో రూ.కోటికి పైగా విలువైన పనుల్ని చేపట్టేందుకు అనుమతులు లభించాయి. ప్రతి నియోజకవర్గంలో 15 నుంచి 18 లింకు రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదించారు. ఈ నిధులతో లింకు రోడ్లను పూర్తిగా గ్రావెల్‌తో నిర్మించాల్సి ఉంది. అయితే, పనులు చేపట్టేందుకు ప్రభుత్వం అతి తక్కువ గడువు ఇవ్వడంతో నిధులు మంజూరైనా వెనక్కి మళ్లిపోయాయి. రైతుల సొమ్ము వారికి అక్కరకు రావడం లేదు రైతుల నుంచి మార్కెట్ సెస్ రూపంలో వసూలు చేసే నిధులు వారికి అక్కరకు రాకుండాపోతున్నాయి. ధాన్యం, బియ్యం, నూకలు, చేపలు, రొయ్యల ఎగుమతుల నుంచి మార్కెట్ కమిటీలు సెస్ వసూలు చేస్తున్నాయి. ఈ విధంగా ప్రతి మార్కెట్ కమిటీకి ఏటా కోట్లాది రూపాయల ఆదాయం లభిస్తోంది. ఇందులో 20శాతాన్ని ప్రభుత్వం తీసుకుం టోంది. మిగిలిన నిధులను రైతుల అవసరాల కోసం వినియోగించాల్సి ఉంది. అయితే, కొన్నేళ్లుగా ఒక్క పైసా కూడా రైతుల కోసం వెచ్చించడం లేదు. సెస్ రూపంలో వసూలయ్యే సొమ్ము 80 శాతం నిధులను రైతులకు అవసరమయ్యే నూర్పిడి కళ్లాలు, లింకు రోడ్ల నిర్మాణం, ఇతరత్రా పనులకు వినియోగించాల్సి ఉంది. కనీసం పశువైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం లేదు. వాళ్లకేమీ తెలియదట లింకు రోడ్ల నిర్మాణ పనులను పంచాయతీరాజ్ శాఖకు అప్పగించగా, జిల్లాస్థాయి అధికారులు ఆ పనుల వివరాలేమీ తమకు తెలియదని చెబుతున్నారు. జిల్లాలో ఎన్ని లింకు రోడ్లకు నిధులొచ్చాయి, ఎన్ని పనులను ప్రారంభించారనే వివరాలను చెప్పడానికి ఆ శాఖ అధికారులు సంకోచిస్తున్నారు. ఈ విషయమై పంచాయతీరాజ్ ఈఈ ఎస్.రఘుబాబును సంప్రదించగా, పూర్తి సమాచారం తమవద్ద లేదని ఎస్ఈని అడగాలని సూచించారు. ఎస్ఈ ఇ.మాణిక్యంను అడిగితే ఈఈ వద్దే సమాచారం ఉంటుందని దాటవేశారు.