breaking news
administativ
-
2012లో ఇంజినీరింగ్ .. 2023లో ఎంబీబీఎస్.. తీరని కల నెరవేరుతోందిలా..
ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఒక విద్యార్థి మెడికల్ కోర్సు చేసేందుకు జార్ఖండ్‌లోని ధన్బాద్లో గల షహీద్ నిర్మల మెహతో మెడికల్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నాడు. విద్యార్థి చందన్ కుమార్ ఎడ్మిషన్ ఏఎన్‌ఎంఎంసీహెచ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇంజినీరింగ్ పూర్తిచేశాక ఎంబీబీఎస్‌లో చేరడమనేది ఈ కాలేజీలో ఇదే మెదటిసారి. చందన్ ఎంబీబీఎస్ చేసేందుకు రూ.18 లక్షల శాలరీ ప్యాకేజీని కూడా వదులుకోవడం విశేషం. ఎన్ఐసీ వరంగల్‌లో ఇంజినీరింగ్ పూర్తి చందన్ కుమార్ తల్లి ఐఐటీ ఐఎస్‌ఎంలో డిప్యూటీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఏఎన్‌ఎంఎంసీహెచ్‌లో అడ్మిషన్ తీసుకునేందుకు వచ్చిన చందన్ మాట్లాడుతూ వైద్యుడు కావాలన్నది తన చిరకాల స్వప్నం అని అన్నారు. ఐఎస్ఎం ఎనెక్సీ నుంచి 2008లో ప్లస్ టూ పూర్తి చేసిన అనంతరం చందన్ అటు మెడికల్, ఇటు ఇంజినీరింగ్ రెండింటిలో ఎడ్మిషన్ కోసం ప్రయత్నించాడు. అయితే మెడికల్‌లో అతనికి సీటు లభ్యం కాలేదు. దీంతో ఇంజినీరింగ్ కోర్సులో చేరాడు. ఎన్ఐసీ వరంగల్(ఉమ్మడి ఆంధ్రప్రదేశ్)లో బయోటెక్నాలజీలో 2012లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. తరువాత ఉద్యోగంలో చేరాడు. ప్రత్యేక శిక్షణ లేకుండానే.. అయితే ఎంబీబీఎస్ చేయాలన్న కల అతన్ని నిద్రపోనివ్వలేదు. దీంతో 2015లో మెడికల్ ఎంట్రన్స్ రాసి విజయం సాధించాడు. అయితే తగిన ర్యాంకు రాకపోవడంతో ఎంబీబీఎస్‌లో అడ్మిషన్ దొరకలేదు. అయితే ఈసారి మెడికల్ ఎంట్రన్స్‌లో 2,650వ ర్యాంకు దక్కించుకున్నాడు. దీంతో ఏఎన్‌ఎంఎంసీహెచ్‌లో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. మెడికల్‌లో సీటు కోసం తాను ఎక్కడా కోచింగ్ తీసుకోలేదని, తాను గతంలో 12వ తరగతిలో చదుకున్న దానినే తిరిగి అధ్యయనం చేశానన్నారు. భార్య ఎస్బీఐలో మేనేజర్ ఏఎన్‌ఎంఎంసీహెచ్ సూపరింటెండెంట్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ఇంజినీరింగ్ పూర్తి చేశాక డాక్టర్ కావాలనుకోవడం గొప్ప విషయం అని అన్నారు. తమ కాలేజీలో ఈ విధమైన అడ్మిషన్లలో ఇది మొదటిదని అన్నారు. చందన్ కుమార్ భార్య అపర్ణ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అలాగే చందన్ సోదరి గౌరి కుమారి బీహార్ విద్యాశాఖలో పనిచేస్తున్నారు. మరో సోదరి ఎంఏ చేస్తున్నారు. ఆమెకు కూడా వివాహం అయ్యింది. ఇది కూడా చదవండి: ‘ఇండియా జేమ్స్ బాండ్’ సౌదీలో ఏం చేస్తున్నారు? -
‘నయా’ నజర్
∙హన్మకొండ వైపు ఈటల చూపు ∙అదే దారిలో కరీంనగర్ ఎంపీ వినోద్ ∙భూపాలపల్లిలో శ్రీధర్‌బాబు కార్యక్రమాలు సాక్షిప్రతినిధి, వరంగల్ : జిల్లాల పునర్విభజనతో పరిపాలన పరంగా భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలన మార్పులతోపాటే... రాజకీయంగానూ నూతన సమీకరణలు జరుగుతున్నాయి. పునర్విభజనతో ఏర్పడే కొత్త జిల్లాల్లో తమ పట్టు పెంచుకునేందుకు పలువురు ముఖ్య నేతలు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలు ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జిల్లా కీలక పాత్ర పోషించింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాజకీయ పదవుల్లోనూ జిల్లాకు ప్రాధాన్యం దక్కింది. కీలకమైన స్పీకర్, ఉప ముఖ్యమంత్రి, మంత్రి, కేబినెట్ స్థాయి పలు పోస్టులు జిల్లా నేతలకు దక్కాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చేపట్టిన జిల్లాల పునర్విభజనలోనూ వరంగల్ ప్రత్యేకతను సంతరించుకుంటోంది. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా... వరంగల్ జిల్లా నాలుగు జిల్లాలుగా మారబోతోంది. కరీంనగర్ జిల్లాలోని 10 మండలాలు ప్రస్తుతం ఉన్న వరంగల్ జిల్లాలో కలుస్తున్నాయి. దీంతో ఆ జిల్లాకు చెందిన కీలక ప్రజాప్రతినిధులు ఇప్పుడు తమ కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు. టీఆర్ఎస్లో కీలక నేతగా గుర్తింపు ఉన్న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ జిల్లా మంత్రిగా ఉన్నారు. ప్రొటోకాల్ విషయంలోనూ కరీంనగర్ జిల్లా బాధ్యతలు ఆయనకు ఉన్నాయి. ఈటల కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉన్నాయి. వీటితో పాటు ఒక కొత్త మండలం ఏర్పాటవుతోంది. జిల్లాల పునర్విభజనలో ఆ సెగ్మెంట్లోని హుజూరాబాద్, కమలాపురం, జమ్మికుంట, ఇల్లంతకుంట(కొత్తది) మండలాలు హన్మకొండ జిల్లాలో కలుస్తున్నాయి. దీంతో మంత్రి ఈటల హన్మకొండ జిల్లా రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఈనెల 7న జరిగిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లాల పునర్విభజనలో తన నియోజకవర్గం హన్మకొండలో కలుస్తోందని, మంత్రిగా తాను ఏ జిల్లాలో బాధ్యతలు నిర్వహించాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయిస్తారని చెప్పారు. బహిరంగంగా ఈ మాటలు చెబుతున్నా... మరో రెండు, మూడు రోజుల్లో హన్మకొండలో జరగనున్న మరో కార్యక్రమానికి కూడా ఈటల రాజేందర్ వస్తున్నారు. రాజకీయంగా కీలకమైన హన్మకొండ జిల్లాకు మంత్రిగా తానే ఉంటానని స్పష్టం చేసేందుకే హన్మకొండలో జరిగే కార్యక్రమాలకు వస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కరీంనగర్ లోక్‌సభ సభ్యుడిగా ప్రాతినిథ్యం వహిస్తున్న బోయినపల్లి వినోద్‌కుమార్ సైతం హన్మకొండ జిల్లాపై దృష్టి పెట్టారు. కరీంనగర్ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లోని ఆరు మండలాలు హన్మకొండ జిల్లాలో కలుస్తున్నాయి. వినోద్‌కుమార్ 2004 ఎన్నికల్లో హన్మకొండ ఎంపీగా ఎన్నికయ్యారు. నియోజకవర్గాల పునర్విభజనలో హన్మకొండ నియోజకవర్గం రద్దయింది. వరంగల్ లోక్‌సభ సెగ్మెంట్ ఎస్సీ కేటగిరికి రిజర్వు అయ్యింది. హన్మకొండ లోక్‌సభ సెగ్మెంట్లో కరీంనగర్ జిల్లాలోని కమలాపురం నియోజకవర్గం ఉండేది. దీంతో వినోద్‌కుమార్ 2009 ఎన్నికల్లో కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. 2014 ఎన్నికల్లోనూ అక్కడే పోటీ చేసి గెలిచారు. గతంలో వరంగల్ జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వినోద్‌కుమార్ తాజాగా జరుగుతున్న జిల్లాల పునర్విభజనతో మళ్లీ హన్మకొండ జిల్లాపై దృష్టి పెడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న దశాబ్దంపాటు కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సైతం రాజకీయంగా కొత్తదారిలోకి వెళ్తున్నారు. కరీంనగర్ జిల్లా మంథని శ్రీధర్‌బాబు సొంత నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలోని కాటారం, మహాముత్తారం, మల్హర్రావు, మహదేవపూర్ మండలాలు కొత్తగా ఏర్పడుతున్న భూపాలపల్లి(జయశంకర్) జిల్లాలో కలుస్తున్నాయి. దీంతో శ్రీధర్‌రాబు సైతం భూపాలపల్లి రాజకీయాలపై దృష్టి పెడుతున్నారు. ఈ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మండలం టేకుమట్ల కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 22న జారీ చేసిన పునర్విభజన ముసాయిదాలో టేకుమట్ల మండలం ప్రస్తావన లేదు. దీంతో టేకుమట్ల కేంద్రంగా మండలాన్ని ఏర్పాటు చేయాలని అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ అధ్యర్యంలో గత బుధవారం టేకుమట్లలో జరిగిన కార్యక్రమంలో శ్రీధర్‌బాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. భవిష్యత్తు రాజకీయ వ్యూహాలతోనే శ్రీధర్‌బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.