స్పీకర్ విధుల్లో జోక్యం చేసుకోలేం.. | We cant interfere to Speaker's duty | Sakshi
Sakshi News home page

స్పీకర్ విధుల్లో జోక్యం చేసుకోలేం..

Dec 12 2015 5:32 AM | Updated on Sep 2 2018 5:24 PM

స్పీకర్ విధుల్లో జోక్యం చేసుకోలేం.. - Sakshi

స్పీకర్ విధుల్లో జోక్యం చేసుకోలేం..

పార్టీ ఫిరాయింపులపై నిర్ణీత సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను తాము ఆదేశించలేం..

♦ గతంలో విస్తృత ధర్మాసనం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది
♦ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించలేం
♦ నిర్ణయం వెలువడిన తర్వాత సమీక్షించే అధికారం మాత్రమే కోర్టులకు ఉంది
♦ స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం
♦ 16 నెలలు గడిచినా స్పీకర్ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్న పిటిషనర్లు
♦ మరో రెండు నెలలు చూడండి.. అప్పుడు తమ వాదన వినాలని విజ్ఞప్తి
♦ సమ్మతించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. విచారణ 2 నెలలు వాయిదా
 
 సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపులపై నిర్ణీత సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను తాము ఆదేశించలేం.. స్పీకర్ విధుల్లో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్ నిర్ణయం వెలువడిన తర్వాత దానిపై సమీక్షించే అధికారం మాత్రమే కోర్టులకు ఉంటుందని, గతంలో విస్తృత ధర్మాసనం ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని పేర్కొంది. శాసనసభ్యుల పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ త్వరితగతిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

న్యాయమూర్తులు జస్టిస్ ఫకీర్ మహమ్మద్ ఇబ్రహీం ఖలీఫుల్లా, జస్టిస్ అమితావ రాయ్‌తో కూడిన ధర్మాసనం ముందుకు శుక్రవారం సంబంధిత పిటిషన్లు విచారణకు వచ్చాయి. ఎస్.ఎ.సంపత్‌కుమార్, ఎర్రబెల్లి దయాకర్‌రావు విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశారు. సంపత్‌కుమార్ కాలే యాదయ్య, ఇతరులను ప్రతివాదులుగా చేర్చగా.. ఎర్రబెల్లి దయాకర్‌రావు తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఇతరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. సంపత్ తరపున సీనియర్ న్యాయవాది అశోక్ దేశాయ్ వాదనలు వినిపించారు. ‘ప్రతివ్యక్తి తనకు రాజ్యాంగం అప్పగించిన విధులను నెరవేర్చాలి.

పార్టీ ఫిరాయింపులపై ఆగస్టు 6, 2014న తెలంగాణ శాసనసభాపతికి ఫిర్యాదులు అందాయి. దీనిపై ఆయన ఆగస్టు 28, 2014న ప్రతివాదులకు నోటీసులు పంపారు. దానికి ఏడు రోజుల్లో సమాధానం రావాలి. కానీ 16 నెలలైనా ఇంతవరకు సమాధానం లేదు. స్పీకర్ నుంచి చర్యలు లేవు. అందువల్ల రాజ్యాంగపరమైన బాధ్యతలు నెరవేర్చమని ఆదేశించండి..’ అని అభ్యర్థించారు. ఈ సందర్భంలో జస్టిస్ ఖలీఫుల్లా జోక్యం చేసుకుని 1992 నాటి ‘కిహోటో హొలాహాన్ వర్సెస్ జచిలుహూ, ఇతరులు’ కేసును ప్రస్తావిస్తూ ఈ కేసుతో పాటు గతంలో సంబంధిత అంశాల్లో సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చినప్పుడు ఒక స్పష్టమైన గీత గీశారని, అందువల్ల సభాపతి అధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకోజాలవని స్పష్టం చేశారు. దీంతో దేశాయ్ వాదనలు వినిపిస్తూ ‘ఇప్పటికే 16 నెలలు గడిచాయి. మొత్తం పదవీకాలం ఐదేళ్లు.

ఇంకా ఎన్నేళ్లు ఎదురుచూడాలి?’ అని ప్రశ్నించారు. ఎర్రబెల్లి తరపున సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ ‘క్వాసీ(పాక్షిక) జ్యుడీషియరీ అధికారాలు కలిగిన ట్రిబ్యునల్(సభాపతి వ్యవస్థను ఉద్దేశించి) తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైనందున సుప్రీంకోర్టు ట్రిబ్యునల్‌ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయవచ్చు. గతంలో హరియానాకు సంబంధించిన ఒక కేసులో సుప్రీంకోర్టు ఈమేరకు ఆదేశాలు జారీచేసింది’ అని చెప్పారు. దీనికి జస్టిస్ ఖలీఫుల్లా బదులిస్తూ స్పీకర్ నిర్ణయంపై న్యాయవ్యవస్థ సమీక్షించవచ్చు గానీ, స్పీకర్ నిర్ణయం తీసుకోకముందు ఏ తీరుగానూ జోక్యం చేసుకోజాలవు..’ అని పేర్కొన్నారు.
 
 గడువు విధించండి...
 సీనియర్ న్యాయవాదులిద్దరూ‘స్పీకర్ తగు చర్యలు తీసుకునేందుకు ఒక నిర్ధిష్ట గడువును విధించండి..’అని ధర్మాసనాన్ని కోరారు. దీనికి జస్టిస్ ఖలీఫుల్లా స్పందిస్తూ ‘స్పీకర్ అధికారాల్లో మేం జోక్యం చేసుకోజాలం..’ అని పునరుద్ఘాటించారు. ‘కిహోటో హొలాహాన్ వర్సెస్ జచిలుహూ కేసులో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఫిరాయింపులకు సంబంధించిన కేసుల్లో కోర్టుల పరిధిని స్పష్టంగా పేర్కొంది. నిర్ణయం వెలువడకముందు మేమెలాంటి చర్య తీసుకోజాలం. స్పీకర్ అధికారాలు స్వతంత్రమైనవి..’ అని స్పష్టం చేశారు. దీంతో న్యాయవాది దేశాయ్ ‘16 నెలలు గడుస్తున్నా జవాబు ఇవ్వకపోతే, స్పీకర్ చర్యలు తీసుకోనప్పుడు ఇంకా మూడు నాలుగేళ్లు ఎదురుచూడమంటారా? కోర్టులే నిస్సహాయత వ్యక్తం చేస్తే ఎలా?’ అని వాదించారు.

తదుపరి వేణుగోపాల్ తిరిగి వాదిస్తూ ‘అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. ఇప్పటివరకు చేర్చుకున్న ఎమ్మెల్యేల్లో కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చింది. ఇది క్విడ్ ప్రో కో వంటిదే. ట్రిబ్యునల్ వ్యవస్థ వంటి స్పీకర్ వ్యవస్థ తన రాజ్యాంగ బాధ్యతలు నిర్వర్తించనప్పుడు సుప్రీంకోర్టు కచ్చితంగా ఒక ఆదేశం జారీ చేసేందుకు వీలు ఉంది. జగదాంబికాపాల్ కేసులో సుప్రీంకోర్టు ఇలాంటి ఆదేశాలు జారీచేసింది..’ అని పేర్కొన్నారు. వేణుగోపాల్ వాదన విన్న జస్టిస్ ఖలీఫుల్లా ‘స్పీకర్‌కు తన అధికారాలేంటో తెలుసు. ఇది స్పీకర్ పరిధిలోనిది. ఈ దశలో మేమేమీ చేయలేం..’ అని పేర్కొన్నారు. దీనిపై వేణుగోపాల్ ‘కనీసం ఒక రెండు నెలలు మీరే చూడండి. స్పీకర్ నిర్ణయం తీసుకుంటారో లేదో.. అప్పుడైనా మీరు మా వాదనలను నమ్మొచ్చు..’ అని వేణుగోపాల్ అభ్యర్థించారు. దీనికి సమ్మతించిన ధర్మాసనం కేసును రెండు నెలలకు వాయిదా వేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement