సమైక్య నినాదాలతో పార్లమెంట్ సోమవారం మార్మోగింది. దాంతో పార్లమెంట్ ఉభయ సభల్లోనూ వాయిదాల పర్వం కొనసాగింది.
న్యూఢిల్లీ : సమైక్య నినాదాలతో పార్లమెంట్ సోమవారం మార్మోగింది. దాంతో పార్లమెంట్ ఉభయ సభల్లోనూ వాయిదాల పర్వం కొనసాగింది. సభా కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలగటంతో లోక్సభ మంగళవారానికి, రాజ్యసభ ఓ పావుగంట వాయిదా పడ్డాయి. కాగా ఈరోజు ఉదయం సీమాంధ్ర సభ్యుల నిరసనల హోరు మధ్యే సమావేశాన్ని నిర్వహించేందుకు లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ ప్రయత్నించారు. స్పీకర్ విజ్ఞప్తిని సభ్యులు పట్టించుకోకపోవడంతో సభను తొలుత గంటపాటు వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ ప్రారంభం అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. దాంతో సభ్యుల నిరసనల మధ్యే స్పీకర్ జీరో అవర్ను ప్రారంభించి పలు బిల్లులకు ఆమోదం తెలిపారు.
అటు రాజ్యసభలోనూ సమైక్య నినాదాలు హోరెత్తాయి. సీమాంధ్ర ఎంపీలు వెల్‌లోకి దూసుకువచ్చి నిరసనలు తెలపడంతో తొలుత 10నిమిషాలపాటు సభ వాయిదాపడింది. అనంతరం ప్రారంభమైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఛైర్మన్ హమీద్ అన్సారీ మధ్యాహ్నం 12గంటల వరకూ వాయిదా వేశారు. ఆతర్వాత సమావేశాలు ప్రారంభమైనా సభ్యులు నిరసనలు కొనసాగటంతో సభ మరో పావుగంట వాయిదా పడింది.