డిప్యూటీ సీఎం రాజీనామా చేయరు: ఆర్జేడీ | tejashwi yadav will not resign, attempt to break alliance will fail: RJD | Sakshi
Sakshi News home page

‘డిప్యూటీ సీఎం రాజీనామా చేయరు’

Jul 10 2017 2:38 PM | Updated on Sep 5 2017 3:42 PM

డిప్యూటీ సీఎం రాజీనామా చేయరు: ఆర్జేడీ

డిప్యూటీ సీఎం రాజీనామా చేయరు: ఆర్జేడీ

బిహార్‌ డిప్యూటీ ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ రాజీనామా వార్తలపై ఆర్జేడీ ఎట్టకేలకు స్పందించింది.

పట్నా: బిహార్‌ డిప్యూటీ ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ రాజీనామా వార్తలపై ఆర్జేడీ ఎట్టకేలకు స్పందించింది. డిప్యూటీ సీఎం పదవికి ఆయన రాజీనామా చేసేది లేదని ఆ పార్టీ సోమవారమిక్కడ స్పష్టం చేసింది. తేజస్వి యాదవ్‌ మంచి నేత అని, ఆయన తీరు భేషుగ్గా ఉందని పేర్కొంది. సీబీఐ దాడులు రాజకీయ కుట్ర అని, అయితే రాష్ట్రంలో తమ కూటమి బలంగా ఉందని పేర్కొంది.

ఈ నేపథ్యంలో పార్టీ అధినేత లాలూ ప్రసాద్‌ తన నివాసంలో ఇవాళ పార్టీ ఎమ్మెల్యేలలో భేటీ అయ్యారు.  తాజా రాజకీయ పరిణామాలు, సీబీఐ కేసులు తదితర అంశాలపై ఎమ్మెల్యేలతో ఆయన  చర్చలు జరిపారు. ఈ కీలక సమావేశం అనంతరం తేజస్వీ యాదవ్‌ పదవికి రాజీనామా చేయరని ఆ పార్టీ వెల్లడించింది. మెజార్టీ ఎమ్మెల్యేలు కూడా తేజస్వి యాదవ్‌కు మద్దతుగా నిలిచారు. తేజ‌స్వి త‌ప్పు చేయ‌లేదని, ఆయ‌న రాజీనామా చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆ పార్టీ ఎమ్మెల్యేలు తెలిపారు.

కాగా అవినీతి ఆరోపణలు, సీబీఐ కేసుల నేపథ్యంలో  డిప్యూటీ సీఎం పదవికి తేజస్వి యాదవ్‌ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ డిమాండ్‌తో సీఎం నితీశ్ కుమార్ కూడా ఇబ్బందుల్లో ప‌డ్డారు. దీంతో తేజ‌స్వి యాద‌వ్‌ను డిప్యూటీ సీఎం ప‌ద‌వి నుంచి ఎలా త‌ప్పించాల‌ని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్జేడీ తాజా ప్రకటనపై నితీశ్‌ కూడా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు జేడీయూ నేత‌లు మంగళవారం స‌మావేశం కానున్నారు. ఈ భేటీలో తేజస్వి యాదవ్‌ భవితవ్యం తేలనుంది.

ఇక లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఐఆర్‌సీటీసీ హోటళ్ల టెండర్ల వ్యవహారంలో అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలతో శుక్రవారం లాలూ ప్రసాద్‌ ఇంటిపై సీబీఐ కొరడా ఝళిపించింది. ఆయన నివాసంతో పాటు మరో 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిపిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడులు బీజేపీ కుట్ర అని లాలూ ప్రసాద్‌ ఆరోపణలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement