టెలికంకు ‘టాటా’..! | Tata Comm, Tata Tele rally up to 6% intraday on telecom exit buzz, pare gains at close | Sakshi
Sakshi News home page

టెలికంకు ‘టాటా’..!

Jan 30 2014 1:20 AM | Updated on Sep 2 2017 3:09 AM

విదేశాల్లో భారీ టేకోవర్లతో దూసుకెళ్లిన టాటా గ్రూప్... స్వదేశంలో మాత్రం కీలకమైన టెలికం రంగం నుంచి వైదొలగనుందా? మార్కెట్ వర్గాలు, మీడియాలో ఇప్పుడు ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ముంబై: విదేశాల్లో భారీ టేకోవర్లతో దూసుకెళ్లిన టాటా గ్రూప్... స్వదేశంలో మాత్రం కీలకమైన టెలికం రంగం నుంచి వైదొలగనుందా? మార్కెట్ వర్గాలు, మీడియాలో ఇప్పుడు ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టాటా గ్రూప్ చైర్మన్‌గా పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తిచేసుకున్న సైరస్ మిస్త్రీ... గ్రూప్‌లో భారీ వ్యూహాత్మక మార్పులకు తెరతీస్తున్నట్లు సమాచారం.

 ఇందులో భాగంగా టెలికం వ్యాపారం నుంచి పూర్తిగా తప్పుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టాటా టెలీసర్వీసెస్, టాటా కమ్యూనికేషన్స్ పేరుతో టాటా గ్రూప్ మెజారిటీ వాటాదారుగా టెలికం సేవలను అందిస్తోంది. అయితే, ఈ రెండు కంపెనీల్లో తమకున్న వాటాను బ్రిటిష్ టెలికం దిగ్గజం వొడాఫోన్‌కు విక్రయించే ప్రణాళికల్లో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయని ఒక బిజినెస్ పత్రిక తన కథనంలో పేర్కొంది. ఈ డీల్‌కు సంబంధించిన సంప్రతింపులు ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉన్నాయని కూడా వెల్లడించింది. ఉప్పు నుంచి సాఫ్ట్‌వేర్‌దాకా అనేక ఉత్పత్తులు, సేవలకు సంబంధించి 100కు పైగా కంపెనీలు టాటా గ్రూప్‌లో ఉన్నాయి.

 డీల్ సంక్టిష్టమే...
 టాటా గ్రూప్ టెలికం వ్యాపారాన్ని వొడాఫోన్‌కు విక్రయించడం అంత సులువేమీ కాదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే టాటా టెలీ, టాటా కమ్యూనికేషన్స్ రెండింటిలోనూ బోర్డు నిర్ణయాలను శాసించేస్థాయిలో అనేక మంది వాటాదార్లు ఉన్నారు. దీంతో డీల్ పూర్తవ్వాలంటే అనేక అడ్డంకులను అధిగమించాల్సి ఉంటుంది. టాటా టెలీలో జపాన్ కంపెనీ ఎన్‌టీటీ డొకోమోకు 26% వాటా ఉంది. 2008లో సుమారు 2.1 బిలియన్ డాలర్లకు ఈ వాటాను కొనుగోలు చేసింది. మరోపక్క, అంతర్జాతీయస్థాయిలో మొబైల్ డేటా సేవలందిస్తున్న టాటా కమ్యూనికేషన్స్‌లో కేంద్ర ప్రభుత్వానికి 26% వాటా ఉండటం గమనార్హం.

 ప్రభుత్వం రంగంలోని వీఎస్‌ఎన్‌ఎల్‌ను డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా టాటా గ్రూప్ చేజిక్కించుకుని టాటా కమ్యూనికేషన్స్‌గా పేరు మార్చడం తెలిసిందే. కాగా, ముందుగాా ఈ 26 శాతం ప్రభుత్వ వాటాను టాటా గ్రూప్ కొనుగోలు చేసి... ఆతర్వాత మొత్తం కంపెనీ(మెజారిటీ వాటా)ని వొడాఫోన్‌కు విక్రయించే విధంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

ఇందుకోసం ప్రభుత్వం, టాటా గ్రూప్ మధ్య సంప్రతింపులు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా... టాటా కమ్యూనికేషన్స్‌కు ఆఫ్రికాలో ఉన్న టెలికం సంస్థ నియోటెల్‌లో మెజారిటీ వాటాను వొడాఫోన్‌కు చెందిన వొడాకామ్‌కు విక్రయించే ప్రయత్నాల్లో ఉందని వార్తలొస్తున్నాయి. కాగా, ఇవన్నీ ఊహాగానాలంటూ టాటా సన్స్ ప్రతినిధి కొట్టిపారేశారు. వొడాఫోన్ ప్రతినిధి కూడా ‘నో కామెంట్’ అనడం గమనార్హం.

 షేరు ధరలు ఇలా...
 ప్రస్తుతం టాటా టెలీసర్వీసెస్ లిమిటెడ్‌లో భాగమైన టాటా టెలీ(మహారాష్ట్ర) లిమిటెడ్(టీటీఎంఎల్) స్టాక్ మార్కెట్లో లిస్టయి ఉంది. ముంబై, గోవా సర్కిళ్లలో ఇది మొబైల్ సేవలందిస్తోంది. బుధవారం బీఎస్‌ఈలో ఈ షేరు ధర 2.49 శాతం లాభపడి రూ.7.40 వద్ద స్థిరపడింది. ఇక టాటా కమ్యూనికేషన్స్ షేరు కూడా 2.26% పెరిగి రూ.281 వద్ద స్థిరపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement