1.5 లక్షల స్టెంట్.. ఇక రూ. 30 వేలే! | stent prices to come down by 85 percent with nppa notification | Sakshi
Sakshi News home page

1.5 లక్షల స్టెంట్.. ఇక రూ. 30 వేలే!

Feb 14 2017 9:45 AM | Updated on May 25 2018 2:29 PM

1.5 లక్షల స్టెంట్.. ఇక రూ. 30 వేలే! - Sakshi

1.5 లక్షల స్టెంట్.. ఇక రూ. 30 వేలే!

హృద్రోగులకు శుభవార్త.. స్టెంట్ల ధరలను జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ దాదాపు 85 శాతం వరకు తగ్గించింది.

హృద్రోగులకు శుభవార్త.. స్టెంట్ల ధరలను జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ దాదాపు 85 శాతం వరకు తగ్గించింది. వాటిలో ఔషధాన్ని విడుదల చేసేవి (డీఈఎస్), బయోరిసార్బబుల్ స్టెంట్ల ధర రూ. 30వేలు, బేర్ మెటల్ స్టెంట్ల ధర రూ. 7,500 మాత్రమే ఉండాలని స్పష్టం చేసింది. ఈ ధరలు మంగళవారం నుంచే అమలులోకి వస్తాయి. ప్రతియేటా కరొనరీ యాంజియోప్లాస్టీ చేయించుకునే లక్షలాది మంది గుండెరోగులకు ఇది నిజంగా పెద్ద శుభవార్తే అవుతుంది. 2016 సంవత్సరంలో మన దేశంలోనే దాదాపు 6 లక్షలకు పైగా స్టెంట్లు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం ఔషధాన్ని విడుదల చేసే స్టెంట్ల ధరలు రూ. 24 వేల నుంచి రూ. 1.5 లక్షల వరకు ఉండగా, బయోరిసార్బబుల్ స్టెంట్ల ధరలు రూ. 1.7 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు కూడా ఉన్నాయి. మన దేశంలో వాడే స్టెంట్లలో 95 శాతం వరకు ఔషధాన్ని విడుదల చేసేవే ఉంటాయి. 
 
ఔషధాన్ని విడుదల చేసే స్టెంట్ల తయారీకి అయ్యే ఖర్చు కేవలం రూ. 8వేలు మాత్రమే, అదే దిగుమతి చేసుకున్నవైతే రూ. 5వేల నుంచి కూడా ఉన్నాయి. అయితే ఉత్పత్తిదారు నుంచి రోగి వరకు వెళ్లేసరికి దాని ధర పది రెట్లకు పైగా పెరుగుతోంది. ఇందులో ఆస్పత్రులకు చాలా లాభం వస్తోందని, అవి కొన్ని కేసుల్లో దాదాపు 650 శాతం వరకు కూడా లాభాలు చేసుకుంటున్నాయని ఔషధ నియంత్రణ మండలి దృష్టికి వచ్చింది. వీటి ధరలను నియంత్రించాలన్న డిమాండును చాలాకాలంగా ఆస్పత్రుల లాబీలు అడ్డుకుంటున్నాయి. 
 
ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ రావడంతో.. ఆస్పత్రులు వాళ్లు తప్పనిసరిగా స్టెంట్ ధరను ప్రత్యేకంగా పేర్కొనాల్సి ఉంటుంది. అలాగే ప్రతి రీటైలర్, డీలర్ కూడా ధరల వివరాలను ప్యాకెట్ మీద ముద్రించి తీరాలని ఈ నోటిఫికేషన్ పేర్కొంటోంది. స్టెంట్ల ధరలను నియంత్రించాలంటూ ఢిల్లీ హైకోర్టులో ఒక ప్రజాహిత వ్యాజ్యం దాఖలైన నేపథ్యంలో గత సంవత్సరం జూలై 19వ తేదీన స్టెంట్లను కూడా జాతీయ అత్యవసర ఔషధాల జాబితాలోకి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ చేర్చింది. ఇప్పుడు ఇన్నాళ్లకు స్టెంట్ల ధరలు దిగి రావడంతో రోగులకు నిజమైన ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement