ఇంటి వద్దకే జియో సిమ్..ఎలానో తెలుసా? | Sakshi
Sakshi News home page

ఇంటి వద్దకే జియో సిమ్..ఎలానో తెలుసా?

Published Thu, Dec 29 2016 12:37 PM

ఇంటి వద్దకే జియో సిమ్..ఎలానో తెలుసా?

న్యూఢిల్లీ : ఇప్పటివరకు రిలయన్స్ జియో సిమ్ కార్డు కొనలేదా? ఉచిత ఆఫర్లను వినియోగించుకోలేకపోతున్నామని ఆందోళన చెందుతున్నారా? అయితే ఎలాంటి బెంగ అవసరం లేదట. ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్డీల్ ద్వారా ఇంటి వద్దకే జియో సిమ్ డెలివరీ చేసేందుకు కంపెనీ సన్నద్ధమవుతోంది. హ్యాపీ న్యూఇయర్ ఆఫర్ కింద జియో సిమ్లను ఇంటింటికి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది.  అయితే సిమ్ కార్డు కోసం ముందస్తుగా కస్టమర్లు ఈ-కామర్స్ వెబ్సైట్లో వివరాలను నమోదుచేసుకుంటే చాలట. 
 
స్నాప్డీల్ జియో సిమ్ హోమ్ డెలివరీ సర్వీసులో వివరాలు నమోదుచేసుకున్న అనంతరం యూజర్లకు డెలివరీ టైమ్, ప్రోమోకోడ్తో ఓ మెసేజ్ను పొందుతారు. రిలయన్స్ జియో సిమ్ను వెంటనే యాక్టివేట్ చేసుకోవాలనుకునే కస్టమర్లు, ప్రోమోకోడ్ను, ఆధార్ నెంబర్ను స్నాప్డీల్ డెలివరీ ఎగ్జిక్యూటివ్తో పంచుకుంటే వెంటనే సిమ్ యాక్టివేట్ ప్రక్రియ కూడా అయిపోతుందని రిపోర్టులు పేర్కొన్నాయి.. ఇప్పటికే స్నాప్ డీల్ తన కస్టమర్లకు ఈ-మెయిల్స్ పంపడం ప్రారంభించిందని, సిమ్ కార్డులను ఇంటింటికి డెలివరీ చేయనున్నామని తెలిపినట్టు తెలిసింది.
 
స్నాప్డీల్ నుంచి ఈ-మెయిల్స్ అందిన కస్టమర్లు ఎలాంటి చెల్లింపులు అవసరం లేకుండా జియో సిమ్ కార్డును ఇంటివద్దే పొందవచ్చు. సిమ్ను యాక్టివేట్ చేసుకోవడానికి ఎలాంటి చార్జీలు చెల్లించనవసరం లేదట.  సిమ్ కార్డు పొందిన వెంటనే వారు వాలిట్ లోకల్ ఆధార్ కార్డులను కంపెనీకి సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఆఫర్ ఎంపికచేసిన ప్రాంతాల్లో అందుబాటులో ఉందని రిపోర్టులు చెప్పాయి. ఇటీవలే జియో ఉచిత సేవలను 2017 మార్చి 31వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, ఇంటివద్దకే జియోసిమ్ లు అందిస్తూ మరో ప్రయోగం చేయబోతున్నారు.
 

Advertisement
Advertisement