
ఎన్డీఏకు దూరమవుతున్నమిత్రపక్షాలు!
ఎన్డీఏకు మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా దూరమవుతున్నాయి. ఎన్డీఏతో ఉన్న 18 ఏళ్ల అనుబంధాన్ని జేడీయూ సార్వత్రిక ఎన్నికలకు ముందే తెగతెంపులు చేసుకోగా..
న్యూఢిల్లీః ఎన్డీఏకు మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా దూరమవుతున్నాయి. ఎన్డీఏతో ఉన్న 18 ఏళ్ల అనుబంధాన్ని జేడీయూ సార్వత్రిక ఎన్నికలకు ముందే తెగతెంపులు చేసుకోగా.. హర్యానాలోని జనహిత్ కాంగ్రెస్ సాధారణ ఎన్నికల తర్వాత మైత్రీ బంధాన్ని తెంచుకుంది. హర్యానాలో బీజేపీ మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ), ఇండియన్ నేషనల్ లోక్ దళ్(ఐఎన్ఎల్డీ)తో పొత్తు కుదుర్చుకుని బీజేపీ షాకిచ్చింది. ఇదిలా ఉండగా ఎన్డీఏకి సారథ్యం వహిస్తున్నబీజేపీతో మైత్రికి తాజాగా శివసేన కూడా స్వస్తి చెప్పింది. మహారాష్ట్రలో బీజేపీతో చెలిమి చెడడంతో కేంద్ర కేబినెట్ నుంచి వైదొలగాలని శివసేన నిర్ణయించింది. ఎన్డీఏ సర్కారులో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న తమ పార్టీ నేత అనంత్ గీతే పదవి నుంచితప్పుకుంటారని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ప్రకటించారు. అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అనంత్ గీతే మంత్రి పదవికి రాజీనామా చేస్తారని వెల్లడించారు.
మోడీ ప్రభుత్వంలో శివసేన తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక మంత్రి అనంత్ గీతే. వచ్చే నెలలో జరగనున్న మహారాష్ట్ర ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కుదరకపోవడంతో బీజేపీ, శివసేన వేరుబాట పట్టాయి. మహారాష్ట్రలో ఎన్నికలు సమీపిస్తున్నా.. రాష్ట్రంలో బీజేపీ నాయకుడ్ని ప్రకటించకుండా ఆ పార్టీ గందరగోళంలో కొట్టుమిట్టాడుతోంది. ఇందుకు కారణం శివసేనతో పొత్తు వైఫల్యం చెందడమే ప్రధాన కారణం. దీనిపై పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇక్కడ బీజేపీ నుంచి కెప్టెన్ ఎవరూ లేకపోవడాన్నిఅవార్డు గ్రహీత, గోవా బీజేపీ నాయకుడు విష్ణు వాగ్ ప్రశ్నిస్తున్నారు. ఇలా ఎన్డీఏ నుంచి మిత్రపక్షాలు దూరం కావడంతో బీజేపీ నేతల్లో అలజడి ఆరంభమైంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నమోదీ వచ్చేదాకా పార్టీలో ఏర్పడ్డ గందరగోళానికి ఫుల్ స్టాప్ పడేటట్లు కనబడుటలేదు.