బిల్లుపై ఓటింగ్ కాదది: దిగ్విజయ్ | its not voting on bill, says digvijay singh | Sakshi
Sakshi News home page

బిల్లుపై ఓటింగ్ కాదది: దిగ్విజయ్

Jan 31 2014 1:30 AM | Updated on Aug 18 2018 4:13 PM

బిల్లుపై ఓటింగ్ కాదది: దిగ్విజయ్ - Sakshi

బిల్లుపై ఓటింగ్ కాదది: దిగ్విజయ్

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై ఓటింగ్ జరగలేదని, ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానంపై మాత్రమే ఓటింగ్ జరిగిందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ పేర్కొన్నారు.

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై ఓటింగ్ జరగలేదని, ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానంపై మాత్రమే ఓటింగ్ జరిగిందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ పేర్కొన్నారు. అది బిల్లును వ్యతిరేకించినట్టు కాదన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో ఏమన్నారంటే...
 
 ప్రశ్న: గురువారం అసెంబ్లీలో జరిగిన ఓటింగ్‌ను మీరు ఎలా చూస్తారు?
 
 దిగ్విజయ్: బిల్లుపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చర్చించింది. రాష్ట్రపతి అసెంబ్లీ అభిప్రాయం తెలుసుకునేందుకు బిల్లును పంపించారు. ఒక వారం పొడిగింపు తరువాత అంటే జనవరి 30 తరువాత బిల్లు తిరిగి రావాల్సి ఉంది. అసెంబ్లీ అభిప్రాయం తెలుసుకోవడమనే రాజ్యాంగపరమైన ఆవశ్యకత ఈ ప్రక్రియతో పూర్తయింది. బిల్లుపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చర్చించి, అభిప్రాయాలు కూడా తెలిపింది. కాబట్టి రాష్ట్ర విభజన ప్రక్రియలో మరో కీలకమైన ఘట్టం ముగిసింది. శాసనసభ్యులు చేసిన సిఫార్సులు, సలహాలను కేంద్ర మంత్రిమండలి చర్చించి తగిన నిర్ణయం తీసుకుని బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతుంది. ఇక తీర్మానానికి సంబంధించి చూస్తే 3వ అధికరణం ప్రకారం కొత్త రాష్ట్ర ఏర్పాటుకు గల రాజ్యాంగపరమైన ప్రక్రియకు అది ఆటంకం కాబోదు.
 
 ప్రశ్న: బిల్లును తిరస్కరిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది కదా?
 
 అది బిల్లును తిరస్కరించడం కాదు. తెలంగాణ బిల్లుపై జరిగిన ఓటింగ్ కాదది. తెలంగాణ బిల్లుపై ఓటింగ్ జరగలేదు. ముఖ్యమంత్రి చేసిన తిరస్కరణ తీర్మానం మాత్రం మూజువాణి ఓటుతో నెగ్గింది. ఆ రెండూ వేర్వేరు.
 
 ప్రశ్న: అంటే బిల్లును తిరస్కరిస్తున్నట్టు కాదా?
 
 అలా కాదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. బిల్లును పంపింది అభిప్రాయాలు తెలపడం కోసం. ఓటింగ్ కోసం కాదు. బిల్లుపై ఓటింగ్ జరగలేదు.
 
 ప్రశ్న:  సీఎం చర్యను ఎలా చూస్తారు?
 దిగ్విజయ్: అది ఊహించిందే.
 
 పార్టీ వ్యతిరేక చర్యగా భావించట్లేదా? దిగ్విజయ్: ఈ సున్నితమైన విషయంలో రాష్ట్ర విభజనకు సంబంధించి అటు సీమాంధ్ర ప్రాంతం నుంచి గానీ, ఇటు తెలంగాణ నుంచి గానీ నేతలు తమ అభిప్రాయాలు తెలిపేందుకు కాంగ్రెస్ స్వేచ్ఛ ఇచ్చింది. అందువల్ల ఆ నేతలు అభిప్రాయాలు చెప్పారు.
 
 సీఎం కిరణ్‌పై క్రమశిక్షణ చర్యలు ఉండవంటారా?
 
 దిగ్విజయ్: విభజనపై వారి వారి అభిప్రాయాలు చెప్పొచ్చు. ఎందుకంటే ఇది సున్నితమైన విషయం.
 కిరణ్ సీమాంధ్రకే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారన్న తెలంగాణ నేతల ఆరోపణలపై మీరేమంటారు?
 దిగ్విజయ్: ఇరు ప్రాంతాల నేతలు మాట్లాడే అవకాశమిచ్చాం. మేం జోక్యం చేసుకోలేదు.
 
 బిల్లుకు సవరణలుంటాయా?
 
 దిగ్విజయ్: వచ్చిన సవరణలను కేబినెట్ పరిశీలించి మంచివైతే బిల్లులో చేర్చేందుకు ప్రయత్నిస్తుంది.
 ఫిబ్రవరి 4న జీవోఎం భేటీ ఉంటుందా?
 దిగ్విజయ్: అది జీవోఎం చైర్మన్ నిర్ణయిస్తారు.
 పోలవరం, ఉమ్మడి రాజధాని వంటి అంశాలపై సవరణలుంటాయా?
 దిగ్విజయ్: అలాంటి అంశాలన్నీ కేంద్ర కేబినెట్‌లో చర్చకు వస్తాయి.
 బిల్లు సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా ఉందని పార్టీలు అంటున్నాయి కదా?
 దిగ్విజయ్: అన్ని వర్గాలు భిన్న వేదికల ద్వారా తమ అభిప్రాయాలు చెప్పేందుకు కేంద్రం అవకాశం కల్పించింది. పార్టీలు విభజనకు ఒప్పుకున్నాయి. రాతపూర్వకంగానూ అభిప్రాయం తెలిపాయి. వాటికి అనుగుణంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
 సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి?
 దిగ్విజయ్: మే నెల వరకు వేచి చూడాల్సిందే.
 రాజ్యసభ ఎన్నికల్లో తిరుగుబాటు అభ్యర్థులు నిలబడ్డారు. మీ పార్టీ అభ్యర్థులు గెలుస్తారా?
 దిగ్విజయ్: ఇద్దరు తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకుంటారు. వారితో మేం మాట్లాడుతున్నాం. మూడు సీట్లు గెలుచుకుంటామని వంద శాతం నమ్మకముంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement