ఇర్మా సృష్టించిన పెనువిపత్తు!

ఇర్మా సృష్టించిన పెనువిపత్తు!


సాక్షి, వాషింగ్టన్‌: ఇర్మా తుఫాన్‌ కరేబియన్‌ దీవుల్లో పెను విపత్తును సృష్టించింది. ప్రచండమైన గాడ్పులు, వర్షాలతో బుధవారం రాత్రి ఇర్మా తుఫాన్‌.. అంటిగ్వా, బార్బుడా, ప్యూర్టోరికా, సెయింట్‌ మార్టిన్‌ దీవులపై విరుచుకుపడింది. దీంతో ప్రభుత్వ భవనాలు కుప్పకూలాయి. అనేక నివాసాల పైకప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్‌, సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. మరోవైపు, 5 కేటగిరి తుఫాన్‌ తీవ్రతతో దూసుకుపోతున్న దక్షిణ ఫ్లోరిడా దిశగా సాగుతుండటంతో అమెరికా అప్రమత్తమైంది.హరికేన్‌ ఇర్మా ధాటికి బార్బుడా ఛిన్నాభిన్నమైంది. 'బార్బుడా శిథిలమయంగా కనిపిస్తోంది. గృహసముదాయాలన్నీ ధ్వంసమయ్యాయి. బార్బుడా దీవి పూర్తిగా నేటమట్టమైంది' అని అంటిగ్వా, బార్బుడా ప్రధాని గాస్టన్‌ బ్రౌన్‌ మీడియాతో తెలిపారు. ఇర్మా తుఫాన్‌ ధాటికి బార్బుడా దీవిలో కనీసం ముగ్గురు చనిపోయినట్టు తెలుస్తోంది. ఇందులో ఒక చిన్నారి ఉంది. ఇక సెయింట్‌ మార్టిన్‌ దీవుల్లో ఈ తుఫాన్‌ ధాటికి ఐదుగురు ప్రాణాలు విడిచారు. వైబ్రంట్‌ నైట్‌లైఫ్‌కు వేదిక అయిన సెయింట్‌ మార్టిన్‌ దీవిలో ఇర్మా పెనువిపత్తును సృష్టించిందని, 95శాతం ఆస్తులు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు.  1800 మంది జనాభా గల బార్బుడా దీవి ఏమాత్రం నివాసయోగ్యం కాకుండా సమూలంగా ధ్వంసమైందని, ఇక్కడి ప్రజలంతా నిరాశ్రయులయ్యే పరిస్థితి నెలకొందని ప్రధాని బ్రౌన్‌ పేర్కొన్నారు. ఇక్కడ ధ్వంసమైన నివాసాలు పునర్నిర్మించేందుకు ఎంతలేదన్న 150మిలియన్‌ డాలర్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసినట్టు చెప్పారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top