
మీ సహకారం మాకు అవసరం
మేకిన్ ఇండియాకు జర్మనీ సహకారం ఎంతో అవసరం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
బెర్లిన్: మేకిన్ ఇండియాకు జర్మనీ సహకారం ఎంతో అవసరం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మోర్కెల్ను కలిశారు. ఈ సందర్భంగా ఆమెతో మాట్లాడిన ఆయన నైపుణ్యానికి పెట్టింది పేరు జర్మనీ అని కొనియాడారు. జర్మనీ నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్న ఆయన తయారీ రంగంలో ఆ దేశమే టాప్ అని చెప్పారు.
జర్మనీ నుంచి భారత మానవ వనరులకు కావాల్సిన సూచనలు, సహకారాలు అందితే మేటి శక్తిగా ఎదుగుతామని చెప్పారు. జర్మనీతోపాటు ఇండియా కూడా భద్రతా మండలిలో శాశ్వత సభ్యురాలిగా ఉంటే ప్రపంచానికే మేలు అని సూచించారు. ఉగ్రవాదం అనూహ్య రీతిలో పడగ విప్పుతోందని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. దానిని అణిచివేసేందుకు సమగ్ర ప్రణాళిక కావాలని కోరారు. ఉగ్రవాదానికి మద్దతిచ్చేవారిని తాము ఏమాత్రం సహించబోమని చెప్పారు.