నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు: మోదీ | In my entire life, this is the biggest rally: PM narendramodi in Lucknow, Uttar Pradesh | Sakshi
Sakshi News home page

నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు: మోదీ

Jan 2 2017 3:16 PM | Updated on Aug 15 2018 6:34 PM

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో సోమవారం బీజేపీ నిర్వహించిన పరివర్తన్‌ ర్యాలీకి జనం పోటెత్తారు.

లక్నో: ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో సోమవారం బీజేపీ నిర్వహించిన పరివర్తన్‌ ర్యాలీకి జనం పోటెత్తారు. ఈ సభకు లక్షలాదిమంది తరలిరావడంతో ప్రధాని నరేంద్ర మోదీ ఉప్పొంగిపోయారు. తన జీవితంలో ఎప్పుడూ ఇంత పెద్ద బహిరంగ సభను చూడలేదని, తాను పాల్గొన్న ర్యాలీలలో ఇదే అతిపెద్దదని మోదీ అన్నారు. లక్షలాదిమందితో కూడిన ఇంతటి భారీ జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించే అవకాశం గతంలో రాలేదని పేర్కొన్నారు. ర్యాలీలో పాల్గొన్న ప్రజలను చూశాక ప్రత్యర్థి పార్టీలు విజయంపై ఆశ వదులుకోవాల్సిందేనని మోదీ అన్నారు.

త్వరలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రధాని మోదీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. లక్నో సభలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, ఉమా భారతి, అనుప్రియ పటేల్‌, బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్‌ అభివృద్ధి కోసం బీజేపీకి ఓటు వేయాలని మోదీ పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే మార్పును మీరే చూస్తారని ప్రజలను ఉద్దేశించి అన్నారు. పేదరికాన్ని, నిరక్షరాస్యతను నిర్మూలించాలని పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్‌ను రక్షించే ఒకే ఒక్క పార్టీ బీజేపీ అని ప్రధాని మోదీ అన్నారు. యూపీకి ఏడాదికి లక్ష కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. పార్టీల మధ్య రాజకీయం ఉండాలి కాని, ప్రజలతో రాజకీయం చేయకూడదని హితవు పలికారు. తాను ఉత్తరప్రదేశ్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యాయని, అయితే రాష్ట్ర పరిస్థితి చూస్తే బాధ కలుగుతోందని మోదీ అన్నారు.

సమాజ్‌వాదీ గూండారాజ్‌కు ముగింపు పలకాలని కోరారు. కుటుంబం కోసం పాకులాడే పార్టీలు అభివృద్ధి చేస్తాయా అంటూ అధికార సమాజ్‌వాదీ పార్టీని ఉద్దేశించి అన్నారు. 14 ఏళ్లుగా యూపీలో అభివృద్ధి ఆగిపోయిందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమని ఈ సభను చూసిన వారికి అర్థమవుతుందని అన్నారు. ఈ సభలో ప్రసంగించడం తన అదృష్టమని, లక్నో నుంచి గతంలో మాజీ ప్రధాని వాజ్‌పేయి ప్రాతినిధ్యం వహించారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement