నా జోలికి వస్తారనుకోను

నా జోలికి వస్తారనుకోను - Sakshi


మహిళ కావడమే భద్రమని భావించిన గౌరీ లంకేశ్‌

మహిళ కావడమే తనకు భద్రతనీ, తండ్రి వలె బెదిరింపులు, అవరోధాలు ఎదురుకావనే ధీమాను కనబరిచారు ప్రముఖ జర్నలిస్ట్‌ గౌరీ లంకేశ్‌. ఆమె నమ్మకం తప్పని బెంగళూరులో మంగళవారం హంతకుల తూటాలు నిరూపించాయి. 2000లో తండ్రి, రచయిత, పాత్రికేయుడు పి.లంకేశ్‌ మరణానంతరం మూసేయాలనుకున్న లంకేశ్‌ పత్రిక సంపాదకత్వం బాధ్యతలను గౌరి చేపట్టారు. ఆ తరువాత ఇంగ్లిష్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌ రీడిఫ్‌ ప్రతినిధి ఎండీ రీతీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భద్రతపై చాలా ధీమాగా మాట్లాడారు.



తండ్రి మరణించిన రెండు రోజులకే 38 సంవత్సరాల గౌరీ లంకేశ్‌ పత్రిక ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టారు. గతంలో మాదిరిగానే 70 వేల కాపీల సర్క్యులేషన్‌ వద్ద పత్రిక నిలదొక్కుకుంది. అంతకు కొన్నేళ్ల క్రితమే భర్త, ప్రముఖ ఆంగ్ల జర్నలిస్ట్‌ చిదానంద రాజ్‌ఘట్టా నుంచి గౌరి విడాకులు తీసుకుని, సొంతూరు బెంగళూరులో ఒంటరిగానే జీవిస్తున్నారు. అదే ఏడాది మార్చి 15న ఇంటర్వ్యూలో గౌరి వ్యక్తిగత భద్రత గురించి రీతీ ప్రశ్నించారు. ‘ మీ తండ్రి తరచూ కోర్టు కేసులతోపాటు ప్రాణ ముప్పు ఎదుర్కున్నారు.  ఆయన అవేమీ పట్టించుకోలేదు.



ఇంకా యవ్వనంలోనే ఉన్న ఒంటరి మహిళగా మీరు అంత ఒత్తిడిని తట్టుకోగలరా?’ అని ప్రశ్నించగా, ‘ నా తండ్రిపై కొందరు కేసులు పెట్టిన విషయం నిజమేగాని ఆయన ప్రచురించిన విషయాలన్నీ సత్యాలే కావడంతో ఇంకా చాలా మంది ఆయన్ని కోర్టుకు లాగకుండా మిన్నకుండిపోయారు. పత్రిక పదును తగ్గకుండా ప్రొఫెషనల్‌గా నడపడానికి ప్రయత్నిస్తున్నా. ఈ పరిస్థితుల్లో మహిళగా ఎడిటర్‌ విధులు నిర్వర్తించడం నాకెంతో అనుకూలాంశం. నాన్నంటే గిట్టని రాజకీయ నాయకుడిని మా రిపోర్టరెవరైనా కలిస్తే నాన్నను ఆ నేత బండ బూతులు తిడతారు. అదే ఓ మహిళపై ఎవరైనా ఇలా నోరుపారేసుకుంటే సమాజంలో వారు పరువు మర్యాదలు కోల్పోతారు. కాబట్టి, మహిళను కావడమే ప్రస్తుతానికి నాకు భద్రత’అని గౌరి ఆత్మవిశ్వాసంతో జవాబిచ్చారు.



బ్లాంక్‌ కాల్స్‌ ఆగిపోయాయి...

‘జనం మిమ్మల్ని అసభ్య పదాలతో దూషించకపోవచ్చు, కానీ స్త్రీ కావడం వల్ల భౌతిక దాడులకు తెగబడే ప్రమాదముంది. ఒంటరిగా నివసిస్తున్న మీపై దాడి సులువని భావిస్తారు కదా?’ అని ప్రశ్నించగా, ‘ భౌతిక దాడులంటే భయపడను. పదిహేను రోజుల క్రితం వరకూ తెల్లవారుజామున మూడు గంటలకు ఒంటరిగా ఇంటికెళ్లడం నాకు అలవాటే.  తెలియని వ్యక్తుల నుంచి బ్లాంక్‌ కాల్స్‌ కూడా ఆగిపోయాయి’’ అని గౌరి బదులిచ్చారు. సమాజంపై గౌరి వ్యక్తం చేసిన అభిప్రాయాలు తప్పని రుజువు కావడానికి 17 ఏళ్లు పట్టింది.              

 – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top