
రాష్ట్రంలో ధాన్యాల కొరత!
రాష్ట్రంలో ఆహారధాన్యాల సాగు 55 శాతానికే పరిమితమైంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ దుస్థితి నెలకొంది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆహారధాన్యాల సాగు 55 శాతానికే పరిమితమైంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ దుస్థితి నెలకొంది. ధాన్యాల సాగు ముఖ్యంగా వరి పంట భారీగా పడిపోవడంపై వ్యవసాయ శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. ఈసారి ధాన్యాల కొరత ఏర్పడే ప్రమాదముందని అంచనా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా సాధారణ పంటల సాగు 1.03 కోట్ల ఎకరాల్లో జరగాల్సి ఉండగా... అందులో ఆహారధాన్యాలు 51.62 లక్షల ఎకరాల్లో వేయాలి. కానీ ఆహార ధాన్యాల సాగు కేవలం 28.60 లక్షల ఎకరాలకే (55 శాతం) పరిమితమైంది.
అందులో వరి నాట్లు 26.47 లక్షల ఎకరాల్లో వేయాల్సి ఉండగా... అత్యంత తక్కువగా 9.20 లక్షల ఎకరాల్లో (35%) మాత్రమే నాట్లు పడ్డాయి. పప్పు ధాన్యాల సాగు 11.20 లక్షల ఎకరాలకు గాను... 8.60 లక్షల ఎకరాల్లో (77%) జరిగిందని వ్యవసాయశాఖ బుధవారం విడుదల చేసిన వారపు నివేదికలో పేర్కొంది. నూనె గింజల సాగు మాత్రం 103 శాతం జరిగిందని వెల్లడించింది. పత్తి నూటికి నూరు శాతం, సోయాబీన్ 141 శాతం, మొక్కజొన్న 83 శాతం సాగు జరిగినా వర్షాభావంతో ఆ పంటలు చేతికందే పరిస్థితి కనిపించడంలేదు. దీంతో రెండు విధాలా రైతు నష్టపోయే పరిస్థితి నెలకొంది.
ఏడు జిల్లాల్లో వర్షాభావం...
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటివరకు 21 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొనగా.. వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. గత ఏడాది జూలైతో పోలిస్తే ఈ ఏడాది జులైలో భూగర్భ జలాలు 2.17 మీటర్ల మేర లోతుల్లోకి వెళ్లాయి.