సవతి తల్లి రాక్షసత్వానికి పరాకాష్ట ఆమె!

సవతి తల్లి రాక్షసత్వానికి పరాకాష్ట ఆమె!


దాదాపు రెండేళ్ల పాటు 12 ఏళ్ల సవతి కూతురిని నానా రకాలుగా చిత్రహింసలకు గురిచేసింది ఆమె. చాలాసార్లు అన్నం పెట్టకుండా కడుపు మాడ్చింది. మెటల్‌ చిపురుకట్ట హ్యాండిల్‌తో ఓసారి తీవ్రంగా చితకబాదింది. దీంతో ఆ చిన్నారి మణికట్టు ఎముకలోతు వరకు తెగి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది. చాలాకాలం ఆమె ఆస్పత్రికే పరిమితమైంది. చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఇంతటి దారుణానికి పాల్పడిన ఆ మహిళ పాపం పండింది.సవతి కూతురిని దారుణంగా హింసించిన భారత సంతతి మహిళ షీతల్‌ రానోత్‌ (35)ను అమెరికా కోర్టు దోషిగా తేల్చింది. చిన్నారిపై దాడి చేసి.. ఆమె ప్రాణాలను అపాయంలోకి నెట్టినందుకు షీతల్‌కు 15 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ క్వీన్స్‌ సుప్రీంకోర్టు జడ్జి రీచర్డ్‌ బచర్‌ శుక్రవారం తీర్పు వెలువరించారు. చిన్నారి మాయాను దారుణంగా హింసించిన షీతల్‌ రానోత్‌ 'సవతి తల్లి రాక్షసత్వానికి పరాకాష్ట' అని క్వీన్స్‌ డిస్ట్రిక్ట్‌ అటార్నీ జనరల్‌ రిచర్డ్‌ బ్రౌన్‌ కోర్టుకు నివేదించారు.'చిన్నారి మాయా ఎదిగేందుకు అవసరమైన కనీస మౌలిక అవసరాలు కూడా తీర్చకపోవడమే కాదు.. కావాలని చాలాసార్లు ఆ చిన్నారిని షీతల్‌ దారుణంగా హింసించింది. ఈనాటికి ఆ చిన్నారి శరీరంపై గాయాలు తాలుకూ మచ్చలు అలాగే ఉన్నాయి. 12 ఏళ్ల వయస్సులో ఆ చిన్నారి కేవలం 58 పౌండ్ల బరువు ఉన్నదంటే తన పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏ చిన్నారికి కూడా ఇలాంటి దారుణమైన పరిస్థితి ఎదురుకావొద్దు' అని బ్రౌన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మాయా సొంత తండ్రి రాజేష్‌ రానోత్‌పై దాడి, అక్రమ నిర్బంధం, చిన్నారి సంరక్షణను పట్టించుకోకపోవడం వంటి అభియోగాలు మోపారు.ఈ అభియోగాలపై త్వరలో విచారణ జరుగనుంది. క్వీన్స్‌ ప్రాంతానికి చెందిన షీతల్‌ తరచూ సవతి కూతురిని హింసిస్తూ కొట్టేదని, ఒసారి తనకు చెప్పులు తొడుగుతున్న చిన్నారిని ముఖంపై తన్నిందని, దీంతో కన్ను ఉబ్బి.. ముఖమంతా చిన్నారి నొప్పితో విలవిలలాడిందని బ్రౌన్‌ తెలిపారు. డిసెంబర్‌ 2012 నుంచి మే 2014 వరకు చిన్నారిని తన బెడ్‌ రూమ్‌లో బంధించి హింసిందని, ఈ సమయంలో సరిగ్గా చిన్నారికి ఆహారం కూడా అందించలేదని వివరించారు. ఈ అభియోగాలను ధ్రువీకరించిన కోర్టు దోషిగా తేలిన షీతల్‌కు కఠిన శిక్ష విధించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top