18 పార్లమెంటు కమిటీలు ఏకగ్రీవం! | 18 Parliament committees elected unanimously | Sakshi
Sakshi News home page

18 పార్లమెంటు కమిటీలు ఏకగ్రీవం!

Jul 28 2014 12:25 AM | Updated on Mar 29 2019 9:24 PM

లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత ఎంపిక వ్యవహారంపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య వివాదం తెగకున్నా పార్లమెంటు కమిటీలకు సభ్యుల ఎన్నిక మాత్రం ఏకగ్రీవంగా సాగింది.

న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత ఎంపిక వ్యవహారంపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య వివాదం తెగకున్నా పార్లమెంటు కమిటీలకు సభ్యుల ఎన్నిక మాత్రం ఏకగ్రీవంగా సాగింది. మొత్తం 18 కమిటీలు, ప్రభుత్వ సంస్థలకు సభ్యులు ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత 30 ఏళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి. సభ్యులు ఏకగ్రీంగా ఎన్నికైన కమిటీల్లో ఆర్థికంగా కీలకమైన ప్రజాపద్దులు, అంచనాల కమిటీలతోపాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కమిటీలూ ఉన్నాయి. ‘సభలో చక్కటి నిర్వహణ, విపక్షాలతో తెరవెనక సమన్వయంతో నేతలు, పార్టీల మధ్య పరస్పర అంగీకారాన్ని సాధించడంతో 34 మంది ఎంపీలు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో ఎన్నిక ఏకగ్రీవమైంది’ అని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రతిపక్షానికి చెందిన జ్యోతిరాదిత్య సింధియాతోపాటు ఇతర నేతలను ఒప్పించడంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య కీలక పాత్ర పోషించారన్నాయి.

 

18 కమిటీల్లో 148 స్థానాలుండగా 159 నామినేషన్లు వచ్చాయి. దాదాపు అన్ని కమిటీల్లో మెజారిటీ సభ్యులు బీజేపీ వారే ఎన్నికయ్యారు. అంచనాల కమిటీకి 18, ప్రజా పద్దుల కమిటీకి 15,  పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ కమిటీకి 9 మంది ఆ పార్టీ వారు ఎన్నికయ్యారు. నామినేషన్లు ఉపసంహరించుకున్నవారిలో టీఆర్‌ఎస్ ఎంపీలు బి. వినోద్, జితేందర్, కె.శ్రీహరి ఉన్నారు. వినోద్, జితేందర్ ప్రభుత్వ రంగసంస్థల కమిటీ సభ్యులుగా, శ్రీహరి ఎస్సీ, ఎస్టీల సంక్షేమ కమిటీ సభ్యుడిగా నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఓబీసీ కమిటీలో 20 మందికి స్థానముండగా ఏడుగురు సభ్యులే నామినేషన్లు వేశారు. దీంతో వారు పోటీలేకుండా ఎన్నికయ్యారు. వీరిలో టీఆర్‌ఎస్, ఏఐఏడీఎంకే, శివసేన, బీజేడీల నుంచి ఒక్కొక్కరు, కాంగ్రెస్ నుంచి ఇద్దరున్నారు. టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఏపీ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అంచనాల కమిటీలో, ఏపీ టీడీపీ ఎంపీ రాయపాటి, బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు ప్రభుత్వ రంగసంస్థల కమిటీలో సభ్యులుగా ఎన్నికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement