8న ఇబ్రహీంపట్నంలో షర్మిల పర్యటన

8న ఇబ్రహీంపట్నంలో షర్మిల పర్యటన - Sakshi


ప్రభుత్వ వైఖరిని ఎండగడతాం

వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకుడు కొండా రాఘవరెడ్డి


 

ఇబ్రహీంపట్నం: తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాల్లో కూడా వైఎస్సార్ సీపీకి పటిష్టమైన ప్రజాబలముందని, ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎండగడుతూ.. రాబోయే రోజుల్లో తమ పార్టీకి ఉన్న ప్రజాదరణ ఏమిటో నిరూపిస్తామని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు కొండా రాఘవరెడ్డి అన్నారు. ఈనెల 8న వైఎస్సార్ సీపీ నాయకురాలు షర్మిల ఇబ్రహీంపట్నంలో నిర్వహిస్తున్న పర్యటన వివరాలను ఆయన మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు.



ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత చేపడుతున్న తొలి పర్యటనలో భాగంగా షర్మిల ఇబ్రహీంపట్నంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేపడతారని, అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజలు ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఇబ్రహీంపట్నంలో షర్మిల చేపట్టనున్న పర్యటన స్ఫూర్తితో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ జండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు. కేవలం అధికారాన్ని దక్కించుకునేందుకు మాత్రమే  టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇబ్బడిముబ్బడిగా హామీలను గుప్పించిందని, ఎన్నికల అవసరం తీరాక ప్రజలకిచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. పింఛన్‌లు రాకపోవడంతో ఎంతో మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, దిక్కుతెలియని స్థితిలో రైతులు జీవన్మరణ పోరాటం కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.



ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంపై ఇంకా నిర్దిష్టమెన కార్యాచరణ లేకపోడంతో ఎంతో మంది విద్యార్థులు ఉన్నత చదువులపై నమ్మకం కోల్పోతున్నారని అన్నారు. షర్మిల పర్యటలనలో వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకుడు ఏనుగు మహిపాల్‌రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు అమృతసాగర్, మంచాల మండల శాఖ అధ్యక్షుడు మాదగోని జంగయ్యగౌడ్, నేతలు దూసరి బాలశివగౌడ్, ఎండీ బాబు, ఎండీ ఖాలేద్‌భాయ్, తూర్పు ప్రభాకర్‌రెడ్డి, వి. బుగ్గరాములు, ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడు దొండ వినోద్‌రెడ్డి, యువజన విభాగం నాయకుడు నల్ల ప్రభాకర్ /పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top