మహానేత జ్ఞాపకాలు పదిలం

YS Rajasekhara Reddy Death Anniversary Celebration Nalgonda - Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ : అభివృద్ధి పథకాలు.. సంక్షేమ కార్యక్రమాలు.. పేదవాడికి మెరుగైన ఆరోగ్యం.. పేదింటి బిడ్డకు ఉన్నత చదవులు.. తడారిన గొంతులకు తాగునీరు.. బీడువారిన పొలాలకు సాగునీరు.. ఇలా.. ఒక్కటేమిటి సీఎంగా తన హయాంలో దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాపై చెరగని ముద్ర వేశారు. ఆదివారం ఆ మహానేత 9వ వర్ధంతి సందర్భంగా జిల్లా ప్రజలు ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. దశాబ్దాలపాటు మూలకు పడిన ఫైలు దుమ్ముదులిపి రూ.2153 కోట్లతో శ్రీశైలం సొరంగ మార్గం పనులు పరుగులు పెట్టించారు. ఇప్పటికే 75 శాతం పనులు పూర్తికాగా చివరి దశలో ఉన్న ఈ ప్రాజెక్టు పూర్తయితే నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని ఫ్లోరిన్‌ పీడిత ప్రాంతాలకు తాగునీటితో పాటు అప్పుడు నిర్దేశించిన ఆయకట్టు లక్ష్యం 3 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. బ్రాహ్మణ Ðð వెల్లెంల ప్రాజెక్టును అడగ్గానే రూ.700 కోట్లతో మొదలు పెట్టారు.

నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంలో ఉదయ సముద్రం ఎత్తిపోతల పనులకు 2007 సెప్టెంబర్‌ 4న వైఎస్సార్‌ శంకుస్థాపన చేశారు. ఆయన చేతుల మీదుగా పురుడు పోసుకున్న ఈ ప్రాజెక్టు నిర్మాణం పనులు గత ప్రభుత్వాల హయాంలో నత్తనడకన సాగాయి. లక్ష ఎకరాలకు సాగునీరు అందే ఈ ప్రాజెక్టు నేడు పూర్తికావొచ్చింది. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు దిగువన 463 కోట్ల రూపాయలతో టెయిల్‌పాండ్‌ నిర్మించడానికి నిధులు మంజూరు చేశారు. నాగార్జునసాగర్‌ కుడి, ఎడమ కాల్వల ఆధునికీకరణ చేపట్టడానికి  4444 కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులు మొదలు పెట్టిం చారు. నల్లగొండ పట్టణంలో రూ.200 కోట్లతో సీసీ రోడ్లు మంజూరు చేశారు. నల్లగొండలో రూ.20 కోట్లతో రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి మంజూరు చేశారు.

ఉమ్మడి ఏపీలో, ప్రస్తుతం తెలంగాణలో ఏ జిల్లాలో లేని విధంగా రూ.300 కోట్లతో మహాత్మాగాంధీ యూనివర్సిటీ కట్టించిన ఘనత ఆ మహా నాయకుడిదేనని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. బీబీనగర్‌ దగ్గర రూ.200 కోట్లతో నిమ్స్‌ను ఏర్పాటు చేసి బిల్డింగులు కట్టించారు. ఏఎమ్మార్పీకి కింద 1.40 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీరందించేందుకుగాను రూ. 450 కోట్లతో  డిస్ట్రిబ్యూటరీల పనులు చేపట్టడంతో 80శాతం ఆయకట్టు ఏఎమ్మార్పీ పరిధిలోకి వచ్చింది. 2007లో డిండి ఎత్తిపోతల పథకానికి పరిపాలనా అనుమతులు ఇచ్చి సర్వే పనులు చేయడం వల్లే పాత ప్రాజెక్టుగా పరిగణలోకి తీసుకుని నేడు ప్రాజెక్టును చేపట్టడానికి  అవకాశం లభించింది. 2008 సెప్టెంబర్‌లో  దేవరకొండలో జరిగిన సభలో డిండి ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూ రు చేస్తామని వైఎస్సార్‌ ప్రకటించారు. 

తీరిన దాహం 
గ్రామీణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు పెద్దవూర, అనుముల, పీఏపల్లి మండలాలకు చెందిన 77 గ్రామాలకు ఫ్లోరిన్‌ రహిత శుద్ధ జలాలు అందించేందుకు 2005 జనవరిలో రూ.21.75 కోట్ల నిధులతో పెద్దవూర మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ పథకంతో  పెద్దవూర మండలంలోని 46 గ్రామాలకు, అనుముల మండలంలోని 23, పెద్దఅడిశర్లపల్లి మండలంలోని 8 గ్రామాలకు శుద్ధి చేసిన కృష్ణా జలాలు ప్రస్తుతం అందుతున్నాయి. ఆలేరు నియోజకవర్గంలో ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలకు రక్షిత తాగునీటిని అందించేందుకు ఆయన కృషి చేశారు. ప్రధానంగా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని ఫ్లోరైడ్‌ పీడిత గ్రామాలకు కృష్ణా జలాలు అందించేందుకు ఏ ముఖ్యమంత్రీ చేయని కృషి ఆయన చేశారు. అదే స్థాయిలో నిధులు కూడా మంజూరు చేశారు. ప్రస్తుతం మెజారిటీ గ్రామాలకు అందుతున్న కృష్ణా జలాలు వైఎస్‌ హయాంలో పూర్తయినవే కావడం గమనార్హం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top