5 రోజులు.. వేదికలు.. | World Telugu Conference in telangana | Sakshi
Sakshi News home page

5 రోజులు.. వేదికలు..

Nov 23 2017 1:06 AM | Updated on Nov 23 2017 1:06 AM

World Telugu Conference in telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘‘తెలుగు భాష ఆవిర్భావ వికాసాలకు ప్రధాన భూమిక తెలంగాణ. ఇక్కడి నుంచే తెలుగు విస్తరించింది. ఇందుకు అనేక శాసనాలు, నాణేలు, చరిత్ర ఆధారంగా ఉన్నాయి. ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా ఈ ఘన చరిత్రను చాటి చెబుతాం. ఎన్నో ఆటుపోట్లను, ఒడిదుడుకులను తట్టుకుని నిలిచి గెలిచిన రెండువేల ఏళ్ల నాటి గొప్ప భాష తెలుగు. ఈ భాష, సంస్కృతులను సుస్థిరం చేసేలా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తాం’’అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి తెలిపారు.

వేల ఏళ్ల ఘన చరిత్ర కలిగిన తెలుగు భాష ఔన్నత్యాన్ని, విశిష్టతను విశదీకరించేందుకు, తెలంగాణలో తెలుగు భాష ఆవిర్భవించి వికసించిన తీరుతెన్నులను ప్రపంచానికి సమున్నతంగా చాటిచెప్పేందుకు ప్రపంచ తెలుగు మహాసభలను ఐదు రోజుల పాటు, ఐదు వేదికలపై నిర్వహించనున్నట్టు తెలిపారు. డిసెంబర్‌ 15 నుంచి 19వ తేదీ వరకు 5 రోజుల పాటు జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణపై బుధవారం ఆయన తెలుగు భాషా పండితులకు దిశానిర్దేశం చేశారు.

రవీంద్ర భారతిలోని తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన తెలుగు భాషా పండితులు పాల్గొన్నారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ హాజరయ్యారు.

అద్వితీయంగా సభల నిర్వహణ..
ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియంతో పాటు రవీంద్రభారతి, తెలుగు వర్సిటీ, పబ్లిక్‌గార్డెన్స్‌లోని తెలుగు లలితకళాతోరణం, ఇందిరా ప్రియ దర్శిని ఆడిటోరియంలో సదస్సులు, చర్చాగోష్టులు, కవి సమ్మేళనాలు జరుగుతాయి. నెక్లెస్‌రోడ్డు పీపుల్స్‌ప్లాజాలో జానపద కళారూపాలను ప్రదర్శిస్తారు. శాస్త్రీయ కళలపై రవీంద్రభారతిలో కార్యక్రమాలను నిర్వహిస్తారు. తెలుగు వర్సిటీలో ఐదు రోజుల పాటు నిరంతర కవి సమ్మేళనాలు ఉంటాయి.

ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో పిల్లలు, మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. ఈ ఐదు వేదికల నిర్వహణ బాధ్యతలను భాషా పండితులే పర్యవేక్షిస్తారు. సాహిత్యం, కళలు, భాషపై అభిరుచి, ఆసక్తి ఉన్నవారికే నిర్వహణ బాధ్యతలను అప్పగించనున్నారు. ఏ వేదికపై, ఏ సమయంలో, ఏ కార్యక్రమాన్ని నిర్వహించేది వాళ్లే నిర్ణయిస్తారని నందిని సిధారెడ్డి తెలిపారు.

30 దేశాల నుంచి సుమారు 500 మంది విదేశీ ప్రతినిధులు, 15 రాష్ట్రాల నుంచి 1,500 మంది తెలుగు భాష, సాహిత్యాభిమానులు సభల్లో పాల్గొంటారు. రాష్ట్రం నుంచి సుమారు 6,000 మంది ప్రతినిధులు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్‌ 15న ప్రారంభ, 19న ముగింపు వేడుకలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులను ఆహ్వానించనున్న ట్లు సిధారెడ్డి తెలిపారు. మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌.విద్యాసాగర్‌రావు కూడా ఈ వేడుకలకు హాజరుకానున్నారు. మారిషస్‌ ఉపాధ్యక్షుడు కూడా ఈ సభల్లో పాల్గొననున్నారు.


ఆత్మీయంగా ఆతిథ్యం..
సభలకు హాజరయ్యే అతిథులకు, ప్రతినిధులకు ఈ వేడుకలు ఒక మధురస్మృతిగా నిలిచిపోయేలా ఘనంగా నిర్వహించేందుకు సాహిత్య అకాడమీ ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా భోజనాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. తెలుగు సంస్కృతి, తెలంగాణ విశిష్టత ఉట్టిపడేలా రకరకాల వంటకాలను ఈ వేడుకల సందర్భంగా వడ్డించనున్నారు. ప్రతినిధులకు వసతి, భోజనం, రవాణా తదితర ఏర్పాట్లలో లోటుపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని భావిస్తున్నారు.

డిసెంబర్‌ 1 నుంచి 10వ తేదీ వరకు మహాసభలపై అన్ని జిల్లాల్లో విస్తృతంగా సన్నాహక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వివిధ అంశాల్లో పిల్లలకు జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహిస్తారు. విజేతలకు మహాసభల వేదికలపై అవార్డులను అందజేస్తారు. ప్రతి రోజు స్కూళ్లలో ప్రార్థన సమయంలో తెలుగు భాష విశిష్టత గురించి, ప్రపంచ తెలుగు మహా సభల గురించి పిల్లలకు వివరించేలా చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement