బోధనాభాష–పాలనాభాషగా తెలుగు

telugu as official language in telangana - Sakshi

ప్రపంచ తెలుగు మహాసభల పేరిట హైదరాబాద్‌లో ఐదు రోజుల పాటు సాగిన భాషా బ్రహ్మోత్సవాలు తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొదటిసారిగా అధికారి కంగా జరిగిన అపూర్వ సాంస్కృతిక ఉత్సవం ఇది. తెలంగాణ గ్రామీణ ప్రజానీకం గుండె గొంతుకలో తెలుగు భాష ఇప్పటికీ సజీవంగా ఉండటం వల్లే ఈ సభలు ఇంతగా విజయవంతమయ్యాయి. తిరుపతిలో 2012లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో పాలనాభాషగా తెలుగును విధిగా అమలు చేయాలని, ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే సాగాలని నిర్ణయించిన తీర్మానం కనీస అమలుకు కూడా నోచుకోకపోవడం అప్పటి పాలకుల చిత్తుశుద్ధిని చెబుతుంది. ఈసారి కూడా కేసీఆర్‌ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేస్తేనే పాలనాభాషగా తెలుగు గ్రామీణ ప్రాంతాలకు చేరువవుతుంది.

ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు కచ్చితంగా తెలుగు భాష అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ కార్పొరేట్‌ విద్యాసంస్థలు న్యాయస్థానాల ద్వారా ఏవో లొసుగులతో ఈ యజ్ఞానికి గండి కొట్టే ప్రయత్నం చేయకుండా ఆపాలి. మున్ముందుగా పాలనా భాషను పాఠశాల విద్యాశాఖలో ప్రయోగాత్మకంగా తక్షణం అమలు చేయాలి. ప్రభుత్వం విడుదల చేసే జీవోలు, ఉత్తర్వులన్నీ తెలుగులో వెలువరిస్తామని చెప్పినప్పటికీ అది నిరంతర ప్రక్రియ కావాలి. అందుకు అవసరమయ్యే భాషా నిఘంటువును అత్యాధునికంగా తయారు చేయించాలి.

తెలుగులో చదివిన అభ్యర్థులకు ఉద్యోగాల్లో వాటాను ప్రకటించినప్పటికీ ఈ అంశాన్ని స్పష్టంగా ఏయే రకాలుగా అమలు చేస్తారో ఉత్తర్వులు ఇవ్వాలి.  హైదరాబాద్, వరంగల్‌లో ఉన్న ప్రభుత్వ తెలుగు భాషా పండిత శిక్షణా కళాశాలను పునరుద్ధరించాలి. లబ్ధ ప్రతి ష్టులైన ఆచార్యులను అక్కడ నియమించాలి. ఐదు రోజుల సభలకు తండోపతండాలుగా వచ్చిన జనాల కోసం నిరంతరం సాహిత్య కార్యక్రమాలు జరిగేలా రవీంద్రభారతి లాంటి మరొక విశాల భవనాన్ని (కనీసం 5 వేల మంది ఒకేసారి పాల్గొనేలా) నిర్మించాలి. ఈసారి జరిగిన నిరంతర కవి సమ్మేళన ప్రక్రియ ఒక అపూర్వ ప్రయోగంలా నిలిచిపోతుంది. ఉదయం 9 గంటల నుండి అర్ధరాత్రి దాకా కొనసాగిన కవి సమ్మేళనాలు కొత్త ప్రక్రియకు తెరలేపాయి. 42 దేశాల నుండి వచ్చిన ప్రతినిధులతో నిత్యం సంప్రదింపులు జరిపే విధంగా తెలుగు విశ్వ విద్యాలయం, సాహిత్య అకాడమీల పర్యవేక్షణలో ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి. 

అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, సంస్థ పేర్లను తెలుగులోనే రాయాలనే ఆదేశాలు కచ్చితంగా అమలు చేయాలి. తమిళనాడు తరహాలో న్యాయస్థానాల తీర్పులన్నీ ఇక నుంచి తెలుగులోనే వెలువడాలి. ప్రతి యేటా తెలుగు భాషా అభివృద్ధి కోసం పురస్కారాలు ప్రోత్సాహకాలు ఇస్తూ తెలుగు మహాసభలను వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తే తెలుగు వెలుగు నూరు వసంతాల పాటు గుబాళిస్తుంది.
 
– డా‘‘ కె. రామదాస్, 
అఖిల భారత బీఎడ్, డీఎడ్‌ కళాశాలల ప్రధానాచార్యుల సంఘ ప్రధాన కార్యదర్శి

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top