సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్నాయి. గత ఎన్నికల్లో జిల్లాలో విజయం సాధించినా..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్నాయి. గత ఎన్నికల్లో జిల్లాలో విజయం సాధించినా.. ఈసారి స్థానం మారి సొంత నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిన పరిస్థితి ఒకరిదైతే.. గత ఎన్నికల్లో పరాభవం పొంది నేడు సొంత నియోజకవర్గానికి వెళ్లి విజయం సాధించిన ఆనందం మరొకరిది. ఒకరు రచ్చ గెలిచి ఇంట ఓడితే .. మరికొకరు రచ్చ ఓడి ఇంట గెలిచారు.
2009 ఎన్నికల్లో చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జైపాల్‌రెడ్డి టీడీపీ అభ్యర్థి జితేందర్‌రెడ్డిపై భారీ మెజారిటీతో గెలిచారు. వాస్తవానికి వీరిద్దరూ జిల్లాయేతరులే. ఇద్దరిదీ మహబూబ్‌నగర్ జిల్లా అయినప్పటికీ విజయావకాశాలను బేరీజు వేసుకుని అప్పట్లో చేవెళ్ల నుంచి పోటీపడ్డారు. తాజా ఎన్నికల్లో తిరిగి వీరిద్దరూ మహబూబ్‌నగర్ లోక్‌సభ బరిలో తలపడ్డారు. ఈ ఎన్నికల్లో జైపాల్‌రెడ్డి అదే పార్టీ నుంచి పోటీ చేయగా జితేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్ నుంచి బరిలోకి దిగారు. గతానికి భిన్నంగా ఈసారి జైపాల్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు.
రచ్చఓడి .. ఇంట గెలిచి..
గత ఎన్నికల్లో ఉప్పల్ అసెంబ్లీకి టీఆర్‌ఎస్ తరఫున పోటీచేసిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి బండారి రాజిరెడ్డి చేతిలో ఓడియారు. ఈసారి తన సొంత నియోజకవర్గమైన వరంగల్ జిల్లా జనగాం నుంచి అదే పార్టీ తరఫున బరిలోకి దిగిన ముత్తిరెడ్డి ఏకంగా టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను మట్టికరిపించారు.
ఇక గత ఎన్నికల్లో మహేశ్వరం శాసనసభకు టీఆర్‌ఎస్ నుంచి పోటీపడిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి సబిత ఇంద్రారెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. ఈసారి ఆయన తన సొంత నియోజకవర్గం నల్లగొండ జిల్లా మునుగోడు నుంచి అదే పార్టీ తరపున తలపడి స్వతంత్ర అభ్యర్థి పాల్వాయి స్రవంతిపై విజయం సాధించారు. ఇలా జైపాల్‌రెడ్డి రచ్చ గెలిచి ఇంట ఓడగా, జితేందర్ రెడ్డి, ముత్తిరెడ్డి, కూసుకుంట్ల రచ్చ ఓడి ఇంట గెలవడం ఆసక్తికర పరిణామం.