శీలం ఖరీదు రూ.6 లక్షలు.. చెప్పులతో దాడి | Sakshi
Sakshi News home page

అధికార పార్టీ నేత వికృత చేష్టలు

Published Mon, Mar 2 2020 8:33 AM

Women Molested By A Leader In Morthad At Nizamabad - Sakshi

సాక్షి, మోర్తాడ్‌: శీలానికి ఖరీదు కట్టారు కొందరు పెద్దలు! మహిళ ప్రాణంలా భావించే మానానికి రూ.6 లక్షల ధర నిర్ణయించారు. అధికార పార్టీ నాయకుడి వికృత చేష్టలకు ఓ యువతి గర్భం దాల్చగా, పెద్దరికం నెత్తికొత్తుకున్న కొందరు డబ్బుతో రాజీ కుదిర్చారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలో ఆదివారంరాత్రి చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్‌ గ్రామానికి చెందిన ఓ నాయకుడు (49).. అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి (27)పై కన్నేశాడు. కూతురి వయస్సుండే ఆమెను మభ్యపెట్టి లోబర్చుకున్నాడు. ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చింది. ఇటీవల సదరు యువతిని అపహరించి వారం పాటు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

పట్టించుకోని పోలీసులు.. 
తమ కూతురు అదృశ్యం కావడంతో బాధితురాలి తల్లిదండ్రులు పలుచోట్ల వెతికారు. ఆచూకీ లభించక పోవడంతో ఫిబ్రవరి 19న స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సదరు నాయకుడిపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేయలేదు సరికదా యువతి ఆ చూకీ కోసం ప్రయత్నించనూ లేదు. అయితే, యువతిని అపహరించిన సదరు నాయకుడు.. రెండ్రోజుల క్రితం ఆమెను వదిలి పెట్టాడు.

చెప్పులతో మహిళల దాడి..
ఇంటికి చేరుకున్న బాధితురాలు జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పింది. యువతి గర్భం దాల్చడం, వారం పాటు కనిపించకుండా పోవడం, అకస్మాత్తుగా ప్రత్యక్షం కావడంతో ఈ ఘటన మండలంలో తీవ్ర చర్చనీయాంశంమైంది. అయితే, ఈ వ్యవహారం బయటకు రాకూడదని భావించిన అధికార పార్టీ నాయకుడు యువతి తరఫు వారితో రాజీకి యత్నించాడు. ఈ క్రమంలో స్థానిక పోలీసుస్టేషన్‌ ఆవరణలో పంచాయితీ పెట్టుకున్నారు. మొదట్లో తనకే తప్పు తెలియదని బుకాయించిన సదరు నాయకుడు.. మహిళలు గట్టిగా నిలదీయడంతో తప్పు ఒప్పుకున్నాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులతో పాటు మహిళలు అతడిపై చెప్పులతో దాడి చేశారు. అనంతరం రంగంలోకి దిగిన పెద్దలు కొందరు.. ఇరువురిని శాంతింపజేశారు. చివరకు బాధితురాలికి రూ.6 లక్షలు చెల్లించేలా ఒప్పందం కుదిర్చి, అక్కడి నుంచి పంపించేశారు. పోలీసుస్టేషన్‌కు సమీపంలోనే ఈ తతంగం జరుగుతున్నా పోలీసులు పట్టించుకోక పోవడం గమనార్హం. మరోవైపు, బాధితులు ఫిర్యాదు చేసినా స్పందించక పోవడంతో పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement
Advertisement