అవకాశమిస్తే అదరగొడతాం..

women empowerment encourage girls education - Sakshi

సీనియర్‌ న్యాయవాది కంకణాల విజయారెడ్డి

హుజూరాబాద్‌: అమ్మాయిని ఒకలా.. అబ్బాయిని ఒకలా చూడడం మంచిది కాదు. కొడుకైనా ..కూతురైనా ఒక్కటే అనే భావన ఉండాలి. మహిళలను ప్రోత్సహించినప్పుడే సమాజంలో అసమానతలు తొలగిపోతాయి. అప్పుడే మహిళా సాధికారత సాధ్యమని హుజూరాబాద్‌కు చెందిన ప్రముఖ సీనియర్‌ న్యాయవాది కంకణాల విజయారెడ్డి అన్నారు. ఇటు న్యాయవాద వృత్తి, అటు రాజకీయాల్లో రాణిస్తున్న విజయారెడ్డి మహిళా వివక్ష, సాధికారతపై ‘సాక్షి’తో మాట్లాడారు.  

భర్త ప్రోత్సాహంతో.. 
మాది నల్గొండ జిల్లా. పెళ్లికి ముందే గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశా ను. డాక్టర్‌ కావాలని ఎంసెట్‌ కూడా రాశాను. కానీ సీటు రాలే దు. పెళ్లి తర్వాత హుజూరాబాద్‌లో విద్యానికేతన్‌ స్కూల్‌ ప్రారంభించి.. పదేళ్లపాటు నడిపాను. అప్పటికే మా ఆయన న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. నాకు కూడా న్యాయవాది కావాలనే ఆసక్తి కలిగింది. ఓ వైపు స్కూల్‌ నడుపుతూనే మరో వైపు ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాను. 1990లో న్యాయవాది పట్టా అందుకొని హుజూరాబాద్‌ కోర్టులో ప్రాక్టీస్‌ ప్రారంభించాను.

ఆ రోజుల్లో మహిళా న్యాయవాదిని హుజూరాబాద్‌ కోర్టులో నేను ఒక్కరినే. నా భర్త ప్రోత్సాహంతోనే ఈ వృత్తిలో రాణించాను. కోర్టులో కూడా తోటి న్యాయవాదులు ప్రోత్సహించే వారు. న్యాయవాద వృత్తిలోకి వచ్చిన మూడేళ్లలోనే హుజూరాబాద్‌ కోర్డులో మొట్టమొదటి ఏజీపీగా నియామకమయ్యాను. అప్పట్లో భర్తల చేతిలో వివక్షకు గురైన బాధితుల కేసులను వాదించి, వారికి అండగా నిలిచాను.

వంటింటి నుంచి  బయటకు రావాలి 
మహిళలు భర్త చాటు భార్యగా, వంటింటికే పరిమితం అనే భావన ఉండకూడదు. మగవాళ్ల మాదిరిగానే మహిళలు కూడా స్వతహాగా నిర్ణయాలు తీసుకోగలగాలి. అప్పుడే సమాజంలో నెలకొన్న అసమానతలు కొంత మేరకైనా తొలుగుతాయనేది నా భావన. మా నాన్న కట్ట రాంచంద్రారెడ్డి(మాజీ ఎమ్మెల్సీ) వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చాను.

2004లో హుజూరాబాద్‌ జెడ్పీటీసీగా ఎన్నికయ్యాను. వృత్తిలోనైనా, రాజకీయంగానైనా స్వతహాగానే నిర్ణయాలు తీసుకుంటాను. మా ఆయన భగవాన్‌రెడ్డి, పిల్లల ప్రోత్సాహం చాలా ఉంది. అసమానతలు, అవరోధాలను అధిగమించినప్పుడే మహిళలు రాణిస్తున్నారు. ఇదంతా బాలికల అక్షరాస్యతతోనే సాధ్యమవుతుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top