మహిళా కానిస్టేబుల్‌ హల్‌చల్‌

Women Constable Hulchul In Narsampet At Warangal Rural - Sakshi

నడిరోడ్డుపై మామకోడళ్లను చితకబాదిన వైనం

నర్సంపేట మున్సిపాలిటీ వద్ద భారీగా ట్రాఫిక్‌ జాం

నర్సంపేట రూరల్‌: ఓ మామతో కోడలు ఆస్థి విషయంలో మాట్లాడేందుకు మామ అద్దె ఇంటికి రాగా వ్యభిచారం చేయడానికి వచ్చారా అంటూ పక్కనే ఆఫ్‌ డ్యూటీలో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్‌ వెంబడించి చితకబాదిన సంఘటన నర్సంపేట పట్టణంలో సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నర్సంపేట డివిజన్‌లోని చెన్నారావుపేటకు మండలంలోని ఓ తండాకు చెందిన మామ నర్సంపేట పట్టణంలోని ఎన్జీవోస్‌ కాలనీలో ఇల్లు కిరాయికి తీసుకుని ఉంటున్నాడు. కాగా నర్సంపేట పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. కోడలు తన భూమి విషయంలో అద్దెకు ఉంటున్న తన మామ ఇంటి వద్దకు వచ్చి అరుగుమీద కూర్చొని భూమి పంపకాల విషయంలో చర్చించుకుంటున్నారు. అయితే అదే క్రమంలో పక్కనే మహిళా కానిస్టేబుల్‌ వ్యభిచారం చేయడానికి వచ్చారా అని నిలదీసింది.

దీంతో అక్రమ సంబంధం ఎలా అంటకడుతావే అని కానిస్టేబుల్‌పై మామ, కోడలు ఆగ్రహం వ్యక్తం చేసి, డ్యూటీ ఎలా చేస్తావో చూస్తానంటూ ద్విచక్రవాహనం వస్తుండగా విన్న కానిస్టేబుల్, ఆయన భర్త కలిసి వారిని మరో ద్విచక్రవాహనంపై వెంబడించారు. నర్సంపేట పట్టణంలోని ఐసీఐసీఐ బ్యాంకు వద్దకు రాగానే వాహనాన్ని ట్రాప్‌ చేసి ఆపి మామ, కోడలును తీవ్రంగా కొట్టారు. ఇదంతా తతంగం అరగంట సేపు జరిగినప్పటికీ ఎవరూ ఆపకపోవడంతో ఇరువైపులా ట్రాఫిక్‌ జామయింది. అనంతరం ఇరువర్గాలు స్థానిక స్టేషన్‌కు చేరుకుని ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ ఘటన జరుగుతున్న క్రమంలో ఎంత పోలీసులైనా మాత్రం నడిరోడ్డుపై ప్రజలకు రౌడీలుగా కొడుతారా అని.. ఇదేనా ప్రెండ్లీ పోలీసింగ్‌ అంటే అంటూ పలువురు బహిరంగానే విమర్శిస్తున్నారు. దీనిపై స్థానిక ఎస్సై నవీన్‌కుమార్‌ను వివరణ కోరగా విచారణ చేపడుతున్నామన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top