రెక్కలు తొడిగి రివ్వున ఎగిరి..

Woman Pilot Shomanur Special Interview - Sakshi

పైలట్‌గా రాణిస్తున్న షోమాసూర్‌ 

17 ఏళ్లుగా సేవలు  

నృత్యంలోనూ ప్రతిభ

అండగా నిలిచిన అమ్మ... సాధించిన కూతురు  

ఆమె కలల ప్రపంచాన్ని జయించింది.. వినువీధిలోవిహరించింది.. రెక్కలు తొడిగి.. రివ్వున ఎగిరింది.. గ‘ఘన’ విజయం లిఖించింది.. ఆమే నగరానికి చెందిన మొట్టమొదటి పైలట్‌ షోమాసూర్‌. 2001లో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌లో కోపైలట్‌గా ప్రస్థానం ప్రారంభించి పైలట్‌గా ఎదిగింది. పైలట్‌గా 17 ఏళ్లుగా సేవలందిస్తున్న షోమాసూర్‌.. గొప్ప నృత్యకారిణి కూడా. భరతనాట్యంలో జాతీయ స్థాయిలో గోల్డ్‌ మెడల్‌ అందుకుంది. ‘ఇది అమ్మ నాకిచ్చిన బహుమతి. అనునిత్యం ఆమె నాకు అండగా నిలిచింది. ఎంతో ప్రోత్సహించింది. నేనీ స్థాయిలో ఉండడానికి కారణం మా అమ్మే’ అని చెబుతున్న షోమాసూర్‌ ప్రస్థానం ఆమె మాటల్లోనే... 

సాక్షి, సిటీబ్యూరో  :మా స్వస్థలం పశ్చిమబెంగాల్‌. మా కుటుంబం చాలా ఏళ్ల క్రితమే హైదరాబాద్‌లో స్థిరపడింది. నేను ఇక్కడే పుట్టిపెరిగాను. నాన్న దిలీప్‌కుమార్‌సూర్‌. ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌క్రాఫ్ట్‌గా పని చేశారు. అమ్మ చందనాసూర్‌ గృహిణి. అన్నయ్య డాక్టర్‌ రాజన్‌సూర్‌ టొరంటోలో కేన్సర్‌ వైద్య నిపుణుడు. చదువంతా సిటీలోనే సాగింది. ఉస్మానియా వర్సిటీలో బీఈ పూర్తి చేశాను. ఆ సమయంలోనే పైలట్‌ కావాలనే నా ఆశయాన్ని అమ్మానాన్నల ముందుంచాను. నాన్నయితే ఎట్టిపరిస్థితుల్లోనూ వద్దన్నారు. ‘నువ్వు అమ్మాయివి కదా.. చాలా కష్టాలు ఉంటాయి. వద్దులే’ అన్నారు. ఆయన ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజినీర్‌ కదా.. ఆ రంగంలో ఉండే ఇబ్బందులు ఆయనకు తెలుసు. అందుకే ఆ మాటన్నారు. కానీ అది నా కల.

నా కలలకు ఊపిరిలూది నన్ను పైలట్‌గా నిలబెట్టిన ఘనత మాత్రం మా అమ్మదే. అమ్మ పట్టుదలతో నన్ను పైచదువులకు ప్రోత్సహించారు. శిక్షణనిప్పించారు. అమ్మ ప్రోద్బలంతో నాన్న దిగిరాక తప్పలేదు. బేగంపేట్‌లోని ఏపీ ఫ్లైయింగ్‌ క్లబ్‌లో ప్రాథమిక శిక్షణ తీసుకున్నాను. ఆ తర్వాత జర్మనీలో శిక్షణ పొందాను. 2001 జనవరి 8న నా కల సాకారమైంది. ఎయిర్‌ ఇండియా (ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌) ‘ఎయిర్‌బస్‌–320’లో ఎయిర్‌ కమాండర్‌ ట్రైనింగ్‌ కెప్టెన్‌తో పాటు కో–పైలట్‌గా విధుల్లో చేరాను. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే పూర్తిస్థాయి పైలట్‌ (ఎయిర్‌కమాండర్‌)గా బాధ్యతలు చేపట్టాను. 2016 వరకు ఎయిర్‌బస్‌–320పైలట్‌గా పని చేశాను. ప్రస్తుతం ఎయిర్‌ ఇండియాకే చెందిన డ్రీమ్‌లైనర్‌ ‘బోయింగ్‌–787’ పైలట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను.  

ప్రయాణం... ఓ సాహసం  
లండన్, ప్యారిస్, రోమ్, కోపెన్‌హెగన్, సింగపూర్, బ్యాంకాక్, జపాన్, ఆస్ట్రేలియా... ఇలా విధి నిర్వహణలో భాగంగా ప్రపంచంలోని చాలా నగరాలు చుట్టేశాను. పైలట్‌ జీవితం ప్రతిక్షణం సాహసమే.. ప్రకృతితో  నిరంతర పోరాటమే. టేకాఫ్‌ అయ్యేటప్పుడు ఉన్న వాతావరణం ల్యాండ్‌ అయ్యేటప్పుడు ఉండదు. ఏ దేశంలో ఎలాంటి వాతావరణం ఉంటుందో తెలియదు. ఇండియా నుంచి బయలుదేరే సమయంలో చాలా ఆహ్లాదంగా ఉంటుంది. కానీ గమ్యస్థానానికి చేరే సమయానికి దట్టమైన పొగమంచు ఉండొచ్చు. జోరుగా వర్షం పడొచ్చు. అప్పుడు ఏమీ కనిపించదు. ల్యాండింగ్‌ కష్టమవుతుంది. వందలాది ప్రయాణికులతో వేల కిలోమీటర్లు సాగిన ప్రయాణం ఒక ఎత్తైతే.. విమానం ల్యాండింగ్‌ ఒక ఎత్తు. అందుకే ప్రతి క్షణం చాలెంజింగ్‌గా ఉంటుంది. సాంకేతిక అంశాల్లోనూ శిక్షణ ఉంటుంది. అకస్మాత్తుగా సమస్యలు తలెత్తినప్పుడు సరిదిద్దుకొనే పరిజ్ఞానం తప్పనిసరి. ఒకసారి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నాను. ఇంజిన్‌లో సమస్య తలెత్తింది. అప్పటికప్పుడు  మరమ్మతులు చేసుకొని తిరిగి ఢిల్లీకి వెళ్లాను. బహుశా ఆ సమయంలో 150 మందికి పైగా ప్రయాణికులు ఉండొచ్చు.  

విభిన్న జీవనం...   
పైలట్‌ జీవనశైలి చాలా భిన్నంగా ఉంటుంది. వారానికి కనీసం 35 గంటల డ్యూటీ ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ, అక్కడి నుంచి లండన్, తిరిగి దుబాయ్‌ లేదా బ్యాంకాక్‌... ఇలా ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లాల్సి రావొచ్చు. దీంతో భిన్నమైన జీవనశైలి తప్పదు. లండన్‌లో ఉదయం 8:30 గంటలకు బ్రేక్‌ఫాస్ట్‌ టైమ్‌. కానీ మనకు అది మధ్యాహ్నం ఒకటిన్నర లంచ్‌ టైమ్‌. రాత్రి 11గంటలకు హైదరాబాద్‌లో ఇంటి నుంచి బయలుదేరి  2గంటలకు ఢిల్లీకి చేరుకుంటాను. అక్కడి నుంచి ఏ ప్యారిస్‌కో వెళ్లాలి. అప్పుడక్కడ అకస్మాత్తుగా వాతావరణం మారిపోతుంటుంది. అలా నిద్రపోవాల్సిన సమయంలో మెలకువగా.. మెలకువగా ఉండాల్సిన వేళల్లో నిద్రపోవడం తప్పదు. పూర్తిగా ప్రకృతికి భిన్నంగా సాగే పయనమిది. కానీ ఇందులో సంతృప్తి ఉంటుంది. విభిన్న నగరాల సంస్కృతులు, జీవన విధానాలు ప్రతక్యక్షంగా చూడొచ్చు. ఇప్పటివరకు 15వేల గంటలు విధులు నిర్వహించి రికార్డు సృష్టించాను.  

కలలు కనండి...
పైలట్‌గా నన్ను నిలబెట్టడంలోనే కాదు... భరతనాట్యం, పియానోలోనూ అమ్మే శిక్షణనిప్పించారు. నాకు అన్ని విధాల అండగా నిలిచింది నా కుటుంబమే. నా భర్త ఆనంద్‌గుప్తా ప్రోత్సాహం, సహకారం ఎంతో ఉంది. ఇంటి వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటారు. మాకు ఒక అమ్మాయి. కెనడాలో చదువుకుంటోంది. కలలు కనండి. ఆ కలలను సాకారం చేసుకునేందుకు నిరంతరం శ్రమించండి. అమ్మాయిలు అద్భుతాలు సాధించగలరు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top