
నల్గొండ : మిర్యాలగూడ నియోజకవర్గంలో ఆలగడప గ్రామ పంచాయతీ పరిధిలోని సుబ్బారెడ్డిగూడెం పేరు చెబితే ఇద్దరు ఎమ్మెల్యేలు గుర్తుకువస్తారు. మూడు సార్లు కాంగ్రెస్ నుంచి గెలిచి హ్యాట్రిక్ సాధించిన తిప్పన చినకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు తిప్పన విజయసింహారెడ్డి. ఆ గ్రామస్తులకు తెలిసిన జీవితకాలపు ఎమ్మెల్యే ఒకరున్నారు. ఆమే.. ఎమ్మెల్యే. అవునండీ ఆమె పేరే ఎమ్మెల్యే.. 1978 అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడ నుంచి సీపీఎం అభ్యర్థి అరిబండి లక్ష్మీనారాయణ గెలుపొందారు. లక్ష్మయ్యకు అరిబండిపై ఉన్న అభిమానంతో తన కుమార్తెకు ‘ఎమ్మెల్యే’ అని పేరు పెట్టాడు. స్కూలు రికార్డుల్లోనూ ఎమ్మెల్యేగానే రాశారు. రేషన్‌కార్డులోనూ ఆమె పేరు ‘ఎమ్మెల్యే’ అని ఉంది. తల్లిదండ్రులు పెట్టిన పేరుతో జీవితకాలపు ఎమ్మెల్యే అయింది.
ఓటరు పేరు హహహ.. తండ్రి పేరు కబబబ
ఉలవపాడు (ప్రకాశం) : ఓటర్ల జాబితాలో చిత్రాలు బయటపడుతున్నాయి. ప్రకాశం జిల్లా ఉలవపాడు బూత్ నంబర్ 247 పరిధిలో ఎపిక్ నంబర్ వైడీఆర్ 102370తో ఓ ఓటు ఉంది. ఈ ఓటరు పేరు హహహ దదద కాగా, తండ్రిపేరు కబబబ అని ఉంది. ఇంటి నబరు 23–23 అని ఉంది. ఈ గ్రామంలో కేవలం 16 వార్డులే ఉన్నాయి. ఇంటి నంబరు 23–23 ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. ఈ ఎపిక్ నంబర్‌ను ఆన్‌లైన్‌లో పరిశీలిస్తే ఆంగ్లంలో సుదర్శి కోటేశ్వరరావు తండ్రి నరశింహ అని రాగా, తెలుగులో హహహ దదద అని వస్తోంది.