ప్రేమించాలంటూ కానిస్టేబుల్ వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ధర్మన్నగూడలో సోమవారం చోటుచేసుకుంది.
యువతి ఆత్మహత్య
యాచారం: ప్రేమించాలంటూ కానిస్టేబుల్ వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ధర్మన్నగూడలో సోమవారం చోటుచేసుకుంది. సీఐ చంద్రకుమార్, కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సోమా నర్సింహ నగరంలోని అంబర్‌పేటలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతనికి ఇద్దరు పిల్లలున్నారు. అదే గ్రామానికి చెందిన మండల శ్యామల (23)ను ప్రేమించమంటూ నాలుగేళ్ల క్రితం వెంటపడ్డాడు.
అతని వేధింపులు భరించలేక అప్పట్లోనే ఆ యువతి తల్లిదండ్రులకు చెప్పడంతో నర్సింహను మందలించి వదిలిపెట్టారు. బుద్ధిమారని ఆ కానిస్టేబుల్ తిరిగి ఫోన్‌లో శ్యామలను వేధింపులకు గురిచేస్తున్నాడు. సోమవారం ఉదయం శ్యామలకు ఫోన్ చేశాడు. అతను ఏదో మాట్లాడగానే ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. తీవ్రంగా శరీరం కాలిపోవడంతో గాంధీ అస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. తన కూతురు శ్యామల ఆత్మహత్యకు సోమా నర్సింహనే కారకుడని మృతురాలి తండ్రి నర్సింహ పోలీసులకు ఫిర్యాదు చేశారు.