మామతో సంబంధం: కోడలు ఆత్మహత్య
కన్నకూతురితో సమానంగా చూసుకోవాల్సిన కోడలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడో మామ.
ఖమ్మం: కన్నకూతురితో సమానంగా చూసుకోవాల్సిన కోడలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడో మామ. ఆ విషయం ఇంట్లో తెలియడంతో ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. బోనకల్లు మండలం ఎర్రవోడుకు చెందిన బానోతు వీరన్న(40) తన కోడలు అనిత(25)తో సంబంధం పెట్టుకున్నాడు. రెండు నెలల క్రితం ఇద్దరూ ఇంట్లో ఉన్న రూ. 2 లక్షల నగదు, బంగారం తీసుకుని ఎవ్వరికి తెలియకుండా చెన్నై వెళ్లిపోయారు.
దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. అయితే మామకోడలు తిరిగి శుక్రవారం ఖమ్మం వచ్చారు. వారి కోసం పోలీసులు వెతుకుతుండటం, కుటుంబంలో గొడవలతో ఇంటికి వెళితే పట్టుబడతామనే ఆందోళనతో రఘునాథపాలెం మండలం మంచుగొండకు వెళ్లారు.
అక్కడ ఇద్దరూ ఎలుకల మందు తాగి చేతులు గాయపరుచుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికులు గుర్తించి వారిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోడలు గుగులోతు అనిత శనివారం మృతిచెందింది. మామ చికిత్స పొందుతున్నాడు.