ఉద్యోగులు ఎటువైపో.!

Where Employes Stand - Sakshi

రేపటితో ‘పోస్టల్‌’ దరఖాస్తుకు ఆఖరు

జిల్లాలో 7250 మంది ఉద్యోగులు

ఇప్పటి వరకు 3,025 దరఖాస్తులు

ఈవర్గం ఓట్లపై అభ్యర్థుల చూపు

మేనిఫెస్టోలో తాయిలాలు ప్రకటిస్తున్న పార్టీలు  

ఆదిలాబాద్‌అర్బన్‌: రానున్న ఎన్నికల్లో ఉద్యోగుల ఓట్లపై పోటీలో ఉన్న అభ్యర్థులు దృష్టి సారించారు. పోలింగ్‌ గడువు సమీపిస్తుండడంతో ప్రచారంలో హడావిడిగా గడుపుతున్న అభ్యర్థులు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లపై ఓ కన్నేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల దరఖాస్తుకు రేపటి వరకు మాత్రమే గడువు ఉండడంతో అభ్యర్థులు ఉద్యోగులను కూడా తమ దారికి తెచ్చుకునేందుకు వారి చుట్టూ ప్రదక్షిణలు మొదలెట్టారు. మరోవైపు వందశాతం పోలింగ్‌ లక్ష్యంగా చర్యలు చేపడుతున్న ఎన్నికల కమిషన్‌ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ప్రతి ఉద్యోగి తప్పక ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచిస్తుంది. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసింది. కాగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు సైతం గెలుపును ప్రభావితం చేసేలా కనిపిస్తున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు వారిని అనుకూలంగా మలుచుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధాన పార్టీలు తమ మేనిఫెస్టోలో ఉద్యోగులకు అనుకూలంగా ఉండే తాయిలాలను ప్రకటిస్తూ మచ్చిక చేసుకునే పనిలో ఉన్నాయి.

7,250 మంది ఉద్యోగులు.. 
జిల్లాలోని 18 మండలాల్లో దాదాపు 7,250 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ఎక్కువగా రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, ఎన్జీవోలు, ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారు. అయితే వీరంతా ఖజానా శాఖ పరిధిలో వేతనాలు పొందేవారే. వీరు కాకుండా ఆర్టీసీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైన బీఎస్‌ఎన్‌ఎల్, పోస్టల్, సింగరేణి ఉద్యోగులు కూడా ఉన్నారు. వీరందరికీ జిల్లా ఎన్నికల అధికారులు పోలింగ్‌ బాధ్యతలను అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ‘కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం’ (సీపీఎస్‌) రద్దు చేయాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు గతకొంత కాలంగా పోరాటాలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి అనుకూలంగా తమవంతు సహకారం చేస్తామని ప్రధాన పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. అలాగే పీఆర్సీ, మధ్యంతర భృతిపై కూడా ఉద్యోగులు ఆశతో ఉన్నారు. దీంతో పాటు ఉద్యోగ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచాలని కొంత కాలంగా డిమాండ్‌ వినిపిస్తోంది. తమ డిమాండ్లకు అనుకూలంగా ప్రధాన పార్టీలు మేనిఫెస్టోలో ప్రకటించాలని సంఘ నాయకులు డిమాండ్‌ చేస్తూ వచ్చారు. అన్ని పార్టీల నాయకులు సీపీఎస్‌ విషయమై సానుకూలంగా స్పందిస్తామని సంకేతాలు ఇవ్వడంతో అసలు ఉద్యోగులు ఏ పార్టీని నమ్మి ఓట్లు వేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. తమ డిమాండ్లను పరిష్కారించే విధంగా ఏ పార్టీ మేనిఫెస్టో ఉంటుందో వారి వైపే ఉద్యోగులు ఆకర్షితులయ్యే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
 
రేపటితో గడువు పూర్తి.. 
ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం ఈనెల 30 వరకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించారు. ఈ నెలాఖరులోగా దరఖాస్తులు సమర్పిస్తే సమయానికి వారి చేతికి పత్రాలు అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలోని రెండు నియోజకవర్గాలకు కలిపి పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం 3,025 మంది సిబ్బంది దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. ఒక నియోజకవర్గంలోని సిబ్బంది అదే అసెంబ్లీ పరిధిలో పోలింగ్‌ విధులు నిర్వర్తిస్తే పోస్టల్‌ బ్యాలెట్‌ అప్పుడే ఇస్తామని, ఇతర నియోజకవర్గంలో పోలింగ్‌ బాధ్యతలు ఉంటే పోస్ట్‌ ద్వారా లేదా ఆర్వోకు డ్యూటీ ఆర్డర్‌ కాపీతో పాటు పోస్టల్‌ బ్యాలెట్‌ను పంపిస్తామని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఇందుకు ఎన్నికల సిబ్బంది డ్యూటీ ఆర్డర్లను కూడా సిద్ధం చేస్తున్నారు. పోలింగ్‌ విధుల్లో పాల్గొనే సిబ్బంది ఈ నెలాఖరులోగా పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోకుంటే ఓటు వినియోగించుకోవడం కష్టంగా ఉంటుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.
 
అభ్యర్థుల ఆశలు.. 
గత ఎన్నికల పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే.. ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉంటున్నందున ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పోలీస్‌ సిబ్బంది ఓటు హక్కు వినియోగానికి అవకాశం దొరకడం లేదని సమాచారం. ఓటు వినియోగించుకున్న సిబ్బంది సైతం పోస్టల్‌ బ్యాలెట్‌పై అనుమానాస్పదంగా మార్క్‌ చేయడంతో కొన్ని ఓట్లు చెల్లకుండా పోతున్నాయి. అయితే ఎన్నికల కమిషన్‌ పోలింగ్‌ శాతం పెంపుపై దృష్టి సారించింది. దీనిపై కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ ప్రత్యేక చొరవ తీసుకుని ఓటు ఆవశ్యకత గురించి ఉద్యోగులకు, సిబ్బందికి వివరిస్తున్నారు. దీంతో ఈసారి ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లే అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే శక్తిగా మారే అవకాశం లేకపోలేదు. అందుకే రాజకీయ పార్టీలు ఉద్యోగుల డిమాండ్లకు సానుకూలంగా స్పందిస్తూ వారిని మచ్చిక చేసుకునే పనిలో ఉంటున్నట్లు తెలుస్తోంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top