గోదాంలకు స్థలం కొరత 

Warehouseman To Land Shortage Problems Rangareddy - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా:  స్థలం కొరత గోదాంల నిర్మాణానికి అడ్డంకిగా మారింది. జిల్లా, మహానగర అవసరాల మేరకు గిడ్డంకులు నిర్మించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినా నిర్దేశిత ప్రాంతాల్లో భూమి లభించడం లేదు.   మహానగర శివార్లలోని మండల కేంద్రాల్లో గిడ్డంకులు నిర్మించేందుకు రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ ఇటీవల జిల్లా యంత్రాంగాన్ని ప్రతిపాదనలు అడిగింది. దీంతో ఆయా మండలాల్లో జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారులు రెవెన్యూ అధికారుల సహకారంతో క్షేత్రస్థాయిలో పర్యటించి స్థల లభ్యత వివరాలు సేకరించారు. ఒక్కో గోదాం నిర్మాణానికి కనీసం ఐదెకరాల భూమి అవసరం. అలాగే గోదాంల వద్దకు వాహనాలు రాకపోకలు జరిపేందుకు వీలుగా రోడ్డు మార్గం అనువుగా ఉండాలి. ఇటువంటి అనుకూలత కోసం రోజుల తరబడి జల్లెడబట్టినా పూర్తిస్థాయిలో స్థలాలు 
లభించలేదు. ఐదు మండల కేంద్రాల్లో స్థల లభ్యత ఉండగా.. మిగిలిన ఆరు మండలాల్లో కొరత ఉంది.

ఐదు చోట్ల భూమి గుర్తింపు..
జిల్లా మార్కెటింగ్‌ శాఖ పరిధిలో మొత్తం 75,600 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల  28 గిడ్డంకులు ఉన్నాయి. జిల్లా, మహానగర జనాభా అవసరాలకు ఇవి ఏమాత్రం సరిపోవడం లేదు. జనాభాకు సరిపడ వ్యవసాయ ఉత్పత్తులు, నిత్యావసర సరుకులు నిల్వ చేసేందుకు భారీ సామర్థ్యం గల గిడ్డంకులు అవసరం. వీటి నిర్మాణానికి నగరంలో స్థలం కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో జిల్లా పరిసర ప్రాంతాల్లోని మండల కేంద్రాల్లో నిర్మించాలని భావించారు. ఈ క్రమంలో నాబార్డు నిధులతో జిల్లాలో 11 గోదాంలు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపించాలని మార్కెటింగ్‌ శాఖ జిల్లా యంత్రాంగాన్ని కోరింది. ఒక్కో గోదాం సామర్థ్యం 5వేల మెట్రిక్‌ టన్నులు. ఒక్కో గిడ్డంగి నిర్మాణానికి ఐదెకరాల స్థలం అవసరం.

వీటి కోసం అన్వేషించగా అబ్దుల్లాపూర్‌మెట్, నందిగామ, శంషాబాద్, కడ్తాల్, చౌదరిగూడలో మాత్రమే స్థలం అందుబాటులో ఉన్నట్లు తేలింది. ఈ మేరకు జిల్లా మార్కెటింగ్‌ శాఖ నివేదిక జిల్లా కలెక్టర్‌కు పంపించింది. సాధ్యాసాధ్యాలపై ఇంజనీరింగ్‌ విభాగం రిపోర్ట్‌ని నాబార్డ్‌కు అందజేసింది. గోదాం పరిసర ప్రాంతాల్లో సాగు విస్తీర్ణం? ఏయే పంటలు అధికంగా సాగవుతున్నాయి? దిగుబడి అంచనా? ఎంతమంది రైతులకు మేలు చేకూరుతుంది? తదితర అంశాలపై మరోసారి నాబార్డ్‌ ప్రతినిధులు అధ్యయనం చేయనున్నారు. వాళ్లు సానుకూలత వ్యక్తం చేస్తే జిల్లా కలెక్టర్‌ భూమి కేటాయించనున్నారు. తద్వారా ఈ ఐదు గిడ్డంగులు జిల్లాకు మంజూరై నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశం ఉంది.

ఆ ఆరు వెనక్కి..! 
మహానగర శివారు ప్రాంతాల్లో గిడ్డంగుల నిర్మాణానికి స్థల లేమి అడ్డంకిగా మారింది. గండిపేట, బాలాపూర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, మాడ్గుల, షాద్‌నగర్‌ ప్రాంతాల్లో స్థల కొరత ఉంది. దీంతో గిడ్డంగుల నిర్మాణం ఇక్కడ సాధ్యం కాదన్న అభిప్రాయానికి మార్కెటింగ్‌ శాఖ వచ్చింది. ఫలితంగా ఆ ఆరు గిడ్డంగులు జిల్లా నుంచి చేజారిపోయినట్లే. వాటిని ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే అవకాశం ఉందని జిల్లా మార్కెటింగ్‌ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఛాయాదేవి తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top