వర్ధన్నపేటను ‘వరించని’ మంత్రి పదవి

Warangal Constituencies Information  - Sakshi

అటు రెండు.. ఇటు రెండు మండలాలు

జనరల్‌ నుంచి 2009లో ఎస్సీ నియోజకవర్గంగా రూపాంతరం

రాజకీయంగా పర్వతగిరికి ప్రత్యేక స్థానం  

ప్రముఖులకు పుట్టినిల్లు  

సాక్షి, హసన్‌పర్తి: వరంగల్‌నగరం వర్ధన్నపేట నియోజకవర్గాన్ని  విడదీస్తుంది. నాలుగు మండలాలతో విస్తీరించిన నియోజకవర్గంలో  రెండు మండలాలు పూర్తిగా నగరానికి ఓవైపు..మరో రెండు మండలాలు మరోవైపు ఉన్నాయి. హన్మకొండ, హసన్‌పర్తికి చెందిన ప్రజలు వర్ధన్నపేటకు వెళ్లాలంటే.. వరంగల్‌ పశ్చిమ, వరంగల్‌తూర్పు నియోజకవర్గాలను దాటాల్సిందే.

1952లో వర్ధన్నపేట నియోజకవర్గం ఏర్పడింది. జనరల్‌గా ఉన్న ఈ నియోజకవర్గాన్ని 2009లో పునర్విభజన సందర్భంగా ఎస్సీకి రిజర్వ్‌ చేశారు. ఈ నియోజక వర్గంపై తొలిసారిగా పీడీఎఫ్‌ జెండా ఎగిరింది. పెండ్యాల రాఘువరావు ఈ నియోజక వర్గం నుంచి తొలి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రిజర్వ్‌ తర్వాత కాంగ్రెస్‌ అభ్యర్థి కొండేటి శ్రీధర్‌ విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు 14 సార్లు సాధారణ ఎన్నికలు జరగగా ఒకసారి మాత్రం ఉప ఎన్నికల అనివార్యమయ్యాయి. ఈ స్థానం నుంచి కాంగ్రెస్, టీడీపీలు చెరో మూడుసార్లు విజయం సాధించాయి. జనతాపార్టీ, ఇండిపెండెంట్లు, బీజేపీ  రెండుసార్లు, టీఆర్‌ఎస్‌ ఒక్కసారి వర్ధన్నపేటపై జెండాను ఎగురవేశారు.

వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఒక్కరికి కూడా మంత్రి పదవి దక్కలేదు. ఈ స్థానం నుంచి ఎర్రబెల్లి దయాకర్‌రావు మూడుసార్లు గెలుపొందారు. మాజీ మంత్రి పురుషోత్తంరావు, మాచర్ల జగన్నాధం రెండుసార్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. పురుష్తోతంరావు ఒక సారి ఎస్‌టీపీఎస్, మరోసారి స్వతంత్య్ర అభ్యర్థిగా గెలుపొందారు. మాచర్ల జగన్నాథం ఒకసారి జనతాపార్టీ, మరోసారి కాంగ్రెస్‌ పార్టీనుంచి విజయం సాధించారు. టి.రాజేశ్వర్‌రావు, వన్నాల శ్రీరాములు బీజేపీ తరఫున గెలుపొందారు. వర్ధన్నపేటపై పీడీఎఫ్‌ అభ్యర్థులు పెండ్యాల రాఘవరావు, ఏ.ఎల్‌.ఎన్‌.రెడ్డి వరుసగా గెలుపొందారు. కె. లక్ష్మీనర్సింహారెడ్డి ఇండిపెండెంట్‌గా గెలుపొందారు. 1957లో జరిగిన ఉప ఎన్నికలో ఎర్రబెల్లి వెంకట రామనర్సయ్య విజయం సాధించారు. ఈ నియోజకవర్గాన్ని కావాలనే పునర్విభజనలో ఎస్సీకి కేటాయించినట్లు పుకార్లు జరిగాయి

పక్క ప్రాంతాల్లో పోటీ చేస్తేనే పదవులు..
వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి పోటీచేసిన  ఏ నాయకుడికీ  ఇప్పటి వరకు పదవులు దక్కలేదు. ఇక్కడ నుంచి పోటీ చేసిన పురుషోత్తంరావు తర్వాత వరంగల్‌నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి బాధ్యతలు చేపట్టారు. తక్కళ్లపల్లి  రాజేశ్వర్‌రావు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా పనిచేసి ఆ తర్వాత నగర మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఎర్రబెల్లి స్వర్ణ సైతం ఎమ్మెల్యేగా ఓటమి పొంది... నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. టీడీపీ నుంచి 1994, 1999లో రెండు సార్లు టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ దయాకర్‌రావుకు మంత్రి పదవి దక్కలేదు.  కడియం శ్రీహరి ఈ ప్రాంతానికి చెందిన వారైనా పక్క నియోజకవర్గానికి వెళ్లి గెలుపొంది మంత్రి పదవి చేపట్టారు.   

పునర్విభజన పరిణామం..
పునర్విభజనకు ముందు వర్ధన్నపేట నియోజకవర్గంలో వర్ధన్నపేట, పర్వతగిరి, సంగెం, రాయపర్తి మండలాలు ఉన్నాయి.  జనరల్‌గా ఉన్నప్పుడు ఈ స్థానం టీడీపీ కం చుకోటగా ఉండేది. ఈ నియోజకవర్గాన్ని పునర్విభజనలో ఎస్సీకి రిజర్వ్‌చేశారు. జనరల్‌గా ఉన్న  వర్ధన్నపేటను మూడు ముక్కలుగా విభజించారు. ఈ నియోజకవర్గం లో ఉన్న రాయపర్తిని పాలకుర్తిలో, సంగెంను పరకాల నియో జకవర్గంలో విలీనంచేశారు. హన్మకొండ నియోజకవర్గంలో ఉన్న హసన్‌పర్తి, హన్మకొండ రూరల్‌ మండలాలను వర్ధన్నపేటలో విలీనం చేశారు. దీంతో వర్ధన్నపేట, పర్వతగిరి, హన్మకొండ రూరల్, హసన్‌పర్తి మండలాలతో వర్ధన్నపేట నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. కొత్తగా ఏర్పడిన వర్ధన్నపేట నియోజకవర్గంపై కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన కొండేటి శ్రీధర్‌ విజయం సాధించారు.  

రాజకీయంగా పర్వతగిరికి ప్రత్యేక స్థానం ... 
రాజకీయంగా పరిశీలిస్తే వర్ధన్నపేట నియోజకవర్గంలోని పర్వతగిరికి ప్రత్యేకస్థానం ఉంది. ఈ మండలానికి చెందిన నాయకులు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులతో పాటు ఇతర రాష్ట్రస్థాయి పదవులు అలంకరించారు. టీడీపీ నుంచి స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మంత్రిగా పనిచేసిన కడియం శ్రీహరి పర్వతగిరికి చెందినవారు. ఇదే మండలం కొంకపాకకు చెందిన పురుషోత్తంరావు కాంగ్రెస్‌ తరఫున వరంగల్‌ నుంచి పోటీచేసి గెలుపొంది మంత్రి పదవి చేపట్టారు. దీంతో పాటు మారుమూల ప్రాంతాల అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. పాలకుర్తి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్వతగిరికి చెందినవారు. ఎంపీ వినోద్‌కుమార్‌ స్వస్థలం పర్వతగిరి మండలం ఏనుగల్లు.

అరూరికి భారీ మెజార్టీ..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అరూరి రమేష్‌ పోటీచేశారు. సుమారు 87వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించి, రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీలో రెండోస్థానంలో నిలిచారు. 

ఇద్దరు మేయర్లుగా వర్ధన్నపేట వాసులే...
నగర మేయర్‌లుగా పనిచేసిన ఇద్దరు ప్రముఖులు వర్దన్నపేట వాసులే. ఇద్దరు కూడా సమీప బంధువులే. ఇందులో ఒకరు తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు కాగా, మరొకరు ఎర్రబెల్లి స్వర్ణ. తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు బీజేపీనుంచి మేయర్‌గా ఎన్నిక కాగా, ఎర్రబెల్లి స్వర్ణ కాంగ్రెస్‌ నుంచి మేయర్‌ పదవి చేపట్టారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పొన్నేలుకు చెందిన వారు. బీజేపీ జాతీయ నాయకుడు పేరాల చంద్రశేఖర్‌రావు ల్యాబర్తికి చెందిన వారు. తెలుగుదేశం హయాంలో రోడ్ల భవనాల శాఖ మంత్రిగా పనిచేసిన  సంగంరెడ్డి సత్యనారాయణ (ముచ్చర్ల సత్యనారాయణ)çస్వస్థలం హసన్‌పర్తి మండలం ముచ్చర్ల గ్రామం. సత్యనారాయణ మాత్రం వరంగల్‌పశ్చిమ (పాత హన్మకొండ)నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు.
 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top