పసుపు రైతు పరేషాన్‌

turmeric farmers are trouble due to lack of support price - Sakshi

ధర ఢమాల్

వారంలో రూ.వెయ్యి తగ్గుముఖం

ఆందోళనలో రైతన్నలు

పసుపు రైతుకు పరేషాన్‌ మొదలైంది. రోజురోజుకి పసుపు ధర పతనమవుతుండడం రైతులను కలవరపెడుతోంది. వారం వ్యవధిలో రూ.వెయ్యికి పైగా రేటు పడిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఎంతో ఆశతో మార్కెట్‌కు వెళ్లిన రైతులకు నిరాశే మిగులుతోంది. పది రోజుల క్రితం పసుపు క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7500 నుంచి రూ.8 వేల ధర పలకగా, ప్రస్తుతం రూ.6,200 నుంచి రూ.6,500 దాటడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర పతనానికి దళారులే కారణమని, మార్కెట్‌కు పంట ఉత్పత్తులు పోటెత్తడంతో రేటు తెగ్గోస్తున్నారని పేర్కొంటున్నారు. మంచిగా ఆరబెట్టిన నాణ్యమైన సరుకుకు కూడా రూ.6,500 మించి చెల్లించడం లేదని వాపోతున్నారు.
 

బాల్కొండ: జిల్లాలో 33 వేల ఎకరాల్లో పసుపు పంటను సాగవుతోంది. ఇప్పటివరకు సుమారు 50 శాతం పంట తవ్వకాలు పూర్తి కాగా, 30 శాతం పసుపును ఉడికించి మార్కెట్‌కు తరలించారు. పంట రాక ప్రారంభమైన సమయంలో మంచి ధరే పలికింది. రూ.8 వేల వరకు రావడం తో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఈ సంవత్సరమైనా గిట్టుబాటు ధర వస్తుంద ని అంతా భావించారు. అయితే, ప్రస్తుతం మార్కెట్‌కు పసుపు పోటెత్తుతుండడంతో ధర ఢమాలవుతోంది. సరుకు ఎక్కువగా వస్తుండడంతో దళారులు ధర తగ్గిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పలుకుతున్న రూ.6,200 ధర ఏమాత్రం గిట్టుబాటు కాదని వాపోతున్నారు. ఎకరానికి రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు పెట్టుబడి పెట్టి పంట సాగు చేశామని, ప్రస్తుత ధరతో కనీసం పెట్టుబడి కూడా రాదని పేర్కొంటున్నారు. ఇక, ‘ఈ–నామ్‌’లో కూడా పెద్దగా ధర రావడం లేదని చెబుతున్నారు.

దిగుబడి బాగున్నా..
ఖరీఫ్‌లో కురిసిన అకాల వర్షాల వల్ల పసుపు పంట దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందారు. అయితే, కొందరికి ఎకరానికి 8–9 ట్రాక్టర్ల కొమ్మ వస్తోంది. పంట దిగుబడి బాగానే వస్తుందని ఓ వైపు సంతోషంగా ఉన్నా, సరైన ధర దక్కక పోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. పెట్టుబడి కూడా తిరిగి పరిస్థితుల్లో పసుపు పంటకు బదులు ఇతర పంటలు సాగు చేసినా మేలుండేదని వాపోతున్నారు. అధిక పెట్టుబడి, దీర్ఘ కాలిక పంట కావడంతో రైతులు ఎక్కువగా కష్టపడాల్సి వస్తోంది. అయినప్పటికీ సరైన ఫలితం దక్కడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు.

మార్కెట్‌లో పడిగాపులు..
పసుపు విక్రయించేందుకు రైతులు మార్కెట్‌లో పడిగాపులు కాయాల్సి వస్తోంది. గతంలో పసుపు పంటను విక్రయించాలంటే రెండు రోజుల సమయం పట్టేది. ఒక రోజు బీటు, మరో రోజు కాంటాలు నిర్వహించే వారు. అయితే, గత  నాలుగేళ్లుగా ఒక్క రోజులోనే బీటు, కాంటాలు నిర్వహిస్తున్నారు. దీంతో రైతులకు ఒకటే రోజులో పంట విక్రయాలు పూర్తయ్యేవి. కానీ ఈ సంవత్సరం మళ్లీ మొదటికొచ్చింది. కాంటాలు నిర్వహించడం ఆలస్యమవుతుండడం, పంట కొనుగోళ్లు సరిగా లేకపోవడంతో రైతులు 2–3 రోజులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు ఎన్ని నిబంధనలు పెట్టినా దళారుల హవానే కొనసాగుతోంది.

ధరను తగ్గించారు..
వారం రోజుల క్రితం పలికిన ధర ఇప్పుడు లేదు. మార్కెట్‌లోకి ఎక్కువ కొమ్ము వస్తుండటంతో ధరను తగ్గిస్తున్నారు. ఈ రేటుకు అమ్ముకుంటే నష్టాలే మిగిలేది. దీని కన్నా పసుపు పంట పండించడం మానుకోవడమే మంచిది.  – నర్సయ్య, రైతు, నాగంపేట్‌

పడిగాపులు..
పంట అమ్మేందుకు మార్కెట్‌కు వెళ్తే ఆడ పొద్దంతా పడిగాపులు కాయల్సి వస్తుంది. ధర కూడా వారానికి, ఇప్పటికి రూ.వెయ్యి తగ్గించారు. ఇలా ధర తగ్గిస్తే పెట్టిన పెట్టుబడి రాక అప్పులే మిగులుతాయి. ప్రభుత్వం స్పందించి పసుపు ధర పతనం కాకుండా చూడాలి. – జైడి సంతోష్‌రెడ్డి, రైతు, కొత్తపల్లి

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top