బస్సు దారెటు?

TSRTC Strike: Despite KCR Deadline Employees Continue Strike - Sakshi

విధుల్లో చేరాలన్న సీఎం కేసీఆర్‌ మూడో పిలుపు బేఖాతరు

5వ తేదీ అర్ధరాత్రి వరకు చేరింది 495 మంది కార్మికులు మాత్రమే

 చర్చలకు సర్కార్‌ ససేమిరా... 

ఆర్టీసీ రూట్లలో ప్రైవేట్‌ బస్సులకు పర్మిట్ల జారీపై ముందుకు..  

ఇప్పుడు ఆర్టీసీకి అందుబాటులో ఉంది 1,700 మందే..

నేడు హైకోర్టులో ‘సమ్మె’పై విచారణ 

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ చరిత్రలో ఎన్నడూ జరగని తరహాలో ఇప్పుడు సమ్మె కొనసాగుతోంది. గతంలో చర్చల్లో ప్రతిష్టంభన వల్లనే సమ్మె పొడిగింపు ఉండేది. ఇప్పుడు పరిస్థితి వేరు. చర్చలు కాదు కదా.. అసలు ఆర్టీసీనే ఉండదని ప్రభుత్వం అంటోంది. డిమాండ్లలో వేటిని అంగీకరిస్తారో, వేటిని తిరస్కరిస్తారో తర్వాత, ముందు చర్చలకు పిలవండి అని కార్మిక సంఘాలు పేర్కొనాల్సిన పరిస్థితి. వెరసి అసలు సమ్మె ఎప్పుడు ముగుస్తుందో, తిరిగి పూర్వపు పరిస్థితి ఎప్పుడు కనిపిస్తుందోనని యావత్‌ తెలంగాణ జనం ఎదురు చూస్తున్నారు. సమ్మె వదిలి విధుల్లోకి రండి అంటూ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి చేసిన వినతిని సైతం కార్మికులు తిరస్కరించటంతో పరిస్థితి ఉత్కంఠగా మారింది. ఇదే చివరి అవకాశమని, కార్మికులు విధుల్లోకి రాని పక్షంలో ఇక వారికి సంస్థతో సంబంధాలే ఉండవని తేల్చి చెబుతూ సీఎం ఇచ్చిన గడువును కార్మికులు బేఖాతరు చేయటంతో పరిస్థితి అయోమయంగా మారింది. ఈ నేపథ్యంలో గురువారం హైకోర్టులో మరోసారి వాదనలు జరగబోతున్నాయి. కోర్టు ఏం చెబుతుందోనని జనం ఆసక్తిగా, కార్మికులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం.. ముందే ప్రకటించినట్టుగా ప్రైవేటు బస్సులతో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు చకచకా ఏర్పాట్లు చేసుకుంటూపోతోంది.

‘ప్రైవేటు’కు అనుమతి..
విధుల్లోకి నామమాత్రంగానే కార్మికులు చేరటంతో ఆర్టీసీలోని ప్రధాన మార్గాలన్నింటిలోకి ప్రైవేటు బస్సులను అనుమతించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 5,100 రూట్లలో ప్రైవేట్‌ బస్సులకు పర్మిట్లు ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. మిగ తా రూట్లను ఆర్టీసీకి వదిలేయా లని అప్పట్లో నిర్ణయిం చారు. కానీ ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు కేవలం 1,700 మంది మాత్రమే మిగిలారు. ఐదో తేదీ అర్ధరాత్రి వరకు విధుల్లో చేరిన వారిని మాత్రమే ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణిస్తామని, మిగతా వారికి సంస్థతో సంబంధం ఉండదని గత శనివారం సీఎం స్వయంగా ప్రకటించారు. ఐదో తేదీ అర్ధరాత్రి వరకు కేవలం 495 మంది మాత్రమే విధుల్లో చేరారు.

సమ్మెకు మద్దతివ్వని 1,200 మందితో కలుపుకొంటే ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న వారి సంఖ్య 1,700గా ఉంది. ముఖ్యమంత్రి చెబుతున్నట్టు 5 వేల ఆర్టీసీ బస్సుల(సగం ప్రైవేటు పోను)ను నిర్వహించాలంటే 23 వేల మంది ఉద్యోగులు అవసరమవుతారు. ఇప్పుడు సమ్మెలో ఉన్నవారిని ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణించటం లేదని చెబుతున్నందున, ఇక గత్యంతరం లేక మిగతా రూట్లను కూడా ప్రైవేటు బస్సులతోనే నడిపించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రగతిభవన్‌లో జరిగిన సమావేశంలో దీనిపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ, రవాణాశాఖ కమిషనర్‌ సందీప్‌కుమార్‌ సుల్తానియాలతో సీఎం కేసీఆర్‌ దీనిపై కొద్దిసేపు చర్చించారు. గురువారం హైకోర్టులో వాదనలున్నందున, అక్కడ అనుసరించాల్సిన విషయాలపై ప్రధానంగా చర్చ జరగ్గా, ప్రైవేటు బస్సులకు పర్మిట్ల జారీపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సమావేశంలో పాల్గొన్న ఉన్నతాధికారులు కూడా స్పందించలేదు. కానీ.. తొలుత 5,100 రూట్లకు సంబంధించి పర్మిట్ల జారీ ప్రక్రియ ప్రారంభించి దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేయాలని, ఆ తర్వాత మిగతా రూట్లకు సంబంధించి విడుదల చేయాలనే దిశలో చర్చలు జరిగినట్టు సమాచారం.

హైకోర్టు ఆదేశాలకనుగుణంగా..
 ఏడో తేదీన కోర్టు వాదనల తర్వాత ప్రభుత్వానికి ప్రత్యేక ఆదేశం/సూచన ఉంటుందేమో చూసి తదనుగుణంగా చర్యలకు ఉపక్రమించాలని ప్రభుత్వం భావిస్తోంది. సమ్మె విరమణ, ఉద్యోగులను తిరిగి తీసుకోవాలనే సూచన... తదితర పరిస్థితి ఎదురైతే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమ్మె ప్రారంభమైన రోజు సాయంత్రం 6 లోపు విధుల్లోకి వచ్చిన వారిని మాత్రమే చేర్చుకుంటామని, రాని వారిని ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణించబోమని ముఖ్యమంత్రి పేర్కొన్న సంగతి తెలిసిందే. కానీ ఆరోజు ఎవరూ రాలేదు. ఆ తర్వాత మరోసారి.. అర్జీ పెట్టుకుని విధుల్లోకి రావచ్చంటూ పేర్కొన్నారు. ఒకరిద్దరు తప్ప ఎవరూ రాలేదు. గత శనివారం మూడో అవకాశం కల్పించారు. ఇదే చివరిదన్న తరహాలో ఆయన స్పష్టం చేశారు. ఇక మరో అవకాశం విషయంలో ఆయన సుముఖంగా లేరని అధికారులంటున్నారు. ఒకవేళ హైకోర్టు ఆ విషయంలో ఆదేశించినా, సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశముందని పేర్కొంటున్నారు. 

కేంద్రం అండ పొందే యోచన
ఆర్టీసీ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం జోక్యం చేసుకునేలా చేయాలని కార్మిక సంఘాల జేఏసీ గట్టిగా యత్నిస్తోంది. సమ్మె ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీ మద్దతు సంపూర్ణంగా లభిస్తోంది. బీజేపీ నేతలు కార్యక్రమాల్లో పాల్గొంటూ, స్థానిక అగ్రనేతలు విలేకరుల సమావేశాల ద్వారా కార్మికుల మద్దతును ప్రకటిస్తూ వస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఓ అడుగు ముందుకేసి, ఆర్టీసీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును కేంద్రం నిశితంగా గమనిస్తోందంటూ చాలాసార్లు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో నేరుగా కేంద్ర హోంమంత్రి, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాతో భేటీ కావాలని జేఏసీ నేతలు నిర్ణయించారు. లక్ష్మణ్‌ ద్వారా ఆయన అపాయింట్‌మెంట్‌ కోరారు. ఆయన సమయం ఇవ్వగానే ఢిల్లీ వెళ్లి ఆయనను కలసి, ప్రైవేటీకరణ, సిబ్బంది తొలగింపు విషయంలో జోక్యం చేసుకునేలా కోరాలని నిర్ణయించారు. ఆర్టీసీలో కేంద్రం 31% వాటా కలిగి ఉన్నందున, చట్టప్రకారం జోక్యం చేసుకోవాలని గట్టిగా కోరనున్నారు.

ఉద్యోగ సంఘాల సాయం కోసం..
సమ్మెలో ఉన్న కార్మికులు తిరిగి డ్యూటీలో చేరకుండా చేయడంలో విజయం సాధించిన కార్మిక సంఘాల నేతలు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నుంచి సమ్మె ప్రత్యక్ష కార్యాచరణలో పూర్తి మద్దతు కూడగట్టలేకపోయారు. ఇప్పుడు మరోసారి వారి మద్దతు కోసం యత్నిస్తున్నారు. ముఖ్యంగా అన్ని ఉద్యోగ సంఘాలు ఒకరోజు పెన్‌డౌన్‌ నిరసనలో పాల్గొనేలా చేయాలని నిర్ణయించారు. ఈనెల 8 లేదా 9 తేదీల్లో దీనికి వారిని అంగీకరించేలా చేసే పనిలో ఉన్నారు. సరూర్‌నగర్‌ సభ తరహాలో ఈ నెల 9న పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించిన చలో ట్యాంక్‌బండ్‌ను విజయవంతం చేసి సామాన్య జనం మద్దతు పూర్తిస్థాయిలో కూడగట్టాలని భావిస్తున్నారు.

బకాయిలు చెల్లించండి.. 
ఆర్టీసీ కార్మికుల సహకార పరపతి సంఘా(సీసీఎస్‌)నికి రూ.200 కోట్లు చెల్లించాలని హైకోర్టు సూచించటంతోపాటు రూ.452.86 కోట్ల ఎంవీ ట్యాక్స్‌ చెల్లించాలని ట్రాన్స్‌పోర్టు అథారిటీ తాజాగా హుకుం జారీ చేయటం ఆర్టీసీకి ఇబ్బందిగా పరిణమించింది. గతంలో కార్మికులు, ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు డబ్బుల్లేక, అంతర్గత పనులకు నిధులు లేక కార్మికుల వేతనాల్లోంచి మినహాయించి సహకార పరపతి సంఘానికి చెల్లించే మొత్తాన్ని ఆర్టీసీ యాజమాన్యం వాడేసుకుంది. తాజాగా ఎంవీ ట్యాక్స్‌ బకాయిలు చెల్లించాలని ట్రాన్స్‌పోర్టు అథారిటీ ఆర్టీసీకి శ్రీముఖం జారీ చేసింది. ప్రభుత్వం రాయితీ మొత్తం తరచూ బకాయి పడుతుండటం, ఆర్టీసీ ఎంవీ ట్యాక్స్‌ రూపంలో ట్రాన్స్‌పోర్టు అథారిటీకి బకాయి పడుతుండటం సాధారణంగా మారిపోయింది. ఈ క్రమంలో కొన్ని నెలలుగా సిబ్బందికి జీతాలు చెల్లించే పరిస్థితి లేక ప్రభుత్వం నుంచి బకాయిలు వసూలు చేసుకుని చెల్లిస్తోంది. ఇలాంటి గడ్డు పరిస్థితిలో ఎంవీ ట్యాక్స్‌ బకాయిలు చెల్లించలేకపోయింది. దీంతో అలా పేరుకుపోయిన రూ.452.86 కోట్లు చెల్లించాలంటూ స్టేట్‌ ట్రాన్స్‌పోర్టు అథారిటీ కార్యదర్శి మమతా ప్రసాద్‌ బుధవారం నోటీసులు జారీ చేశారు. 

హైకోర్టుపైనే ఆశలు
హైకోర్టులో జరుగుతున్న వాదనల ఆధారంగా కోర్టు స్పందిస్తున్న తీరు తమకు అనుకూలంగా ఉందని ముందు నుంచి కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. డిమాండ్ల పరిష్కారానికి వీలుగా చర్చల విషయంలోనూ గురువారం కోర్టు ప్రభు త్వానికి సూచన చేస్తుం దన్న ఆశాభావంతో ఉన్నట్టు చెబుతు న్నారు. సీఎం డెడ్‌లైన్‌తో కార్మికులు విధుల్లో చేరేందుకు ఆసక్తి కనబరిచినా న్యాయపోరాటంలో గెలుస్తామని సంఘాలు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశాయి. దీంతో సమ్మెలో కొనసాగేం దుకే కార్మిక లోకం మొగ్గుచూపింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top