టీఆర్‌ఎస్‌కు ఆశావాహుల తాకిడి..

TRS Leaders Hope On Ticket Allocation For Municipal Elections  - Sakshi

ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలకు ముందుగానే అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో టికెట్ల సందడి మొదలైంది. వార్డుల వారీగా పోటీకి దిగేవారి సంఖ్య రోజు రోజుకూ  పెరిగిపోతోంది. తమకే అంటే తమకే టికెట్‌ ఇవ్వాలని అధినాయకత్వం ముందు ఆశావహులు క్యూ కడుతున్నారు. అందరి విన్నపాలు స్వీకరిస్తున్న నాయకులు ఆఖరి నిమిషం వరకు ఆగి నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఎవరికి టికెట్‌ వచ్చినా అందరూ కలిసి పనిచేయాలని, లేకపోతే పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తామని ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అధికార పార్టీ నుంచి అభ్యర్థుల రద్దీ పెరిగిన నేపథ్యంలో అసమ్మతీయులకు ఎరవేసి టికెట్‌ ఇచ్చేందుకు విపక్ష పార్టీలు కాచుకొని ఉన్నాయి.

సాక్షి, సిద్దిపేట: జిల్లాలోని హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పోటీ చేసే వారి సంఖ్య ఇప్పటికే చేతాడంత పొడుగైంది. చేర్యాల మున్సిపాలిటీలో 12 వార్డులు, మిగిలిన మూడు మున్సిపాలిటీల్లో 20 చొప్పున వార్డులు ఉన్నాయి. అయితే ఈ వార్డుల రిజర్వేషన్‌ ప్రకటించడంతో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది.

తమకు అవకాశం ఇవ్వాలని ఎవరికి వారుగా మంత్రి హరీశ్‌రావుతోపాటు, స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ పెద్దల వద్దకు క్యూ కడుతున్నారు. ముందుగా 
అందరి ఆలోచనలు తెలుసుకోవాలనే ఆలోచనతో స్థానిక ఎమ్మెల్యేలు అభ్యర్థుల విన్నపాలు, దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇలా ఇప్పటికే నాలుగు మున్సిపాలిటీలలో ఒక్కొక్క వార్డు నాలుగురు, ఐదుగురు పోటీ పడుతున్నట్లు స్పష్టం అవుతుంది.  

కొత్త, పాత కలయికలతో 
శాసనసభ ఎన్నికల నాటికి జిల్లాలోని టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల ఎవరికి వారుగా ఉండి ఉనికి చాటుకునేవారు. అయితే ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంగా జరిగిన రాజకీయ సమీకరణాలతో అంతా తారుమారైంది. దుబ్బాకలో కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ముత్యంరెడ్డి ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌లో చేరారు. అదేవిధంగా హుస్నాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు గులాబీ కండువా కప్పుకున్నారు. అదేవిధంగా గజ్వేల్‌లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీచేసిన ప్రతాప్‌రెడ్డి కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరితోపాటు, చేర్యాలలో కూడా ముఖ్య నాయకులు కారెక్కారు.

అదేవిధంగా బీజేపీ, ఇతర పార్టీ నుంచి కూడా పలువురు కీలక నాయకులు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో గత మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఉన్న వారందరూ ఇప్పుడు ఒకే పార్టీ లో ఉన్నారు. దీంతో ఈసారి తమకే టికెట్‌ ఇవ్వాలంటే తమకే టికెట్‌ ఇవ్వాలని పోటీ పడుతున్నారు. ముందు నుంచి పార్టీలో పనిచేస్తున్న తమకే పార్టీ టికెట్‌ వస్తుందని పాత టీఆర్‌ఎస్‌ నాయకులు, కౌన్సిలర్లు చెబుతుండగా.. ఎన్నికల ముందు తమకు ఇచ్చిన హామీ మేరకు ఈసారి మాకే టికెట్‌ వస్తుందని కొత్తగా చేరిన నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.   

అందరి దరఖాస్తులు స్వీకరిస్తున్న నాయకులు  
వార్డుల వారీగా నాయకులు పోటాపోటీగా టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అధినాయకత్వం ముందు దరఖాస్తులు చేస్తున్నారు. ఇదంతా చూస్తున్న స్థానిక ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలు మాత్రం ఇప్పటికిప్పుడూ ఎవరికి ఏ హామీ ఇవ్వకుండా మౌనంగా ఉండటం గమనార్హం. అందరి ఆలోచన చూసిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని తమ వద్దకు వచ్చిన వారికి చెబుతూ పంపిస్తున్నారు. అయితే వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంలో తమతో వచ్చిన వారికి టికెట్‌ ఇప్పించేందుకు పలువురు నాయకులు ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశారు.

ఈ పరిస్థితిలో ఎవ్వరికి మాట ఇవ్వకుండా మీలో సయోధ్య కుదిరితేనే మంచి ఫలితాలు వస్తాయి.. పార్టీ ఎవరికి టికెట్‌ ఇచ్చినా అందరూ కలిసి పనిచేయాలనే నిర్ణయానికి రావాలని ఆశావహులకు చెబుతున్నారు. ఇదిలా ఉండగా వార్డుల్లో తమకున్న బలం నిరూపించుకొని ఇన్‌చార్జీల వద్ద మార్కులు కొట్టేసి టికెట్‌ తెప్పించుకునేందుకు నాయకులు ఇప్పటి నుంచి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌ నామినేషన్ల నాటికి పార్టీ బీ–ఫాం ఎవరికి వస్తుందో అనేదానిపై అన్ని మున్సిపాలిటీల్లో ఉత్కంఠ నెలకొంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top