ఆరేళ్లుగా కారు హ్యాపీ జర్నీ

TRS Journey Going On Successful For Six Years - Sakshi

ఎన్నికలు ఏవైనా ఆరేళ్లుగా టీఆర్‌ఎస్‌ విజయం

నారాయణఖేడ్‌ నుంచి హుజూర్‌నగర్‌ వరకు అన్నింటా గెలుపే

దేశంలో ఎక్కడా లేని విధంగా 32 జిల్లా పరిషత్‌ స్థానాలు కైవసం

2019 లోక్‌సభ ఎన్నికల్లోనే తడబాటు.. మిగిలిన అన్ని ఎన్నికలూ ఏకపక్షమే

కేసీఆర్‌ చరిష్మాకు గండికొట్టే వ్యూహాలపై ప్రతిపక్షాల్లో అంతర్మథనం 

సాక్షి, హైదరాబాద్‌: 2014 ఎన్నికల్లో 63 అసెంబ్లీ, 11 లోక్‌సభ స్థానాల్లో విజయం.. ఆ తర్వాత జరిగిన మెదక్, వరంగల్‌ లోక్‌సభ, నారాయణ్‌ఖేడ్, పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ గెలుపు.. 2018 ముందస్తు ఎన్నికల్లో ఏకంగా 88 అసెంబ్లీ స్థానాల్లో విజయం.. అనంతరం జరిగిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ ఎన్నికల్లో 60% పైగా స్థానాలు, దేశ చరిత్రలో ఏ పార్టీ సాధించని విధంగా ఏకంగా 32 జడ్పీ పీఠాలు కైవసం.. తాజాగా హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో 50 శాతానికి పైగా ఓట్లతో రికార్డు విజయం.. ఒక్క 2019 లోక్‌సభ ఎన్నికల్లో తడబాటు మినహా రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా.. అది ఈవీఎం అయినా, బ్యాలెట్‌ అయినా.. కారు జోరుగా దూసుకుపోతోంది.  ఎన్నికల పేరు మార డమే తప్ప.. ఆరేళ్లుగా విజయం మాత్రం టీఆర్‌ఎస్‌నే వరిస్తోంది. దీంతో అధికార పార్టీ జైత్రయాత్రకు ఎలా అడ్డుకట్ట వేయాలి?  ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ చరిష్మాకు గండికొట్టి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఎలా ఓడించాలన్న దానిపై రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల్లో అంతర్మథనం ప్రారంభమైంది. ముఖ్యంగా ప్రభుత్వానికి అననుకూల పరిస్థితుల్లో జరిగాయని భావిస్తున్న హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లోనూ 43వేల మెజారిటీతో టీఆర్‌ఎస్‌ గెలవడంతో తమ భవిష్యత్తు ఏమిటన్న దానిపై ఆ పార్టీల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

ఏం చేద్దాం చెప్మా...!
టీఆర్‌ఎస్‌ జోరుకు అడ్డుకట్ట వేయడం ఎలా అన్నది ఇప్పుడు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు పెద్ద సవాల్‌గా మారింది. మున్సిపల్‌ ఎన్నికలు రాబో తున్న తరుణంలో వెలువడిన హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల ఫలితం ప్రతిపక్షాల ఆశలపై నీళ్లు చల్లింది. ఈ ఎన్నికల్లోనూ అదే ఫలితం పునరావృతం అయితే రాష్ట్రంలోని అన్ని స్థాయిల్లోని పదవుల్లోనూ టీఆర్‌ఎస్‌దే పూర్తిస్థాయిలో ఆధిపత్యం కానుంది. ఓ వైపు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే పార్టీ పరంగా సంస్థాగతంగా వేళ్లూనుకుంటున్న టీఆర్‌ఎస్‌కు పట్టణ ప్రాంతాల్లో అయినా కళ్లెం వేయడం ప్రతిపక్ష పార్టీలకు తక్షణ కర్తవ్యం కానుంది. అయితే, రాష్ట్రంలోని ప్రధాన పార్టీల ప్రస్తుత పరిస్థితి, ప్రజల మూడ్‌ చూస్తే ఇది సాధ్యమేనా అనే సందేహాలు వస్తున్నాయి. రాష్ట్రంలో మంచి కేడర్, క్షేత్రస్థాయిలో నేతలు, కార్యకర్తలున్న కాంగ్రెస్‌ పార్టీ ప్రతి ఎన్నికలోనూ అధికార పార్టీని ఢీకొడుతోంది కానీ పైచేయి సాధించలేకపోతోంది. దీంతో వరుస ఓటములు ఆ పార్టీ కేడర్‌ను నైరాశ్యంలో ముంచేస్తున్నాయి.

కేసీఆర్‌ గురించి, రాష్ట్ర ప్రభుత్వం గురించి ఏం చెప్పినా ఎన్నికల బరిలో కాంగ్రెస్‌ నేతల మాటలు ప్రజలు విశ్వసించకపోవడంతో ఆ పార్టీ కేవలం పోటీకి మాత్రమే పరిమితమవుతోంది. ఇక, టీఆర్‌ఎస్‌ను గద్దె దించి 2023లో తెలంగాణపై జెండా ఎగరవేస్తామని చెబుతున్న బీజేపీ కేవలం మాటలకే పరిమితమవుతోందనే అభిప్రాయం వినిపిస్తోంది. 2014 నుంచి జరిగిన ఎన్నికల్లో ఒక్క 2019 లోక్‌సభ ఎన్నికల్లో మినహా ఆ పార్టీ కనీసం టీఆర్‌ఎస్‌కు పోటీ ఇవ్వడమే కాదు.. రెండో స్థానానికి కూడా ఆమడ దూరంలో నిలిచింది. ఇక, హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో అయితే డిపాజిట్‌ కూడా కోల్పోయి పరాభవం మూటగట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌ను ధీటుగా ఎదుర్కోవడం ప్రతిపక్షాలకు పద్మవ్యూహంగానే కనిపిస్తోంది.

ఆ పార్టీలు ‘ఖల్లాస్‌’..
రాష్ట్రంలోని టీడీపీ, వామపక్షాల ఓటు బ్యాంకును టీఆర్‌ఎస్‌ తమ ఖాతాలో వేసేసుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. హుజూర్‌నగర్‌లో 2014 ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీకి 25వేల పైచిలుకు ఓట్లు రాగా, తాజా ఉప ఎన్నికలో 1500 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2014 తర్వాతి రాజకీయ పరిణామాల్లో ఆ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా నష్టం జరిగినా హుజూర్‌నగర్‌లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో టీడీపీకి కనీసంగా 7వేలకు తగ్గకుండా ఓట్లు రావాల్సి ఉంది. కానీ, అందులో పావు వంతు కూడా రాకపోవడంతో తెలుగు తమ్ముళ్లు సైకిల్‌ను వదిలి కారెక్కినట్టు అర్థమవుతోంది. వామపక్షాలదీ అదే పరిస్థితిగా కనిపిస్తోంది. సీపీఎంకి 2018 ముందస్తు ఎన్నికల్లో 2వేల పైచిలుకు ఓట్లు రాగా, ఇప్పుడు ఆ పార్టీ బలపర్చిన స్వతంత్ర అభ్యర్థికి వెయ్యి ఓట్లు కూడా రాలేదు. ఇక, సీపీఐ పోటీలో లేనప్పటికీ ఆ పార్టీ ఓట్లు కూడా కారుకే పడ్డాయనేది అంచనా. ఒక్క హుజూర్‌నగర్‌లో కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందనేది రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, వామపక్షాల ఓట్లు టీఆర్‌ఎస్‌ వైపు దాదాపు మళ్లినట్టేనని, ఆ పార్టీల ఓటు బ్యాంకును కారు కొల్లగొట్టందని హుజూర్‌నగర్‌ ఉప ఫలితమే చెబుతోంది.

క్షేత్రం.. మరింత పటిష్టం
టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దశ నుంచి ఉత్తర తెలంగాణలో బలంగా ఉండగా, దక్షిణ తెలంగాణలో కొంత వెనుకబడేది. అయితే, 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. ఇక 2019 అక్టోబర్‌ నాటికి చూసుకుంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో బలీయ శక్తిగా ఎదిగింది. ముఖ్యంగా కాంగ్రెస్‌ ప్రాబల్యం కొట్టిచ్చినట్టు కనిపించే నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లతో పాటు ఖమ్మంలోనూ పటిష్ట స్థితికి చేరింది. తాజా ఉప ఎన్నికతో పాటు ఖమ్మం కార్పొరేషన్‌ను స్వంతంగా దక్కించుకునే స్థాయికి అధికార పక్షం వేళ్లూనుకుంది. ఇక, ఇతర పార్టీల నుంచి చాలా రోజులుగా పెద్ద ఎత్తున జరుగుతున్న వలసలు క్షేత్రస్థాయిలో గులాబీ పార్టీకి టానిక్‌లా పనిచేస్తున్నాయి.

ఇటీవలి ఉప ఎన్నికల్లో పోలింగ్‌ రోజున కాంగ్రెస్‌ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించేందుకు కూడా కొన్ని గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు లేనంతగా అవి ఉపయోగపడ్డాయి. రాష్ట్రంలోనే కాంగ్రెస్‌ పార్టీకి పటిష్ట కేడర్‌ ఉన్న హుజూర్‌నగర్‌లోనే ఆ పరిస్థితి ఉందంటే మిగిలిన చోట్ల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రామాలు, మండలాలు, జిల్లాల స్థాయిలో పేరు మోసిన నేతలందరినీ పార్టీలో చేర్చుకోవడం, గ్రామాల్లో కనీసం పార్టీ జెండాలు మోసేందుకు, మోయించేందుకు కూడా ఇతర పార్టీలకు మనుషులు లేకుండా చేయడమే వ్యూహంగా పథకం ప్రకారం టీఆర్‌ఎస్‌ ఆడుతున్న రాజకీయ చదరంగం.. ప్రతిపక్షాలకు భవిష్యత్తు లేకుండా చేస్తోందని రాజకీయ విశ్లేషకులంటున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top