
పాలకుర్తిలో ఏర్పాట్లను పరిశీలించిన దయాకర్‌రావు, సీపీ రవీందర్
సాక్షి , వరంగల్ : ‘గులాబీ’ బాస్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 19, 23వ తేదీల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. 19న పాలకుర్తి నియోజకవర్గంలో, 23న జనగామ, మహబూబాబాద్, నర్సంపేట, డోర్నకల్ నియోజకవర్గాల్లో జరిగే ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. 19వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు పాలకుర్తిలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
కేసీఆర్ గత నెల 7, 8వ తేదీల్లో జిల్లాలో పర్యటిస్తారని తొలుత భావించారు. అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే ఊపొస్తుందనే భావనతో సభను 19వ తేదీన ఖరారు చేసినట్లు సమాచారం. అదేరోజు పాలకుర్తి టీఆర్‌ఎస్ అభ్యర్ధి ఎర్రబెల్లి దయాకర్‌రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం కేసీఆర్‌తో కలిసి బహిరంగ సభలో పాల్గొననున్నారు. సీఎం కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిర్వహించే తొలి ఎన్నికల ప్రచార సభ కావడంతో టీఆర్‌ఎస్ అభ్యర్థులతోపాటు పార్టీ శ్రేణులు, కార్యకర్తలను పెద్దఎత్తున సమీకరించేందుకు పార్టీ వర్గాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. కేసీఆర్ పర్యటన అధికారికంగా ఖరారు కావడంతో జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు భద్రతా ఏర్పాట్లపై దృష్టి పెట్టారు.
23న నర్సంపేట నుంచి మొదలై....
23న తొలుత ఆశీర్వాద బహిరంగ సభ నర్సంపేట నుంచి ప్రారంభం కానుంది. అనంతరం కేసీఆర్ మహబూబాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. అక్కడి నుంచి డోర్నకల్ నియోజకవర్గంలో నిర్వహించే సభకు హాజరుకానున్నారు. ఇక్కడ సభ ముగియగానే సూర్యపేటకు వెళ్లిపోతారు. అక్కడి నుంచి తిరిగి జనగామ నియోజకవర్గానికి చేరుకుంటారు. జనగామలోని హన్మకొండ రహదారిలోని ప్రిస్టన్ మైధానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.
60 వేల మందితో బహిరంగ సభ..
నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల 19న సీఎం కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభకు రాజీవ్ చౌరస్తా నుంచి జనగామకు వెళ్లే రహదారిలో బస్‌స్టేషన్ సమీపంలో ఏర్పాట్లు చేస్తున్నాం. నియోజకవర్గ వ్యాప్తంగా 60 వేల మంది ప్రజలను సభకు తరలిస్తున్నాం. అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వాద సభకు హాజరవుతారు.