బాలనేరస్తుల్లో పరివర్తన తేవాలి | transition to the child criminals | Sakshi
Sakshi News home page

బాలనేరస్తుల్లో పరివర్తన తేవాలి

May 7 2015 1:14 AM | Updated on Aug 9 2018 4:45 PM

బాలనేరస్తుల్లో పరివర్తన తేవాలి - Sakshi

బాలనేరస్తుల్లో పరివర్తన తేవాలి

నేరాలకు పాల్పడుతున్న పిల్లల్లో పరివర్తన తెచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ తెలంగాణ ...

లోక్‌సభలో జువెనైల్ జస్టిస్ బిల్లుపై చర్చలో ఎంపీ పొంగులేటి

న్యూఢిల్లీ: నేరాలకు పాల్పడుతున్న పిల్లల్లో పరివర్తన తెచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్రాన్ని కోరారు. బుధవారం లోక్‌సభలో జువెనైల్ జస్టిస్ బిల్లు-2014పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘‘ప్రస్తుత బాల నేరస్తుల చట్టం ప్రభావవంతంగా లేదు. మరింత మెరుగైన రీతిలో అమలుపరిచేందుకు అవకాశం ఉంది. అయితే ఈ చట్టానికి ప్రతిపాదిస్తున్న సవరణ కఠినంగా ఉంది. వయోజనులతోపాటుగా బాల నేరస్తులను జైళ్లలో పడేస్తే వారు కరడుగట్టిన నేరస్తులుగా మారే ప్రమాదం ఉంది. క్రూరమైన నేరాలకు పాల్పడినప్పుడు 16 ఏళ్ల పైబడిన  బాల నేరస్తులను పెద్ద వారితో సమానంగా పరిగణిస్తూ ఈ ప్రతిపాదన తెస్తున్నారు.

జాతీయ నేర చిట్టాల బ్యూరో తాజా నివేదిక ప్రకారం బాల నేరస్తులపై 43,506 కేసులు రిజిస్టరయ్యాయి. ఇందులో 28,830 కేసులు 16 నుంచి 18 ఏళ్ల మధ్య వారిపై నమోదయ్యాయి. బాల నేరస్తుల్లో 50.2% నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. వారి కుటుంబాల వార్షిక ఆదాయం రూ. 25 వేల లోపే ఉంది. 2012 డిసెంబర్‌లో ఢిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్ అనంతర పరిణామాల్లో ఈ చట్టానికి తెస్తున్న సవరణ ఇది. ఆ కేసులో దోషిగా తేలిన వ్యక్తికి 18 ఏళ్లకు కొన్ని మాసాలు తక్కువ వయసు ఉండడంతో ఇప్పటివరకు ఉన్న చట్టంలోని నిబంధనల ప్రకారం మూడేళ్లపాటు అబ్జర్వేషన్ హోంకు తరలించారు. దాదాపు 50% లైంగిక నేరాలు 16 ఏళ్ల వయసులో చేస్తున్నవే. బాల నేరస్తులకు సంబంధించి అత్యాచారం కేసుల్లో 67% కేసులు 16 ఏళ్ల వయసు వారిపైనే ఉన్నాయి. క్రిమినల్ గ్యాంగులు బాలలతో కిరాయి నేరాలు చేయించకుండా ఈ సవరణ దోహదం చేస్తుంది. అలాగే బాల నేరస్తులకు కూడా తాము తప్పించుకోలేమని అర్థమవుతుంది. ఇక బాలలు నేరస్తులుగా మారేందుకు దోహదపడుతున్న కారణాలను పరిశీలించాల్సి ఉంది. పాఠశాల జీవితంతో అసంతృప్తిగా ఉండడం, తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యం, పాఠశాలల్లో క్రీడావసతుల లేమి వంటి కారణాలు పిల్లల గైర్హాజరుకు కారణాలవుతున్నాయి. ఇలా అసంతృప్తికి లోనవుతున్న పిల్లలు నేరాలకు పాల్పడే ప్రమాదం ఉంది.’’ అని పొంగులేటి పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement