ర్యాగింగ్‌ కేసులో ముగ్గురి అరెస్ట్‌ 

Three Senior Students Have Been Arrested for Attacking a Junior Student at Sathupally - Sakshi

సత్తుపల్లిటౌన్‌: విద్యాసంస్థల్లో జూనియర్లపై సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కల్లూరు ఏసీపీ ఎన్‌.వెంకటేష్‌ హెచ్చరించారు. సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం రాత్రి జరిగిన విలేకరుల సమావేశంలో ర్యాగింగ్‌ యాక్ట్‌ కేసులో ముగ్గురు విద్యార్థులను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. ఈ నెల 22వ తేదీన సాయంత్రం మూడుగంటల సమయంలో కొత్తూరు మదర్‌ థెరిస్సా ఇంజనీరింగ్‌ కళాశాల సమీపంలోని అదే కళాశాలలో చదువుతున్న జూనియర్‌ విద్యార్థి శివగణేష్‌ను సీనియర్‌ విద్యార్థులు ఓ పాడుబడ్డ ఇంట్లోకి తీసుకెళ్లి విచక్షణా రహితం చితకబాదారు. బాధితుడు శివగణేష్‌ సీనియర్‌ విద్యార్ధి అఫ్రీద్‌కు ఫేస్‌బుక్‌లో మెస్సేజ్‌ పెట్టడంతో దానిని ఆసరాగా చేసుకొని అఫ్రీద్‌ తన మిత్రులు సాయికిరణ్, మణితేజలతో కలిసి దాడి చేశాడు. ఈ సంఘటను సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరించి సోషల్‌ మీడియలో కూడా అప్‌లోడ్‌ చేశారు. బాధితుడు శివగణేష్‌ సత్తుపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

అయితే అప్పటి నుంచి పరారీలో ఉన్న అఫ్రీద్, సాయికిరణ్, మణితేజలను శుక్రవారం అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఏసీపీ వెంకటేష్‌ తెలిపారు. విద్యార్థుల్లో సత్‌ప్రవర్తనతో కూడిన మార్పు తెచ్చేందుకు పోలీస్‌శాఖ కృషి చేస్తుందన్నారు. తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్‌ ఇవ్వటం జరిగిందన్నారు. సమాజంలో నూటికి తొంబైతొమ్మిది శాతం మంది మంచి ప్రవర్తన కలిగిన వారే ఉంటారని.. వీరికి మాత్రమే ఫ్రెండ్లీ పోలిసింగ్‌ ఉంటుందన్నారు. డ్రంక్‌అండ్‌డ్రైవ్‌ నిర్వహిస్తామని తెలిపారు. ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్‌ వంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో సీఐ టి.సురేష్, ఎస్సై నారాయణరెడ్డి, ఏఎస్సై బాలస్వామి ఉన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top