అటకెక్కిన మూడెకరాలు!

Three Acres Land Distribution Scheme Delayed in Mahabubnagar - Sakshi

ఉమ్మడి పాలమూరు జిల్లాలో దళితులకు భూ పంపిణీకి గ్రహణం

ఐదేళ్లలో 772 మందికే లబ్ధి ఉమ్మడి జిల్లాలో 6,93,948 మంది ఎస్సీలు

అందుబాటులో లేని ప్రభుత్వ, అసైన్డ్‌ భూములు

ఆకాశానంటుతున్న ప్రైవేట్‌ భూముల ధరలు

భూమి ఇచ్చిన చోట సవాలక్ష సమస్యలు

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: అర్హులైన దళితులకు వ్యవసాయయోగ్యమైన మూడెకరాల భూ పంపిణీ ఉమ్మడి జిల్లాలో అటకెక్కింది. అందుబాటులో లేని ప్రభుత్వ భూమి, రెక్కలు తొడిగిన ప్రైవేట్‌ భూముల ధరల ఫలితంగా భూ పంపిణీకి బ్రేక్‌పడింది. పలు చోట్ల పంపిణీ చేసిన భూములు రైతుల పేరిట పట్టాలు చేయకపోవడం.. మూడెకరాల లోపే పంపిణీ చేయడం.. సాగునీటి సదుపాయం లేకపోవడంతో లబ్ధిదారుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. గడిచిన ఐదేళ్లలో ఉమ్మడి జిల్లా మొత్తంలో కేవలం 772 మందికి 1,537.66 ఎకరాల భూమి పంపిణీ చేశారు. అందులో రూ.6.76కోట్ల విలువ చేసే సుమారు 700 ఎకరాల ప్రైవేట్‌ భూమిని అర్హులకు అందించారు. మరోవైపు క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలతో ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు సైతం మిన్నకుండిపోతున్నారు.

తప్పని ఎదురుచూపులు..
ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 6,93,948 మంది ఎస్సీలు ఉన్నారు. వీరిలో సగానికి పైగా మందికి భూమి లేదు. వీరందరూ ప్రభుత్వం పంపిణీ చేసే భూములపై ఆశలు పెట్టుకున్నారు. కానీ.. అవసరం మేరకు భూమి అందుబాటులో లేకపోవడంతో భూపంపిణీ ప్రక్రియకు బ్రేక్‌పడింది. మరోవైపు క్షేత్రస్థాయిలో భూమి కోసం దళితుల నుంచి పెరుగుతున్న ఒత్తిడితో అధికారులు ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో మొత్తం 251మంది అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి 684.13 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. ఈ భూమిని 104 మంది పట్టాదారు రైతుల వద్దే కొనుగోలు చేశారు. ఆయా భూముల్లో నీటి వనరుల ఏర్పాటు కోసం 27బోర్లు అవసరమని అధికారులు గుర్తించారు. అందుకోసం ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ప్రభుత్వం బోర్లు కూడా మంజూరు చేసింది. వీటిలో ఇప్పటివరకు 19 బోర్లు వేశారు. మిగిలిన ఎనిమిది బోర్లు కూడా త్వరలోనే వేస్తామని ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ కె.రాములు తెలిపారు. అయితే మరో 94.04 ఎకరాలను ప్రభుత్వ అధికారులు గుర్తించి దానికి సంబంధించి పట్టాదారు రైతుల వద్ద ఎకరాకు రూ.3.90లక్షల చొప్పున చెల్లించేందుకు 2018 ఏప్రిల్‌ మాసంలో ఒప్పందం చేసుకున్నారు.

అయితే దీనికి సంబంధించిన కొనుగోలు, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు రెండేళ్ల క్రితమే బ్రేక్‌పడింది. ప్రస్తుతం మార్కెట్‌ విలువ పెరగడంతో తాజాగా రెండేళ్ల క్రితం ఎకరానికి రూ.3.90 లక్షల చొప్పున ఇస్తామని ముందుకొచ్చిన రైతులు రూ.6లక్షలు ఇస్తేనే అమ్ముతామని చెబుతున్నారు. ఇదే పరిస్థితి మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో నెలకొంది. కొత్త జిల్లాల ఏర్పాటు, పారిశ్రామీకరణ, ప్రాజెక్టుల నిర్మాణంతో ఆయా ఉమ్మడి జిల్లాలో చాలా గ్రామాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు భూములు అప్పగించేందుకు ప్రైవేట్‌ భూ యజమానులు ముందుకు రావడం లేదు. ఏడాది క్రితం రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఉన్న భూముల ధరలు ఇప్పుడు అమాంతంగా రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు పెరిగాయి. అప్పుడు అధికారులు పంపిన ప్రతిపాదనలపై ప్రభుత్వం ఆలస్యంగా నిధులివ్వడంతో భూముల ధరలు పెరిగిపోయాయి. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలో, నారాయణపేట జిల్లా ధన్వాడ, నర్వ, మరికల్, మక్తల్‌ మండలాల్లో భూ పంపిణీ జరిగింది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని అచ్చంపేట మండలం పులిజల్, తంగాపూర్, చౌటుప్పలి, ఉప్పునుంతల మండలం పెనిమళ్ల, అయ్యవారిపెల్లి, కొల్లాపూర్‌ మండలం చింతలపల్లి, పెంట్లవెల్లి మండలం కొండూరు, సింగవరం, జాతప్రొలి, లింగాల, తెలకపల్లి మండలం గౌరారం, గడ్డంపల్లి, పెద్దకొత్తపల్లి మండలం దేదినేనిపల్లి, కొల్లాపూర్‌ మండలం మాల చింతల్‌పల్లి, మాచినేనిపల్లి, నర్సింహాపూర్, లింగాల మండలం  చిన్నంపల్లి, అంబటిపల్లిలతో పాటు మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్, దేవరకద్ర, హన్వాడ, మిడ్జిల్, మూసాపేట, కోయిల్‌కొండ, సీసీ కుంట, అడ్డాకల మండలాల్లో భూ పంపిణీ అరకొరగా జరిగింది. అయితే నారాయణపేట జిల్లా ధన్వాడలో రెండేళ్ల క్రితం 50మందికి అధికారులు పంపిణీ చేసిన భూమికి పట్టాలు ఇవ్వలేదు. దీంతో చాలామంది అందులో వ్యవసాయం చేయడం లేదు.

నాణ్యమైన భూమి ఇవ్వలేదు
నా పేరు తగరం అలివేలమ్మ. భర్త మద్దిలేటి. మాకు ఎలాంటి భూమి లేదు. మాది వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం కొప్పునూరు. ఎలాంటి జీవనాధారం లేని మాకు 2018లో ప్రభుత్వం తరఫున మూడెకరాల భూమి ఇస్తామని అధికారులు చెప్పారు. కానీ 1.20ఎకరాలు మాత్రమే ఇచ్చారు. ఇచ్చిన భూమి వ్యవసాయయోగ్యానికి అనుకూలంగా లేవు. బండరాళ్లతో నిండి ఉంది. కనీసం బోరు కూడా లేదు. వ్యవసాయానికి అనుకూలమైన మూడెకరాలు ఇవ్వాలని కలెక్టర్‌కు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదు. మా మండలంలో చాలా మందికి తక్కువ భూమి వచ్చింది.  

పట్టా పుస్తకాలు అందించాలి
దళితుల కోసమంటూ ప్రభుత్వం మాకు మూడు ఎకరాల భూమిని ఇచ్చింది. నాలుగు సంవత్సరాలుగా పంటను సాగు చేసుకుంటున్నాం కానీ ఇప్పటి వరకు పాసు పుస్తకాలు ఇవ్వలేదు. భూమి కూడా సరైనది ఇవ్వలేదు. సొంత డబ్బులు పెట్టి చదును చేయించుకున్నాం. ఇప్పుడు భూమి మాకు ఇస్తారో లేదో తెలియడం లేదు. పాసు పుస్తకాలు లేకపోవడంతో మాకు రైతుబంధు పథకం అందడం లేదు. ప్రభుత్వం చొరవ చూపి పాసు పుస్తకాలు అందజేయాలని వేడుకుంటున్నాం.   – ఎలుక బాల్‌రాజు, కిష్టాపూర్, నారాయణపేట జిల్లా

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top