జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అక్రమార్కులకు వరంగా మారింది. గ్రామాల్లో పండ్లతోటల పెంపకం పేర కొందరు అధికారులు, దళారులు నిధులను అమాంతంగా మెక్కేశారు. రికార్డుల్లో బోగస్ తోటల పేర అవినీతి రికార్డులను సృష్టించారు.
నాగర్‌కర్నూల్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అక్రమార్కులకు వరంగా మారింది. గ్రామాల్లో పండ్లతోటల పెంపకం పేర కొందరు అధికారులు, దళారులు నిధులను అమాంతంగా మెక్కేశారు. రికార్డుల్లో బోగస్ తోటల పేర అవినీతి రికార్డులను సృష్టించారు. ఇలా 2007 నుంచి 2010 వరకు కోట్ల రూపాయలు పక్కదారి పట్టినట్లు స్పష్టమవుతోంది. ఇందులో కొన్ని ఫైళ్లు మాయంకావడం పలు అనుమానాలకు తావిస్తోంది. నియోజకవర్గంలోని ఐదు మండలాలు.. 55 గ్రామాల్లో 2011-12, 13 సంవత్సరాల్లో దాదాపు 366 మంది లబ్ధిదారులకు చెందిన 1017 ఎకరాల్లో పండ్ల తోటలు సాగుచే సిన ట్లు ఈజీఎస్ అధికారులు లెక్కలు రాసిపెట్టారు.
ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం రైతుల పొలాల్లో పండ్ల మొక్కలు నాటేందుకు అవసరమైన గుంతలు తీయడం, వాటిని పూడ్చడం, ఎరువులు, ఇతర నిర్వహణ ఖర్చుల కోసం సుమారు రూ.2కోట్లు ఖర్చుచేశారు. రైతులకు సరైన అవగాహన కల్పించకపోవడం, సకాలంలో మొక్కలు, నీటి సరఫరాకు అవసరమైన డ్రిప్‌లు అందించకపోవడం, పలు రకాల కారణాలతో నాటిన మామిడి, బత్తాయి మొక్కలు ఎండిపోయాయి.
మరికొన్ని ఎదిగినా దిగుబడి, ఇతర కారణాలతో చెట్లను కొట్టేసి ఆ భూముల్లో ఇతర పంటలు సాగుచేశారు. తెలకపల్లి మండలం నడిగడ్డలో పండ్ల తోటల పథకం అవినీతికి చిరునామాగా మారింది. సామాజిక తనిఖీల్లో దాదాపు రూ.రెండులక్షలకు పైగా అవినీతి జరిగినట్లు బయటపడినా రాజకీయ వివాదాల మధ్య రికవరీ కూడా ఆగిపోయింది. కొందరు అధికారులపై చర్యలు తీసుకున్నా అది తాత్కాలికమే అయింది. నాగర్‌కర్నూల్, బిజినేపల్లి మండలాల్లో మూడో విడత సామాజిక తనిఖీలో పండ్లతోటల సాగుకు సంబంధించిన ఫైళ్లు గల్లంతవడం అవినీతి పరాకాష్టకు అద్దం పడుతుంది. 2007 నుంచి 2010 వరకు పండ్ల తోటల లెక్కలు స్థానిక ఈజీఎస్ కార్యాలయాల్లో అందుబాటులో లేవు. నిబంధనలను కఠినతరం చేసిన సమయంలోనే రూ.రెండుకోట్ల అవినీతి జరిగిదంటే పథకం ప్రారంభంలో అవినీతి ఎలా జరిగి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మూడేళ్లలో 1017 ఎకరాల్లో పండ్లతోటలు సాగుచేస్తే ప్రస్తుతం కేవలం 200ఎకరాల్లోపే మిగిలాయి.