గందరగోళ ‘పంచాయతీ’ 

Telangana Panchayat Elections BC  Rangareddy - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గ్రామ పంచాయతీల రిజర్వేషన్ల వ్యవహారం గందరగోళంగా మారింది. ఎట్టకేలకు సర్పంచ్‌ స్థానాలను కేటగిరీల వారీగా ఖరారు చేసినా.. వార్డుల విభజన మాత్రం కొలిక్కిరాలేదు. మార్గదర్శకాల అమలులో స్పష్టతలేకపోవడం.. ఫార్ములాను పాటించకపోవడంతో వార్డుల రిజ ర్వేషన్ల వ్యవహారం గందరగోళంగా మారింది. ముఖ్యంగా మహిళలకు కేటాయించే సీట్ల సంఖ్య నిర్దేశిత కోటాను మించిపోవడంతో యంత్రాంగం తలపట్టుకుంది. శనివారంలోపు గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డుల రిజర్వేషన్ల జాబితాను నివేదించాలని ప్రభు త్వం ఆదేశించింది. దీంతో మూడు రోజులుగా రిజర్వేషన్ల ఖరారుపై ఆర్డీఓ, ఎంపీడీఓ, పంచాయతీ అధికారులు కుస్తీ పడుతున్నారు.

అయితే, ప్రతి కేటగిరీలోనూ 50శాతం స్థానాలను మహిళలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేసమయంలో రిజర్వేషన్లను 50శాతానికే పరిమితం చేయాలని ఆదేశించింది. ఇది రిజర్వేషన్ల ఖరారులో యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. జనరల్‌ స్థానాలను లాటరీ పద్ధతిలో ఖరారు చేయాలని నిర్ణయం తీసుకున్నా కొన్ని మండలాల్లో మూడేసి స్థానాలుంటే మొదటి రెండింటిని స్త్రీలకు కేటాయించినట్లు తెలిసింది. దీంతో ఆయా మండలాల్లో నిర్దేశిత 50శాతం కంటే అధికంగా మహిళలకు రిజర్వేషన్‌ అమలు చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఉదాహరణకు మంచాల మండలంలో మొత్తం 208 వార్డులుండగా.. ఇందులో జనరల్‌ 87, మహిళలకు 121 స్థానాలు దక్కాయి. దీంతో మహిళలకు 50శాతం కంటే అధికంగా సీట్లు లభిస్తున్నాయి. అలాగే మరో మండలంలోనూ ఇదే విచిత్రం జరిగింది. ఆ మండలంలో 232 వార్డులు ఉండగా.. జనరల్‌ 96, స్త్రీలకు 136 వార్డులు ఖరారు కావడంతో యంత్రాంగం తలపట్టుకుంది.

వార్డుల విభజన ప్రక్రియను ఎంపీడీఓ, ఈఓపీఆర్‌డీల కనుసన్నల్లో జరుగుతున్నాయి. అయితే, ప్రభుత్వ నియమావళికి అనుగుణంగా వ్యవహరించకపోవడంతో వార్డుల విభజనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఉన్నతాధికారులు కూడా సందేహాలను నివృత్తి చేసేందుకు చొరవ చూపకపోవడంతో వార్డుల రిజర్వేషన్ల ఖరారు పూర్తికాలేదు. రిజర్వేషన్ల ఖరారులో ఎస్సీ, ఎస్టీలకు జనాభా, బీసీలకు ఓటర్లను ప్రామాణికంగా తీసుకోవాలని, వార్డులకు పంచాయతీని యూనిట్‌గా పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సూత్రం ప్రకారం జనసంఖ్యను ఎగువ నుంచి దిగువకు లెక్కకట్టాలని తేల్చింది. ఈ సూత్రీకరణను ఆర్థంచేసుకోవడంలో పొరపాటు జరగడంతో మొత్తం ప్రక్రియకే ఎసరు తెచ్చిపెట్టింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top