మండలాలు ఓకే..

Telangana Panchayat Election Reservations Mahabubnagar - Sakshi

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): గ్రామపంచాయతీ రిజర్వేషన్లపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ పంచాయతీ ఏ వర్గానికి రిజర్వ్‌ అయిందనే విషయాన్ని ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఇప్పటికే జిల్లా యూనిట్‌గా రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసిన విషయం విదితమే. ఇక జిల్లా స్థాయిలో మండలాల వారీగా రిజర్వేషన్ల సంఖ్యను అధికారులు వెల్లడించినా.. జీపీల వారీగా మాత్రం రిజర్వేషన్ల ఖరారుపై అధికారిక ప్రకటన విడుదల కాలేదు. దీంతో ప్రజల్లోనే కాకుండా ఆశావహులు తమ గ్రామ సర్పంచ్‌ స్థానం ఎవరికి రిజర్వ్‌ అవుతుందనే అంశంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మొత్తం 721 గ్రామపంచాయతీలు 
జిల్లాలో పాతవి, కొత్తవి కలుపుకుని మొత్తం 733 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇందులో 12 జీపీలను మున్సిపాలిటీల్లో విలీనం చేయగా.. మిగిలిన 721 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా యూనిట్‌గా ప్రభుత్వం ఇటీవల రిజర్వేషన్లు వెల్లడించారు. ఇందులో భాగంగా 307 స్థానాలను జనరల్‌కు, 170 స్థానాలను బీసీలకు రిజర్వ్‌ చేయగా.. కొత్త పంచాయతీలుగా ఏర్పడిన 107 తండాలు వారికే రిజర్వ్‌ చేశారు. అలాగే, ఎస్సీలకు 107 స్థానాలు రిజర్వ్‌ చేసిన విషయం విదితమే. ఇక మైదాన ప్రాంతంలోనూ 30 జీపీలను ఎస్టీలకు రిజర్వ్‌ చేస్తూ నిర్ణయించారు.
 
మండలాల రిజర్వేషన్లు ఇలా... 
జిల్లా యూనిట్‌గా ప్రభుత్వం రిజర్వేషన్ల ప్రకారంఅధికారులు మండలాల వారీగా రిజర్వేషన్ల వివరాలు వెల్లడించారు. ఈ మేరకు జిల్లా లోని కృష్ణా, మాగనూర్, మక్తల్, నర్వ మం డలాల్లో ఎస్టీలకు ఒక్క స్థానం కూడా దక్కడం లేదు. ఇక దేవరకద్ర మండలంలో 100 శాతం ఎస్టీలు ఉన్న జీపీలు లేకపోగా.. మైదా న ప్రాంతానికి సంబంధించి మాత్రం ఒక్క స్థానం ఎస్టీలకు దక్కనుంది. అలాగే, అడ్డాకుల మండలంలోనూ జీపీగా మారిన తండా ఒక్కటే ఉండగా అది ఎస్టీలకు దక్కనుంది. అయితే, మైదాన ప్రాంత జీపీల్లో మాత్రం ఎస్టీలకు ఏ ఒక్కటీ రిజర్వ్‌ కాలేదు. ఇంకా బాలానగర్‌ మండలంలో 37 జీపీలు ఉండగా.. అత్యధికంగా 17 జీపీలు గిరిజనులకు రిజర్వ్‌ చేశారు.

అలాగే, ఎస్సీలకు సంబంధించి దామరగిద్ద, జడ్చర్ల, మ ద్దూర్, నారాయణపేట, నవాబ్‌పేట, ఊట్కూరు మండలాల్లో ఆరేసి స్థానాలు రిజర్వ్‌ అయ్యాయి. ఈ కేటగిరీలో అతి తక్కువగా కృష్ణా, మూసాపేట మండలాల్లో అతి తక్కువగా రెండేసి స్థానాలు దక్క నున్నాయి. అలాగే, బీసీల విషయానికొస్తే మక్తల్‌ మండలంలో ఎక్కువగా 15 స్థానాలు రిజర్వ్‌ అ య్యాయి. జనరల్‌ కేటగిరీని పరిశీలిస్తే నవాబుపేట మండలంలో 22 స్థానాలు రిజర్వ్‌ చేశారు. మొత్తం గా అన్ని కేటగిరీలు కలిపి 359 స్థానాలు స్త్రీలకు రిజర్వ్‌ చేయగా.. 362 స్థానాలను జనరల్‌ కేటగిరీకి కేటాయించారు. ఈ స్థానాల్లో స్త్రీ, పురుషుల్లో ఎవరైనా పోటీ చేసే అవకాశముంటుంది.
 
నేడు గ్రామాల వారీగా... 
జిల్లాలో మొత్తం 721 గ్రామపంచాయతీలు ఉండగా ఏ గ్రామం ఎవరికి రిజర్వ్‌ అవుతుందనే అంశం శనివారం తేలే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత సోమవారం జిల్లా యూనిట్‌గా ప్రభుత్వం రిజర్వేషన్లు వెల్లడించగా.. అధికారులు తీవ్ర కసరత్తు అనంతరం మండలాల వారీగా రిజర్వేషన్లను శుక్రవారం ప్రకటించారు. ఇక గ్రామాల వారీగా రిజర్వేషన్లు ఖరారుపై శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు అధికారులు కసరత్తు చేస్తూనే ఉన్నారు. ఈ మేరకు శనివారం ఈ వివరాలనువ వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.
 
పీఓ, ఏపీఓలకు ఎన్నికల శిక్షణ 
ఓ పక్క రిజర్వేషన్లపై కసరత్తు చేస్తున్న అధికారులు.. మరోపక్క ఎన్నికల నిర్వహణపై కూడా దృష్టి సారించారు. ఇందులో భాగంగా పీఓ, ఏపీఓలుగా గుర్తించిన ఉద్యోగులు నాలుగు రోజుల పాటు జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఇచ్చే శిక్షణ కొనసాగుతోంది. మాస్టర్‌ ట్రెయినర్లు నర్సింగ్‌రావు, గోపాల్‌నాయక్, మొగులప్ప, నటరాజ్‌.. బ్యాలెట్‌ బాక్స్‌ సీలింగ్, బ్యాలెట్‌ పేపర్‌ ఎలా వాడాలి, పోలింగ్‌ కేంద్రంలో అనుసరించాల్సిన పద్దతులు, ఓటర్లతో ఎలా వ్యవహరించాలనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈనెల 31వ తేదీ వరకు కొనసాగనుంది.

మూడు విడతల్లో ఎన్నికలు
జిల్లాలో పంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా జరగనున్నాయి. ప్రతీ విడతలతో 7 నుంచి 8 మండలాల్లోని జీపీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. నోటిఫికేషన్‌ వెలువడిన 15 రోజుల్లో పోలింగ్‌ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి అధికారులకు మార్గదర్శకాలు అందాయి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top