
కొండమల్లేపల్లి : తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు తెర పడింది. పలు గ్రామ పంచాయతీల్లో బుధవారం రాత్రి 10.30 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. సాయంత్రం 5 గంటల వరకు గ్రామ పంచాయతీ ప్రాంగణంలో క్యూలో ఉన్న వారికి స్లిప్పులు ఇచ్చి నామినేషన్లు తీసుకున్నారు. దేవరకొండ డివిజన్‌లోని దేవరకొండ, కొండమల్లేపల్లి, చింతపల్లి, డిండి, పీఏపల్లి, గుర్రంపోడు, మర్రిగూడ, చందంపేట, నేరేడుగొమ్ము, నాంపల్లి మండలాల పరిధిలోని 304 గ్రామపంచాయతీల 2,572 వార్డు స్థానాలకు ఈ నెల 21న ఎన్నికలు జరగనున్నాయి.
మొత్తంగా డివిజన్ పరిధిలోని 300 గ్రామపంచాయతీలకు గాను 2,229 మంది, 2,572 వార్డు స్థానాలకు 7,215మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. గురువారం నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఆతర్వాత అర్హుల జాబితా రూపొందిస్తారు. ఈనెల 13న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు పెట్టారు. ఆ తర్వాత బరిలో ఉండే వారి జాబితా ప్రకటిస్తారు.
పలు గ్రామాల్లో ఒకే నామినేషన్ దాఖలు
జిల్లాలో కడపటి వార్తలందేసరికి 7 గ్రామ పం చాయతీల్లో సర్పంచ్‌లకు ఒకే నామినేషన్ దాఖ లైంది. దేవరకొండ మండలం రత్యాతండా (ఎమ్మెల్యే రవీంద్రకుమార్ స్వగ్రామం), కొండమల్లేపల్లి మండలం చెన్నమనేనిపల్లి, డిండి మండలం కాల్యాతండా, పీఏపల్లి మండలం గణపల్లి, పుట్టంగండి, నాంపల్లి మండలం తిరుమలగిరి గ్రామాల్లో ఒకే నామినేషన్ దాఖలయ్యాయి.