నిమిషం లేటు.. మారిన ఫేటు

Telangana Inter Examinations Students Loses Exam Over 1 Minute Late - Sakshi

ఇంటర్‌ పరీక్షలు : నిమిషం నిబంధన కారణంగా పరీక్షలు రాయలేకపోయిన పలువురు విద్యార్థులు

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1339 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్‌ మొదటి, ద్వితీయ సంవత్సరానికి చెందిన 9.65లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. నేడు ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభంకాగా, రేపటినుంచి ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 8:45లోపు సెంటర్‌ లోపలికి వెళ్లాలని నిబంధన ఉండటంతో చాలా మంది విద్యార్థులు ఉరుకులు పరుగులతో 8గంటలకే సెంటర్ల దగ్గరకు చేరుకున్నారు. అయితే నిమిషం నిబంధన, ఇతర కారణాల వల్ల పలుచోట్ల కొంతమంది విద్యార్థులు పరీక్షలు రాయలేకపోయారు.

రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని వేములవాడలో ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినందుకు వెన్నెల రాజేశ్వరి అనే విద్యార్థినిని పోలీసులు పరీక్ష రాయటానికి అనుమతివ్వలేదు. 

పెద్దపల్లి : జిల్లాలోని  మంథని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల సెంటర్లో మరో ముగ్గురు విద్యార్థులు ఇంటర్ పరీక్ష రాయలేకపోయారు. హాల్‌ టికెట్ లేకుండా ఇద్దరు విద్యార్థులు, ఒకరు ఆలస్యంగా రావడంతో అధికారులు పరీక్షకు అనుమతించలేదు. దీంతో సదరు విద్యార్థులు అక్కడినుంచి వెనుతిరగాల్సి వచ్చింది. 

యాదాద్రి భువనగిరి : రామన్న పేటలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న వివిధ కాలేజీలకు చెందిన ఆరుగురు విద్యార్థులు సెంటర్‌ దగ్గరకు ఆలస్యంగా రావటంతో పరీక్ష హాల్‌లోకి అనుమతించలేదు. వారిలో ఐదుగురిది రామన్నపేట గవర్నమెంట్ కాలేజ్, ఒకరిది నలంద కాలేజ్‌గా గుర్తించారు.

నిజామాబాద్ : జిల్లాలో ఇద్దరు విద్యార్థులు పరీక్ష మిస్‌ అయ్యారు. వారిలో నిజామాబాద్‌కు చెందిన గణేష్ అనే విద్యార్థి సెంటర్ పేరు సేమ్ ఉండటంతో కన్ఫ్యూజన్‌కు గురై మరో సెంటర్‌కు వచ్చాడు. దీంతో అధికారులు అతడ్ని బయటకుపంపించేశారు. అదేవిధంగా బాల్కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని అనిత 10 నిమిషాలు ఆలస్యంగా రావడంతో అధికారులు పరీక్ష కేంద్రంలోకి అనుమతి లభించలేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top