గణతంత్ర వేడుకల్లో ఎగరని జాతీయ జెండా!

Telangana Governor Tamilisai Soundararajan Hoist National Flag - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 71వ గణతంత్ర వేడుకలు వైభవంగా జరిగాయి. పబ్లిక్‌ గార్డెన్‌లో ఆదివారం ఉదయం గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆమె తెలంగాణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ​కార్యక్రమంలో గవర్నర్‌ ప్రసంగిస్తూ.. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఎ‍న్నో రకాల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధిగమించారని ప్రశంసించారు. ఎన్నో అంశాల్లో తెలంగాణ  మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. 

కొత్త చట్టాలతో అవినీతి రహిత రాష్ట్రంగా పేరు గాంచిన తెలంగాణ ప్రజల పనుల్లో ఆలస్యం కాకుండా సేవలు అందిస్తోందని పేర్కొన్నారు. పల్లె ప్రగతితో తెలంగాణ గ్రామాలు సత్ఫలితాలను సాధించాయన్నారు. కొత్త రెవెన్యూ చట్టంతో అవినీతికి తావు లేని స్వచ్ఛమైన రెవెన్యూ పాలన అందించాలని నిర్ణయించామన్నారు. మిషన్‌ భగీరథ, 24 గంటల కరెంటు, కొత్త ఇరిగేషన్‌ ప్రాజెక్టులతో సాగు, తాగు నీరందిస్తున్నారని వ్యాఖ్యానించారు. అనంతరం అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జైహింద్‌, జై తెలంగాణ అంటూ తెలుగులో ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్‌, మంత్రులు, పలువురు అధికారులు హాజరయ్యారు.

జెండా ఎగరేయడంలో ఆలస్యం
పబ్లిక్‌ గార్డెన్‌లో గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ జాతీయ జెండా ఎగురవేయడంలో కాస్త ఆలస్యం జరిగింది. త్రివర్ణ పతాకం ఎగరకుండా అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. దీంతో గవర్నర్‌ మరోసారి జెండా ఎగరవేయగా అది పైకి వెళ్లిందే తప్ప ఎగరలేదు. దీంతో జెండాను కిందకు దించి మళ్లీ ఎగురవేశారు. ఇక ఈ సమయంలో జెండా ఆవిష్కరణ జరగకముందే జాతీయ గీలాపనను రెండు మూడు సార్లు ఆలపించడంతో సీఎం కేసీఆర్‌ విచారంగా చూశారు. అనంతరం గవర్నర్‌ మరోసారి జెండాను ఎగరేసే ప్రయత్నం చేయగా ఎట్టకేలకు త్రివర్ణ పతాకం రెపరెపలాడటంతో అందరూ జాతీయ గీతాన్ని ఆలపించారు.

కోర్టులో గణతంత్ర వేడుకలు
మరోవైపు తెలంగాణ హైకోర్టులో గణతంత్ర వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ వేడుకల్లో పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top