పొలిటికల్‌ ‘గిఫ్ట్స్‌’..

Telangana Elections 2018 Political Leaders Gifts To Voters - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘హైదరాబాద్‌ శివారులో ఓ చిరుద్యోగి తన కుమారుడి పుట్టినరోజు జరిపాడు. దాదాపు 200 మంది స్థానికులు హాజరైన ఆ వేడుకకు అయిన ఖర్చు రూ.2 లక్షలు. ‘కరీంనగర్‌ జిల్లాలో ఓ టీచర్‌ ఇంట్లో జరిగిన వ్రతానికి కాలనీవాసులు పెద్దెత్తున హాజరయ్యారు. దీనికి అయిన ఖర్చు రూ.4 లక్షలపైమాటే’. ఈ రెండు కార్యక్రమాలకు హాజరైనవారంతా స్థానికులే. తిరిగి వెళ్లేటప్పుడు అంతా మంచి బహుమతులతో వెళ్లారు. వాస్తవానికి ఈ కార్యక్రమాలు అంత ఆర్భాటంగా జరగడానికి కారణం స్థానిక రాజకీయ నాయకులే. ఎందుకు ఇదంతా అంటారా? ఎన్నికల సమయంలో ఈసీ కంటపడకుండా ఉండేందు కేనట.. ఇలా చాలాచోట్ల గెట్‌ టుగెదర్, పెళ్లి రోజుల పేరిట ‘స్పాన్సర్‌’ కార్యక్రమాలకు తెరలేపారు.

తెలంగాణలో ఎన్నికల సంగ్రామం మొదలైంది. సోమవారం నామినేషన్ల పర్వం ప్రారంభమైన దరిమిలా అభ్యర్థుల ఖర్చుపై ఎన్నికల సంఘం నిఘా  పెట్టింది. ఎవరెవరు ఏం చేస్తున్నారు? ఏ అభ్యర్థి ఎంత ఖర్చు చేస్తున్నారు? ఎలా ప్రచారం చేస్తున్నారు? అన్న విషయాలపై  ఈసీతోపాటు ప్రత్యర్థి పార్టీలు, మీడియా నిఘా కూడా ఉంటుంది. ఇప్పటికే కుల సంఘాల సమావేశాలపైనా నిఘా ఉంటుందని ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసిన నేపథ్యంలో వీటిని తప్పించుకోవడానికి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. దీంట్లో భాగంగా చిన్న చిన్న శుభకార్యాలు, పార్టీలను ఎంచుకుంటున్నారు. ‘స్పాన్సర్‌’విందులను సృష్టిస్తున్నారు. 

కార్యకర్తలకు స్పెషల్‌ టాస్క్‌లు.. 
ప్రతీ నియోజకవర్గంలోనూ దాదాపుగా అభ్యర్థులంతా ప్రచారం మొదలుపెట్టారు. వీరిలో ముఖ్యంగా నగర నేపథ్యమున్న కాలనీల్లో అభ్యర్థులు పలువురు కార్యకర్తలకు స్పెషల్‌ టాస్క్‌లు అప్పగిస్తున్నారు. ఎవరి ఇళ్లల్లో శుభకార్యాలు జరుగుతున్నాయో వెదకడమే వీరి పని. ఇప్పటికే చాలాచోట్ల డిసెంబర్‌ 5 వరకు ఎవరి ఇంట్లో విందులు, శుభకార్యాలు, వ్రతాలు చేస్తున్నారో ముందే సమాచారం తెప్పించుకుని పెట్టుకున్నారు. వీరంతా వెళ్లి శుభకార్యాల నిర్వాహకులను కలసి విందు ఖర్చంతా తామే భరిస్తామని వారిని ఒప్పిస్తున్నారు. మొహమాటానికి పోయి కొందరు, ఖర్చు వారే భరిస్తున్నారుగా అని ఇంకొందరు ఓకే అంటున్నారు.  

చివర్లో నాయకుల రంగప్రవేశం.. 
అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక ఆఖర్లో స్పాన్సర్‌ చేసిన నాయకుడూ సదరు శుభకార్యానికి వస్తాడు. అందరినీ కలుస్తాడు. యోగక్షేమాలు అడుగుతాడు. కలసి భోజనం చేసిన తరువాత అసలు ప్రచారం మొదలవుతుంది. ఈసారి ఓటు తనకే వేయాలని విజ్ఞప్తి చేస్తాడు. కార్యక్రమం చివర్లలో రివర్స్‌ గిఫ్ట్‌ల పేరిట చీరలు, కానుకలు, నగదు తదితరాలు పంచుతున్నారు. కానుకల్లోనూ వయసుల ఆధారంగా వ్యత్యాసాలుంటున్నాయి. ఎవరి అభిరుచి మేరకు వారిని సంతృప్తి చేసేందుకు బాగానే ఖర్చు చేస్తున్నారు. ఇవే కాకుండా.. చాలామంది కార్యకర్తలు తమ ఇంట్లోనూ ఇలాంటి స్పాన్సర్‌ కార్యక్రమాలను ‘ఫిక్స్‌’చేస్తున్నారు. వివిధ రకాల వ్రతాలు, గెట్‌ టు గెదర్‌ల పేరిట విందులు ఏర్పాటు చేస్తున్నారు. వీటికి మళ్లీ తమ నేతను ముఖ్యఅతిథిగా పిలుస్తారు. తరువాత అంతా షరామామూలే! 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top