ఎన్నికలకు సైన్యం సిద్ధం

Telangana Election Police Department Is Ready Adilabad - Sakshi

ఆదిలాబాద్‌అర్బన్‌: డిసెంబర్‌లో జరిగే శాసనసభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంతోపాటు వంద శాతం పోలింగ్‌ నమోదు చేయాలనేది జిల్లా ఎన్నికల అధికారుల లక్ష్యం.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలకు అనుగుణంగా ఎన్నికల సిబ్బందిని నియమిసేŠ?త్న అనుకున్న లక్ష్యం చేరుకోగలమని భావిస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురంభీం జిల్లాల పరిధిలోని పది అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఎన్నికల నిర్వహణకు మొత్తం 15,000 మంది సిబ్బంది అవసరమని ప్రాథమికంగా అంచనా వేశారు.

ఇందుకు ఆయా జిల్లాల వారీగా అధికారులు, సిబ్బంది వివరాలను సేకరిస్తున్న జిల్లా ఎన్నికల విభాగం అధికారులు ఆయా జిల్లాలకు సిబ్బందిని కేటాయించే పనిలో తలామునకలవుతున్నారు. ఇప్పటి వరకు 13 వేల మంది సిబ్బంది వివరాలను సేకరించి ఆయా జిల్లాలకు కేటాయించారు. ఇంకా 2 వేల మంది సిబ్బంది అవసరముంది. పది నియోజకవర్గాలకు ఈ జిల్లా నుంచే సిబ్బందిని నియమించనుండడంతో కసరత్తు ముమ్మరం చేశారు. మరో రెండు, మూడు రోజుల్లో పూర్తి స్థాయి సిబ్బందిని నియమించి జిల్లాల వారీగా ఎన్నికల బాధ్యతలు అప్పగించనున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.

పది నియోజకవర్గాలు
పాత ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలు ఉన్నాయి. ఈ నాలుగు జిల్లాలో మొత్తం 2,497 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి దాదాపు ఆరుగురు సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్‌ రోజు నలుగురు సిబ్బంది విధుల్లో ఉన్నా.. ఒకరు లేదా ఇద్దరు రిజర్వులో ఉంటారు. మరీ ముఖ్యంగా ప్రతీ పోలింగ్‌ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, ఇతర ప్రిసైడింగ్‌ అధికారి ఉండేట్లు చూస్తున్నారు. ఒక్కో జిల్లాకు 3,500 నుంచి 3,850 మంది సిబ్బందిని కేటాయించేందుకు సిద్ధమవుతున్నారు. ఎక్కువ పోలింగ్‌ కేంద్రాలు ఉన్న జిల్లాకు ఎక్కువ మంది సిబ్బందిని కేటాయించనుండగా, పోలింగ్‌ కేంద్రాలు దూర ప్రాంతాల్లో ఉన్న జిల్లాకు మరింత అదనంగా సిబ్బందిని కేటాయించేందుకు చర్యలు చేపట్టారు.

ఈ లెక్కన పది నియోజకవర్గాలకు 15,000 వేల సిబ్బంది అవసరముంది. ఒక్కో నియోజకవర్గానికి 1,500 నుంచి 1,800 మంది సిబ్బంది కేటాయించేందుకు ఎన్నికల అధికారులు లెక్కేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా, ఉమ్మడి జిల్లా ఎన్నికల నోడల్‌ అధికారి, ఆదిలాబాద్‌ కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ గురువారం విలేకరుల సమావేశం నిర్వహించి పలు విషయాలను వెల్లడించారు. నాలుగు జిల్లాలకు ఇక్కడి నుంచే ఎన్నికల సిబ్బందిని నియమిస్తామని, ఆయా జిల్లాలో పనులు చేస్తున్న సిబ్బందికి అదే జిల్లాల్లో ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టం చేశారు.

2,497 పోలింగ్‌ కేంద్రాలు.. 12,942 మంది సిబ్బంది రెడీ 
ఉమ్మడి జిల్లాలో 2,497 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. అంతే మోతాదులో 12,500 మంది ఎన్నికల సిబ్బంది జాబితా కూడా సిద్ధమైంది. ఇందులో 3,249 మంది మహిళా సిబ్బంది ఉండగా, 9,693 మంది పురుషులు ఉన్నారు. వీరు కాకుండా మరో 2 వేల మంది సిబ్బందిని నియమించేందుకు కసరత్తు జరుగుతోంది. ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదిలాబాద్, బోథ్‌ రెండు నియోజకవర్గాల్లో 518 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఈ జిల్లాకు 3,837 మంది పోలింగ్‌ సిబ్బందిని కేటాయించారు.  మరింత సిబ్బందిని కేటాయిస్తారా.. లేదా.. అన్న విషయం అధికారులు చెప్పలేకపోతున్నారు. ఆసిఫాబాద్‌లో ఆసిఫాబాద్, సిర్పూర్‌ నియోజకవర్గాల్లో మొత్తం 532 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఈ రెండు అసెంబ్లీ స్థానాలకు 2,087 మంది సిబ్బందిని కేటాయించారు. ఆసిఫాబాద్‌కు ఇంకా కేటాయింపు విషయం తెలియాల్సి ఉంది.

మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్‌ మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ జిల్లాలో ఏర్పాటు చేసిన 698 పోలింగ్‌ కేంద్రాలకు 3,307 మంది సిబ్బంది కేటాయించి సిద్ధంగా ఉంచారు. ఇంకొంత మంది సిబ్బంది కేటాయింపు విషయం తెలియాల్సి ఉంది. నిర్మల్‌ జిల్లాలో నిర్మల్, ముథోల్, ఖానాపూర్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ మూడు అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 749 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, 3,711 మంది ఎన్నికల సిబ్బంది విధులకు తయారయ్యారు. ఇంకా సిబ్బందిని కేటాయిస్తారో లేదో అనుమానంగా ఉంది. కాగా, 2014 ఎన్నికల్లో పది అసెంబ్లీ స్థానాల్లో 2,233 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. అప్పుడు దాదాపు 21 వేల మంది ఎన్నికల సిబ్బంది నియమించగా, ప్రస్తుతం ఆ సంఖ్య 15 వేలకు తగ్గింది.

ఎన్నికల విధుల్లో 942 మంది అధికారులు.. 
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినప్పటికీ నుంచి నలుగురు కలెక్టర్లతోపాటు 942 మంది వివిధ విభాగాల అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. వివిధ బృందాల సభ్యులు ప్రతి నియోజకవర్గంలో 94 మంది వరకు అనునిత్యం పాలు పంచుకుంటున్నారు. ప్రతీ జిల్లాలో నోడల్‌ అధికారులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాల సభ్యులు, వీడియో వ్యూయింగ్‌ బృందం(వీవీటీ), వీడియో సర్వేలెన్స్‌ బృందం(వీఎస్టీ), అకౌంటింగ్‌ బృందం, మాడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ బృందం, స్టాటిక్‌ సర్వేలెన్స్‌ బృందం(ఎస్‌ఎస్‌టీ) అధికారులు గత నెలన్నర నుంచి ఎన్నికల బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీరు కాకుండా 62 మంది సెక్టోరల్‌ అధికారులు, పది మంది రిటర్నింగ్‌ అధికారులు, 72 మంది సహాయ రిటర్నింగ్‌ అధికారులు కూడా ఎన్నికల్లో పాలుపంచుకుంటున్నారు. వీరికితోడు గత మూడు రోజుల క్రితం కేంద్రం ఎన్నికల సంఘం జిల్లాకు సాధారణ, వ్యయ, పోలీసు పరిశీలకులను కూడా నియమించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top